ఆర్టీసీ ఆస్తులు అమ్మేసేందుకు రాష్ట్ర సర్కారు ప్లాన్​

ఆర్టీసీ ఆస్తులు అమ్మేసేందుకు రాష్ట్ర సర్కారు ప్లాన్​
  • ఇగ ఆర్టీసీపై కన్ను
  • సంస్థ ఆస్తులు, భూములు అమ్మేసేందుకు రాష్ట్ర సర్కారు ప్లాన్​
  • ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆపై పని కానిచ్చేయాలని ఎత్తుగడ
  • అట్ల చేస్తే యూనియన్ల నుంచి, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రాదనే వ్యూహం
  • రాష్ట్రవ్యాప్తంగా సంస్థకు రూ. 56 వేల కోట్లకు పైగా ఆస్తులు, భూములు 
  • ఇటీవలే ఆస్తుల వివరాలను సర్కారుకు అందజేసిన ఆఫీసర్లు

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రభుత్వ భూములను, ఆస్తులను అమ్మకానికి పెట్టిన రాష్ట్ర సర్కారు.. ఇప్పుడు ఆర్టీసీపైనా కన్నేసింది. ఆర్టీసీ ఆస్తులను, భూములను దొరికినకాడికి అమ్మేయాలని ప్లాన్​ చేస్తోంది. ముందుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే ఆస్తుల అమ్మకంపై యూనియన్ల నుంచి, ఉద్యోగుల నుంచి ఎలాంటి వ్యతిరేకత, అడ్డంకులు రావని  భావిస్తోంది. ఇదే విషయమై బస్‌‌ భవన్‌‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి రూ. 56 వేల కోట్లకుపైగా విలువచేసే ఆస్తులు, భూములు  ఉన్నాయి. జీహెచ్‌‌ఎంసీ పరిధిలోని ప్రైమ్‌‌ ఏరియాల్లోనే పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. ఇప్పటికే  సంస్థ ఆస్తుల లిస్ట్‌‌, ఇతర వివరాలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అందజేశారు. 

రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్​ ఆర్టీసీకి పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. 97 డిపోలు, 11 రీజియన్లు, 24 డివిజన్లు, రెండు జోనల్‌‌ వర్క్‌‌షాప్‌‌లు, ఒక బస్‌‌ బాడీ యూనిట్‌‌, రెండు టైర్‌‌ రిట్రేడింగ్‌‌ షాపులు, ప్రింటింగ్‌‌ ప్రెస్‌‌, హకీంపేట ట్రాన్స్‌‌పోర్ట్‌‌ అకాడమీ, స్టాఫ్‌‌ ట్రైనింగ్‌‌ కాలేజీలు, 14 డిస్పెన్సరీలు, తార్నాక హాస్పిటల్‌‌, 364 బస్‌‌ స్టేషన్లు, హైదర్‌‌ గూడ  గెస్ట్‌‌హౌజ్‌‌, కల్యాణ మండపం, ఓల్డ్‌‌ ఆడ్మిన్‌‌ ఆఫీస్‌‌, ముషీరాబాద్‌‌ ఓపెన్‌‌ ప్లేస్‌‌, కాచిగూడ, చిలకలగూడ స్టాఫ్‌‌  క్వార్టర్స్‌‌, మెట్టుగూడ బంగ్లా తదితర ఆస్తులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఒక్కో జిల్లాలో వంద ఎకరాలకుపైనే ల్యాండ్స్‌‌ ఉన్నాయి. అత్యధికంగా రంగారెడ్డిలో 250 ఎకరాలు, కరీంనగర్‌‌ జిల్లాలో 194  ఎకరాల భూమి ఉంది. ఈ మొత్తం ఆస్తులు, భూముల  విలువ సుమారు రూ. 50 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 

