నిజామాబాద్​ రైతుల్లా తడాఖా చూపిస్తం

నిజామాబాద్​ రైతుల్లా తడాఖా చూపిస్తం

హుజూర్ నగర్, వెలుగుబెదిరింపులు, అరెస్టులకు భయపడబోమని, హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో భారీగా నామినేషన్లు వేస్తామని రాష్ట్ర సర్పంచుల సంఘం స్పష్టం చేసింది. తమ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్​ను అరెస్టు చేయడం దారుణమని సంఘం అధ్యక్షురాలు జూలూరు ధనలక్ష్మి అన్నారు. నామినేషన్​ వేసేందుకు వస్తున్న భూమన్న అక్రమంగా అరెస్టు చేశారని, ఇలాంటివాటితో తాము భయపడబోమని స్పష్టం చేశారు. వంద మందికిపైగా సర్పంచులు నామినేషన్లు వేస్తారని, నిజామాబాద్​లోని పసుపు రైతుల తరహాలో హుజూర్​నగర్​ ఉప ఎన్నికలో సర్పంచుల తడాఖా చూపిస్తామని చెప్పారు.

అందరూ హుజూర్​నగర్​కు..

ఉప ఎన్నిక నామినేషన్లకు సోమవారం చివరిరోజు. తాము భారీగా నామినేషన్లు వేస్తామని రాష్ట్ర సర్పంచుల సంఘం, న్యాయవాదుల జేఏసీ ఇప్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆయా సంఘాలకు చెందినవారు ఆదివారమే పెద్ద సంఖ్యలో హుజూర్ నగర్ పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని, ఉప ఎన్నికలో 15 మంది లాయర్లు నామినేషన్లు వేస్తారని న్యాయవాదుల జేఏసీ నేత వెన్నపూస పరుశురాం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలపై నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఓయు జేఏసీ నేతలతో కలిసి నామినేషన్ వేయనున్నట్టు తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఐక్య వేదిక అధ్యక్షుడు మేకల రఘురామరెడ్డి చెప్పారు.