హనుమకొండ/ జయశంకర్భూపాలపల్లి/ ములుగు/ జనగామ అర్బన్, వెలుగు: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఎలాంటి కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, లేకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అర్ధరాత్రి 12.30 గంటల వరకే ముగించి, క్షేమంగా ఇండ్లకు చేరాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ సంబురాల పేరున అశ్లీల డ్యాన్సులు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు.
పోలీసుల పర్మిషన్ తో ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా ఆ ప్రదేశంలో సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. వేడుకల్లో ఎలాంటి మత్తు పదార్థాలు వినియోగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో సంబురాలు జరిపితే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని, ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే ‘డయల్ 100'కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
నైటంతా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
డిసెంబర్ 31 రాత్రి నిర్వహించే వేడుకల సందర్భంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో స్థానిక పోలీసులతో పాటు ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, క్రైమ్, షీ టీమ్స్‌తో నైటంతా ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తామని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. వేడుకల పేరుతో మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే ఊరుకోబోమన్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని, తాగి పోలీసులకు చిక్కితే జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఎస్పీలు సిరిశెట్టి సంకీర్త్, సుధీర్ రాంనాథ్ కేకన్, జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆయా జిల్లా కేంద్రాల్లో మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటివ్వకుండా వేడుకలు జరుపుకోవాలని, ప్రజలను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవన్నారు. మైనర్లు వాహనాలు నపితే, వారితోపాటు తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ప్రజలు ఇండ్లలోనే జరుపుకోవాలని, కుటుంబంతో సంతోషంగా గడపాలని అధికారులు ఆకాంక్షించారు.
