
నాగర్ కర్నూల్, వెలుగు: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో కార్మిక చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదని జాతీయ లేబర్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల ఉల్లంఘనలో రాష్ట్ర ప్రభుత్వమే దోషి అని ఆరోపించారు. ఈ మేరకు కేంద్రానికి, పర్యావరణ ఉల్లంఘనలపై ఎన్జీటీకి నివేదిక సమర్పిస్తామన్నారు. శుక్రవారం ఆయన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం, నార్లాపూర్ అండర్ గ్రౌండ్ పంప్‌హౌజ్, సర్జ్‌పూల్, హెడ్ రెగ్యులేటర్ పనులను పరిశీలించారు. అక్కడ రక్షణ, భద్రతా ప్రమాణాలు పట్టించుకోవడం లేదని గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు, లేబర్ కాంట్రాక్టర్ల వివరాలు, లైసెన్స్ తదితర అంశాలపై ప్రశ్నించగా ఆఫీసర్లు అందుబాటులో లేవని చెప్పడంతో మండిపడ్డారు. లేబర్లైసెన్స్లేకుండా ఆరున్నర ఏండ్లుగా ఇంత భారీ ప్రాజెక్టు పనులు ఏవిధంగా కొనసాగించారని నిలదీశారు. నార్లాపూర్ పంప్‌హౌజ్, సర్జ్‌పూల్‌లో పనిచేసేందుకు 100 లేబర్ పర్మిషన్ ఉన్న కాంట్రాక్టర్ వందలాది మందితో పని చేయించడం ఏమిటని ప్రశ్నించారు. 15 రోజుల్లో పూర్తి వివరాలు ఇవ్వకపోతే ఈఎన్ సీకి నోటీసులు ఇవ్వాలని అసిస్టెంట్లేబర్ కమిషనర్‌ను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో 13 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, ఇందులో 8 లక్షల మందికి రెన్యువల్ కాలేదంటే ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుందో అర్థమవుతోందన్నారు. కరోనా తర్వాత కేంద్రం కార్మికులను ఆదుకునేందుకు ఇచ్చిన ఆర్థిక సహాయం, కార్మిక సంక్షేమ మండలి బోర్డు డబ్బులు రూ.1,004 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. ఆయనతోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు, నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ఇన్చార్జి దిలీపాచారి ఉన్నారు.