ఎల్ఆర్ఎస్ ఎత్తేద్దామా..ఫీజు తగ్గిద్దామా.?

ఎల్ఆర్ఎస్ ఎత్తేద్దామా..ఫీజు తగ్గిద్దామా.?

హైదరాబాద్, వెలుగు: ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్)ను ఏం చేద్దామనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్కీమ్ ను ఉన్నది ఉన్నట్లు అమలు చేయడం కష్టమని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఎల్ఆర్ఎస్ వల్లే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు నెగటివ్ తీర్పు ఇచ్చారని టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఇబ్బందులు లేకుండా స్కీమ్ ను ఎలా అమలు చేయాలనే అంశంపై రియల్టర్లు, లోకల్ లీడర్లు, ఇతర వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకునే చాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ప్రభుత్వం ముందు మూడు ఆప్షన్లు!

ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం ముందు మూడు ఆప్షన్లు ఉన్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. ఫీజును తగ్గించి స్కీమ్ ను అమలు చేయడం.. ముందు కొంత ఫీజు కట్టించుకుని, మిగతా ఫీజును నిర్మాణ సమయంలో చెల్లించే వెసులుబాటు ఇవ్వడం.. స్కీమ్ ను పూర్తిగా ఎత్తేయడం. వీటిలో ఏ ఆప్షన్ ఎంచుకుంటే తక్కువ నష్టం వస్తుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఓ సీనియర్ ఆఫీసర్ చెప్పారు. స్కీమ్ ను పూర్తిగా ఎత్తేయకుండా, మిగతా ఆప్షన్లపై కసరత్తు జరిగే చాన్స్ ఉందని తెలిపారు. స్కీమ్ ను ప్రకటించిన సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చాలా పెద్ద మొత్తంలో ఉంది. రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసిన ప్లాట్ కు మార్కెట్ ధరలో 6 శాతం ఫీజు, వెంచర్ లో ఓపెన్ స్పేస్ లేకపోతే అదనంగా 14 శాతం చెల్లించాలని కండీషన్ పెట్టింది. దీంతో లక్షల్లో ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ప్లాట్ కొనుగోలు కోసం కట్టిన డబ్బులో 30 నుంచి 40 శాతం సొమ్మును మళ్లీ రెగ్యులరైజేషన్ కోసం చెల్లించాల్సి ఉంటుంది.

ఓపెన్ ప్లాట్ల వల్లే ప్రభుత్వానికి ఆదాయం

నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభించిన ప్రభుత్వం.. ఎల్ఆర్ఎస్ లేని ఇండ్ల జాగలకు రిజిస్ట్రేషన్ చేయట్లేదు. గతంలో నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లలో మెజార్టీ భాగం ఇండ్ల జాగల కోసమే ప్రజలు వస్తుంటారు. ప్రభుత్వానికి కూడా ఓపెన్ ప్లాట్ల క్రియవిక్రయాల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ అంశంపై తుది నిర్ణయం తీసుకోకపోతే సర్కారు ఆదాయానికి గండి పడటంతోపాటు ప్రజల్లో మరింత వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

ప్రభుత్వ అంచనా తలకిందులు

ఎల్ఆర్ఎస్ కింద రాష్ట్రవ్యాప్తంగా 25,59,562 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ.20 వేల కోట్ల అదనపు అదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కాని స్కీమ్ ను సొంత పార్టీ లీడర్లే తీవ్రంగా వ్యతిరేకించారు. ఫీజును తగ్గించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చారు. అయినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తమ అసంతృప్తిని ఓట్ల రూపంలో చూపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్కీమ్ పై పునరాలోచన చేయకుండా మొండిగా ముందుకు వెళ్తే రాజకీయంగా మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పార్టీ లీడర్లు హెచ్చరిస్తున్నారు.