దొరికినకాడికి అమ్ముడే..
ఇటీవల వివిధ డిపార్ట్‌‌మెంట్ల ఆస్తుల వివరాలను సేకరించిన ప్రభుత్వం.. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను, ఆస్తులను అమ్మేస్తోంది. ఇదే క్రమంలో ఆర్టీసీలోని ఆస్తులపైనా ఫోకస్​ పెట్టింది. ఇందులో భాగంగా ప్రైమ్‌‌ ఏరియాల్లో ఖాళీగా ఉన్న, పెద్దగా ఉపయోగం లేని వాటిని అమ్మాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్క జీహెచ్‌‌ఎంసీ పరిధిలోనే 29 డిపోలు ఉన్నాయి. వీటిలో తక్కువ  బస్సులున్న డిపోలను మెర్జ్‌‌ చేస్తున్నారు. ఇటీవల పికెట్‌‌ డిపోను ఖాళీ చేసి, అందులోని బస్సులను దగ్గరలోని కంటోన్మెంట్‌‌, మియాపూర్‌‌, యాదగిరిగుట్ట డిపోలకు తరలించారు. భవిష్యత్‌‌లో ముషీరాబాద్‌‌ –1, 2, హయత్‌‌నగర్‌‌–1, 2, రాణిగంజ్‌‌–1, 2, హైదరాబాద్‌‌–1, 2, 3 తదితర  డిపోలను కూడా మెర్జ్‌‌ చేసే చాన్స్‌‌ ఉంది. ఇలా డిపోల పరిధిలోని భూములను అమ్మడం లేదా లీజ్‌‌కు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల్లో ఆర్టీసీ పరిధిలో ఉన్న వందల ఎకరాల భూములను కూడా అమ్మేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. 

విలీనం వైపు చూపు..!
కొంత కాలంగా ఆర్టీసీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సమ్మెతో రెండు నెలలు బస్సులు డిపోలకు పరిమితం కాగా, ఆతర్వాత మూడు నెలలకే కరోనా ఎటాక్‌‌  చేసింది. కరోనా ఫస్ట్‌‌, సెకండ్ వేవ్‌‌తో భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇప్పటికే సుమారు రూ.  5 వేల కోట్లతో పీకల్లోతు అప్పులు ఉన్నాయి. సీసీఎస్‌‌, పీఎఫ్‌‌ డబ్బులను సంస్థకు వాడేశారు. ప్రస్తుతం వాటికి నయా పైసా కట్టే పరిస్థితి లేదు. ఆసియాలో నంబర్‌‌ వన్‌‌  కోఆపరేటివ్‌‌ సొసైటీగా వెలుగొందిన సీసీఎస్‌‌ మూతబడే స్థితికి చేరుకుంది. ప్రతి నెలా 15వ తేదీ దాటితే గానీ జీతాలు చెల్లించలేని దుస్థితి నెలకొంది. వీటన్నింటికీ పరిష్కారం కావాలంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మేలు అనే భావనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సర్కారులో విలీనం చేస్తే ప్రభుత్వ ఉద్యోగులతోపాటు అన్ని ఫెసిలిటీస్‌‌  వర్తిస్తాయి. అప్పుడు యూనియన్లు కూడా ఉండవని,  అందుకే ఆర్టీసీ ఆస్తులను, భూములు అమ్మినా పెద్దగా వ్యతిరేకత ఉండదని ప్రభుత్వం యోచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

సమ్మె టైంలో విలీనం వద్దే వద్దని..!
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌‌ చేస్తూ 2019 నవంబర్‌‌, డిసెంబర్‌‌ నెలల్లో 52 రోజులపాటు సమ్మె జరిగింది. ఉద్యోగులు విధులను బహిష్కరించి రోడ్డుపైకి వచ్చారు. అప్పట్లో ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేయబోమని సీఎం స్పష్టం చేశారు.  కానీ ఇప్పుడు మాత్రం విలీనానికి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వజ్ర బస్సులు ఫర్​ సేల్​
మినీ ఏసీ బస్సులైన వజ్ర బస్సుల అమ్మకం మొదలైంది.  లాభాలు వస్తలేవనే కారణంతో వీటిని సేల్​ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు 2016--–17లో వజ్ర బస్సులను తెచ్చారు. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద 100 వజ్ర బస్సులు ఉన్నాయి. తొలిదశలో 65 బస్సులను ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్మనున్నారు. కాలం తీరకున్నా వజ్ర బస్సులను సేల్‌ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ఆర్టీసీ తన బస్సుల కాలం తీరిన తర్వాత కూడా ఉపయోగించు కుంటుంది. అలాంటిది కండీషన్​లో ఉన్న వజ్ర బస్సులను ఇప్పుడు అమ్మేసేందుకు సిద్ధమయ్యారు.