రాష్ట్రానికి రావాల్సిన నవోదయ స్కూళ్లను కేంద్రం ఇవ్వలేదు: మంత్రి తలసాని

రాష్ట్రానికి రావాల్సిన నవోదయ స్కూళ్లను కేంద్రం ఇవ్వలేదు: మంత్రి తలసాని

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నవోదయ స్కూళ్లను కేంద్రం ఇవ్వలేదని, అయినా గురుకులాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసి, అభివృద్ధి చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. రాబోయే మూడు, నాలుగు సంవత్సరాల్లో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు వస్తాయన్నారు. భవిష్యత్తులో విద్యా రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంటుందన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ విద్యా దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. 

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవం వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేనతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విద్యా దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల విద్యార్థులతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యా దినోత్సవ వేడుకల్లో V6 బోనాలు, బతుకమ్మ పాటలకు విద్యార్థులు ప్రత్యేక నృత్యాలు చేశారు. 

గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తోందని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంత స్కూళ్లల్లో సరైన వసతులు, విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు, ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. విద్యా సరస్వతిని ముందుకు తీసుకెళ్లాలని ‘మన ఊరు మన బడి’ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. 

‘‘చదువు మనకు ఎందుకులే అన్న పరిస్థితులు ఈరోజు లేవు. ప్రతి రైతు కొడుకు చదువుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో దేశంలో ఏ పరీక్ష జరిగినా.. తెలంగాణ నుంచే అత్యధికంగా ర్యాంకులు వస్తాయి. గతంలో మెస్ చార్జీల విషయంలో గొడవలు జరిగివే. ఈరోజు అలాంటి పరిస్థితులు లేవు. చదువులతో పాటు స్పోర్ట్స్ మీద పిల్లలకు ఆసక్తి కలిగేలా తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలి’’ అని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు.