మూడు నెలలు.. రూ.15 వేల కోట్లు

మూడు నెలలు.. రూ.15 వేల కోట్లు
  • ఈనెల 11 నుంచి తీస్కునుడు షురూ
  • అత్యధికంగా మేలో రూ.8 వేల కోట్ల అప్పులు
  • వచ్చే ఏడాది మార్చి నాటికి 5 లక్షల కోట్లు దాటనున్న అప్పులు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర సర్కార్​ మళ్లీ అప్పులకు తయార్​ అవుతోంది. ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభమైందో లేదో కొత్త అప్పులు ఇవ్వాలంటూ ఆర్బీఐకి విజ్ఞప్తి చేసింది. రాబోయే మూడు నెలల్లో రూ.15 వేల కోట్ల అప్పులకు ఇండెంట్​ పెట్టింది. ఈ మేరకు ఆర్బీఐ ప్రకటించిన వివిధ రాష్ట్రాల క్వార్టర్లీ అప్పుల క్యాలెండర్​తో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దాని ప్రకారం ఏప్రిల్​లో రూ.3 వేల కోట్లు, మేలో రూ.8 వేల కోట్లు, జూన్​లో రూ.4 వేల కోట్ల అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్​పెట్టుకుంది. ఆర్బీఐ ప్రతి నెలా నిర్వహించే బాండ్ల వేలం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించుకోనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.59,672 కోట్ల అప్పులు చేసేందుకు సర్కారు నిర్ణయించినట్టు ఆర్బీఐ క్యాలెండర్​తో వెల్లడైంది. వాస్తవానికి ఇప్పటికే  రాష్ట్రప్రభుత్వంపై ఈ ఏడేండ్లలో చేసిన అప్పుల ఇన్​స్టాల్​మెంట్లు, వాటి వడ్డీల భారం భారీగా పెరిగిపోయింది. నిరుడు నెలకు సగటున రూ.1,500 కోట్లు వడ్డీలకే కట్టింది. ఇప్పుడు వాటికితోడు అదనంగా నెలనెలా మరో రూ.100 కోట్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆ అప్పుల చెల్లింపుల కోసమే అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు.  

ఈ ఏడాది డబుల్​
నిరుడు ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో రూ.8 వేల కోట్ల అప్పులు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అంతకు మించి తీస్కుంటోంది. ఒక్క మేలోనే రూ.8 వేల కోట్ల అప్పు చేస్తోంది. జూన్​లో రైతుబంధు చెల్లించాల్సి ఉండడంతో ఆ స్థాయిలో అప్పులు తీసుకోవాల్సి వస్తోందని అధికారులు చెప్తున్నారు. నిరుడు కూడా రైతుబంధుకు అప్పులే ఆధారమంటున్నారు. జూన్ నుంచే కొత్త ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు సర్కారు యోచిస్తోంది. అందుకే అప్పులు చేస్తోందని అంటున్నారు. 

అప్పు పుడితేనే జీతాలు
ప్రతినెలా ఫస్టుకు పడాల్సిన ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆలస్యంగా పడుతున్నాయి. ఏడో తేదీ వచ్చినా చాలా మంది ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు పడలేదు. పెన్షనర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ క్రమంలోనే వారి జీతాల కోసమూ ప్రభుత్వం అప్పులనే నమ్ముకుంది. ఈనెల 11 నాటికి వెయ్యి కోట్లకు ఇండెంట్​ పెట్టింది. ఆ పైసలు వస్తేనే ఉద్యోగులకు జీతాల చెల్లింపులు పూర్తవుతాయని అంటున్నారు. వేస్​ అండ్​ మీన్స్​ కింద1,700 కోట్లు తీసుకునేందుకు అనుమతి ఉండగా.. ఆ మొత్తాన్నీ ఆర్బీఐ నుంచి సర్కార్​ ఇప్పటికే తీసుకుని వాడేసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ నెలలో ఇవ్వాల్సిన ఆసరా పింఛన్లను నెలాఖారులోనే ఇస్తారని అంటున్నారు. 

కొత్త కార్పొరేషన్ల పేరుతో మరిన్ని రుణాలు
రాష్ట్రం చేస్తున్న అప్పులు వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.5 లక్షల కోట్లను దాటనున్నాయి. ఈ ఏడాది తీసుకునే రూ.59,632 కోట్లు అప్పు కాకుండా.. పాత కార్పొరేషన్లతో పాటు ఈ ఏడాది కొత్త కార్పొరేషన్ల పేరుతో మరిన్ని రుణాలను తీసుకోనుంది. అవి రూ.1.36 లక్షల కోట్లుగా ఉండే అవకాశం ఉంది. దీంతో బడ్జెట్​లో చూపిన రూ.3.44 లక్షల కోట్ల అప్పులకు.. వీటిని కలిపితే మొత్తం అప్పులు రూ.5 లక్షల కోట్లు దాటనున్నాయి.