నిధులివ్వని సర్కార్..బడుల నిర్వహణకు హెచ్ఎంల తిప్పలు

నిధులివ్వని సర్కార్..బడుల నిర్వహణకు హెచ్ఎంల తిప్పలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బడుల నిర్వహణ, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసుకోవడంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తిప్పలు పడుతున్నారు. ఆలస్యంగా ఫండ్స్​ ఇచ్చిన ప్రభుత్వం ఖర్చు చేసుకునే లోపే హెచ్ఎంలకు తెలియకుండానే నిధులను వాపస్​ తీసుకోవడంతో అవాక్కయ్యారు. బడుల నిర్వహణకు నిధులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

రూ.3 కోట్లకు పైగానే

ఈ ఏడాది స్కూల్​ నిర్వహణ కోసం విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఒక్కో స్కూల్​కు రూ.15 వేల నుంచి రూ. లక్షకు పైగా రిలీజ్​ చేసింది. బడుల్లో చిన్నచిన్న మరమ్మతులు, పరిశుభ్రత, చాక్​పీస్​లు, డస్టర్లు, స్టూడెంట్స్, టీచర్స్​ అటెండెన్స్​ రిజిష్టర్ల కొనుగోలు, ఫ్యాన్లు, లైట్ల రిపేర్లు వంటి పలు పనుల కోసం ఈ నిధులను ఖర్చు చేసుకొనేవారు. జిల్లాలోని 1,068 పాఠశాలలకు ప్రభుత్వం రూ.3.25 కోట్ల వరకు ఏప్రిల్​ నెల మొదట్లో రిలీజ్​ చేసింది. నిధులు రావడంతో కొందరు హెచ్ఎంలు స్కూల్స్​లో రిపేర్లు చేయించుకోవడంతో పాటు అవసరమైన స్టేషనరీ కొనుగోలు చేశారు. ఇంకొంత మంది స్కూళ్లు రీ ఓపెన్​ అయ్యాక స్టేషనరీతో పాటు ఇతర సామగ్రి కొనుగోలు చేయవచ్చనే ఆలోచనలో ఉన్నారు.

ఈ లోపే యూనియన్​ బ్యాంక్​లో రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎంలకు సంబంధం లేకుండా సింగిల్​ నోడల్​ అకౌంట్ ​ఓపెన్​ చేసింది. ఈ అకౌంట్​లోకి స్కూల్​ గ్రాంట్స్, సివిల్​ వర్క్స్, ఎమ్మార్సీ గ్రాంట్స్​తో పాటు ఇతరత్రా ఫండ్స్​ను ట్రాన్స్ ఫర్​ చేయాలని ఆదేశించడంతో హెచ్ఎంలు నిధులను ట్రాన్స్​ఫర్​ చేశారు. ఆ తరువాత గవర్నమెంట్​ నిధులను ఇన్​టైంలో ఖర్చు చేయలేదని చెబుతూ ఈ డబ్బులన్నీ హెచ్ఎంలతో సంబంధం లేకుండా వెనక్కి తీసుకుంది. స్కూల్స్​ ప్రారంభమైన సమయంలో అవసరమైన ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో చేసేదేమి లేక తమ జేబుల్లోంచి ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిధులను వెంటనే తిరిగి ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు. 

తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలి

గత విద్యా సంవత్సరానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో హెచ్ఎంలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే డబ్బులను తిరిగి ఇవ్వాలి. యూనియన్​ తరపున గవర్నమెంట్​కు ఈ విషయంపై విన్నవిస్తాం.
–డి వెంకటేశ్వరరావు, పీఆర్టీయూ జిల్లా ప్రెసిడెంట్