
బెంగళూరు: ఇటీవల కురిసిన వర్షాలతో బెంగళూరులో దెబ్బతిన్న రోడ్లపై సీఎం సిద్దరామయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. నెలలోపు రోడ్లపై అన్ని గుంతలను పూడ్చివేయాలని అధికారులకు ఆయన అల్టిమేటం జారీ చేశారు. బెంగళూరులో రోడ్లు దారుణంగా మారాయని, దీంతో తమ కంపెనీని మరో చోట తరలిస్తామని ట్రకింగ్ కంపెనీ బ్లాక్ బక్ సీఈఓ, సహవ్యవస్థాపకుడు రాజేశ్ యాబాజీ ప్రకటించారు. రోడ్లపై ఎక్కడచూసినా గుంతలే కనిపిస్తున్నాయని ‘ఎక్స్’లో ఆయన పేర్కొన్నారు.
అలాగే, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కిరణ్మజుందార్ షా కూడా నగరంలోని రోడ్ల పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఎమర్జెన్సీ చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ నేపథ్యంలో నగరంలోని రోడ్ల పరిస్థితులపై సీఎం సిద్దు ఆదివారం అధికారులతో సమావేశం నిర్వహించారు. నెలలోపు రోడ్లన్నీ బాగు చేయాలని ఆయన ఆదేశించారు.
గుంతల వల్ల జనం ఎందుకు ఇబ్బంది పడాలని అధికారులను ప్రశ్నించారు. కాంట్రాక్టర్లతో నాణ్యమైన రోడ్లు వేయించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. వర్షాకాలం ఆరంభానికి ముందే రోడ్లను ఎందుకు బాగు చేయలేదని ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి గుంతలు పూడ్చాలన్నారు. రోడ్ల బాగు కోసం ఎన్ని నిధులైన విడుదల చేస్తామని తెలిపారు.
గుంతలు పూడుస్తన్నం: డీకే
బెంగళూరు రోడ్లపై ఏర్పడిన గుంతలను వేగవంతంగా పూడుస్తున్నామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ‘ఎక్స్’లో తెలిపారు. అతి త్వరలోనే రోడ్లను రిపేరు చేస్తామని, వాహనాదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెహికల్స్ నడిపేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. బెంగళూరు వాసుల సమస్యలను సీరియస్గా తీసుకుంటున్నామని పేర్కొన్నారు.