రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు

రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండాకాలం మొదట్లోనే సూర్యుడు మండిపోతున్నాడు. దాదాపు అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా రికార్డవుతున్నాయి. ఉదయం 7 గంటలకు మొదలు సాయంత్రం 6దాకా ఎండ దంచుతోంది. పగటిపూట ఎండ వేడికి జనం ఇండ్లలోంచి బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలోపాటు రాత్రి టెంపరేచర్లు కూడా పెరిగిపోతున్నాయి. టీఎస్‌‌‌‌డీపీఎస్‌‌‌‌ డేటా ప్రకారం బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లాలోని కెరమెరిలో 43.9 డిగ్రీలు, ఆదిలాబాద్‌‌‌‌లోని చాప్రాల, జైనద్‌‌‌‌లలో 43.8, జయశంకర్‌‌‌‌ భూపాలపల్లిలోని కాటారంలో 43.6, నిజామాబాద్‌‌‌‌లోని లక్మాపూర్‌‌‌‌, పెద్దపల్లిలోని శ్రీరాంపూర్‌‌‌‌, యాదాద్రి భువనగిరిలోని వెంకిర్యాలలో 43.1 డిగ్రీల చొప్పున మ్యాగ్జిమమ్‌‌‌‌ టెంపరేచర్లు నమోదయ్యాయి. వచ్చే మూడ్రోజుల్లో రాష్ట్రంలో మస్తు ఎండలు ఉంటాయని హైదరాబాద్‌‌‌‌ వాతావరణ విభాగం హెచ్చరించింది. శుక్ర, శనివారాల్లో వడగాల్పులు వీస్తాయని చెప్పింది.

అలర్ట్ గా ఉండాలి: సీఎస్‌‌‌‌ సోమేశ్ కుమార్

రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.

వడదెబ్బ బాధితుల చికిత్సకు ర్యాపిడ్‌‌‌‌ టీమ్స్‌‌‌‌: డీహెచ్ శ్రీనివాసరావు

వడదెబ్బ బాధితులకు వీలైనంత త్వరగా ట్రీట్‌‌‌‌మెంట్ అందించేందుకు అన్ని జిల్లాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని జిల్లా మెడికల్ ఆఫీసర్లను పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ శ్రీనివాసరావు ఆదేశించారు. వడదెబ్బపై అవగాహన క్యాంపులు ఏర్పాటు చేయాలని, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. సబ్ సెంటర్ నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దాకా అన్ని చోట్ల ఓఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ సాచెట్స్‌‌‌‌, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన వారికి పంపిణీ చేయాలని సూచించారు. జనాలు ఎక్కువగా పోగయ్యే ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. వడదెబ్బ కేసులపై ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటలకల్లా హెడ్ ఆఫీస్‌‌‌‌కు రిపోర్ట్ అందించాలని ఆదేశించారు. గర్భిణులు, పిల్లలు, వృద్దులు త్వరగా ఎండదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, వారిపై స్పెషల్‌‌‌‌గా ఫోకస్ చేయాలన్నారు. వడదెబ్బ తగిలినప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్సపై క్షేత్రస్థాయి హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.