కంటోన్మెంట్​ను జీహెచ్ఎంసీలో విలీనానికి సన్నాహాలు

కంటోన్మెంట్​ను జీహెచ్ఎంసీలో విలీనానికి సన్నాహాలు
  • పది రోజుల కిందట ఆరుగురు సభ్యులతో --కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  •     తొలి దశగా సివిలియన్​ ఏరియా, సర్కారు  స్థలాల గుర్తింపు 
  •     రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు

కంటోన్మెంట్, వెలుగు: సికింద్రాబాద్​లోని​ కంటోన్మెంట్​ ఏరియాను  జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. సాధ్యాసాధ్యాలను  అంచనా వేసేందుకు ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని పది  రోజుల కిందట నియమించింది. ఈ కమిటీ  తొలి దశగా కంటోన్మెంట్​లోని సివిలియన్​ ఏరియాతో పాటు, ప్రభుత్వ భూములను  సర్వే చేయనుంది. ఈ రిపోర్టు ఆధారంగా కంటోన్మెంట్ సివిలియన్​ ప్రాంతాలను  జీహెచ్ఎంసీలో విలీనం చేయనున్నారు. జీహెచ్ఎంసీలో విలీనం కావడం  వల్ల తాము కూడా గ్రేటర్ వాసులతో  సమానంగా అన్ని రకాల సౌకర్యాలను పొందుతామని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల  మేరకు  మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్​కుమార్ ఆరుగురు సభ్యులతో ఓ ప్యానెల్​ను నియమించారు. ఇందులో కంటోన్మెంట్ బోర్డు సీఈవో అజిత్ రెడ్డి, బల్దియా సిటీ చీఫ్ ప్లానర్ దేవేందర్​రెడ్డి,  కంటోన్మెంట్​బోర్డు సిటీ చీఫ్​ ప్లానర్​ బాలకృష్ణ, సికింద్రాబాద్​ ఆర్డీవో వసంతకుమారి, జీహెచ్​ఎంసీ ప్లానింగ్ వింగ్​ డైరెక్టర్​కె. శ్రీనివాస్ ఉన్నారు.  ఇప్పటికే ఈ కమిటీ కంటోన్మెంట్ జాగ్రఫిక్ ఏరియాపై సర్వే నిర్వహించి బల్దియాలో విలీనం చేయాలని నిర్ణయించిన ప్రాంతాలను గుర్తించింది. మున్సిపాలిటీల్లో విలీనమైన మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు చెందిన రిపోర్టును కమిటీ సభ్యులు స్టడీ చేశారు.  కంటోన్మెంట్ ఏరియా దాదాపు 40 చదరపు కి.మీ పరిధిలో విస్తరించి ఉంది. ఎక్సిషన్ ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం కంటోన్మెంట్ పరిధిలోని అన్ని ఆస్తులపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు హక్కులుంటాయి. అయితే విలీనం జరిగిన సమయంలో ఈ ఆస్తులన్నీరాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా బదిలీ అవుతాయని ఆ ఉత్తర్వుల్లో ఉంది. ఖాళీ స్థలాలపై మాత్రం రక్షణ శాఖకే అధికారాలుంటాయి. 

బోర్డు ఉద్యోగుల వివరాల సేకరణ...

బోర్డు పరిధిలో పనిచేస్తున్న పర్మినెంట్​,కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ఉద్యోగుల వివరాలను ప్యానెల్​ సేకరించనుంది. విలీనం జరిగితే ఉద్యోగులను బోర్డు పరిధిలోని మున్సిపాలిటీలకు బదిలీ చేయడంతో పాటు స్టాఫ్​ క్వార్టర్లను  రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తారు.  కంటోన్మెంట్ పరిధిలో ఉన్న నిధులన్నీ  విలీనం చేసే సమయానికి  రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ అవుతాయి. దీంతో ఎంత మేరకు ఫండ్స్ ఉన్నాయనే విషయాలను  కమిటీ అధ్యయనం చేస్తుంది. విలీనం తర్వాత కంటోన్మెంట్ బోర్డు ఆఫీసులోని కొంత భాగాన్ని మున్సిపల్ పనుల కోసం ఉచితంగా వాడుకునే అవకాశం  ఉంది.
సమస్యల పరిష్కారం దిశగా..
కంటోన్మెంట్​ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వాసవీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తేలుకుంట సతీశ్ గుప్తా అన్నారు. గ్రేటర్ లో విలీనమైతే తాగు నీటితో పాటు ఇతర సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.  దీనిపై గతంలోనే 3,500 మందితో  సంతకాల సేకరణ చేశామన్నారు. విలీనం జరిగితే  ఫ్లై ఓవర్, ఫుట్​ఓవర్​ బ్రిడ్జిల నిర్మాణం జరిగి ట్రాఫిక్ సమస్య తీరే అవకాశాలుంటాయని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అన్నారు.