రాష్ట్ర సరిహద్దులో ఏనుగుల మంద.. అటవీ అధికారులకు శిక్షణ

రాష్ట్ర సరిహద్దులో ఏనుగుల మంద.. అటవీ అధికారులకు శిక్షణ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు వద్ద ఏనుగుల మంద సంచరిస్తుండడంతో రాష్ట్ర అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఒకవేళ ఏనుగుల మంద తెలంగాణలోకి ప్రవేశిస్తే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై అన్ని జిల్లాల ఫారెస్ట్ ఆఫీసర్లతో సోమవారం వర్క్​షాప్ నిర్వహించారు. దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ డోబ్రియల్ సహా ఉన్నతాధికారులంతా పాల్గొన్నారు. ఇటీవల ఓ ఏనుగు.. మంద నుంచి విడిపోయి తెలంగాణలోకి వచ్చింది. ఈ ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు చనిపోయారు. 

ఇప్పుడు ఏకంగా ఏనుగుల మందే సరిహద్దులో తిరుగుతుండడంతో, పరిస్థితి చేయి దాటిపోకుండా చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు పీసీసీఎఫ్ సూచించారు. సరిహద్దు గ్రామాల ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజలకు, వారి నివాసాలకు హాని చేయకముందే, ఏనుగులను ఎలా తిరిగి పంపాలన్న దానిపై జిల్లాల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించొద్దని కోరారు. సరిహద్దు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఏనుగుల కదలికలపై అధునాతన సాంకేతిక పరికరాలతో నిఘా పెట్టాలని సూచించారు. చత్తీస్​గఢ్​కు చెందిన రిటైర్డ్‌‌‌‌ అధికారి పీవీ నరసింహా రావు ఏనుగుల మందను ఎదుర్కోవడంపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. అక్కడ అనుసరించిన సక్సెస్‌‌‌‌ ఫుల్ విధానాలను వివరించారు.