ఫిట్​మెంట్ భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు

ఫిట్​మెంట్ భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు
  • 7.5% ఫిట్​మెంట్​ సిఫార్సును ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నరు
  • జేఏసీలోని 79 సంఘాలను చర్చలకు పిలవాలి
  • ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల జేఏసీ స్టీరింగ్ కమిటీ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: పీఆర్సీ ఫిట్​మెంట్​ అనేది ఉద్యోగులకు ప్రభుత్వం వేసే భిక్ష కాదని, తమ హక్కు అని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల  జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. కమిషన్​ సిఫార్సు చేసిన  7.5 శాతం ఫిట్​మెంట్​ను రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. 47.5 శాతం ఫిట్​మెంట్​తో ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫీస్​లో జేఏసీలోని సంఘాల సమావేశం జరిగింది. జేఏసీ స్టీరింగ్ కమిటీ నేతలు సంపత్​కుమార్ స్వామి, కృష్ణుడు, మైస శ్రీనివాస్, నిర్మల మాట్లాడుతూ… పీఆర్సీపై సీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్రిసభ్య కమిటీ సమావేశాలకు జేఏసీలోని 79 భాగస్వామ్య సంఘాలను పిలవాలన్నారు. ‘‘పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల మధ్య విభజించి పాలించు అన్న తీరుగా వ్యవహరిస్తోంది.  కొన్ని సంఘాలనే చర్చలకు ఆహ్వానించడమంటే మిగిలిన సంఘాలను అవమానించడమే” అని మండిపడ్డారు. హెచ్ఆర్ఏను తగ్గించడం సరికాదన్నారు. సీపీఎస్ ఉద్యోగుల 10 శాతం కాంట్రిబ్యూషన్​ను 14 శాతానికి పెంచడం బాధాకరమని చెప్పారు. జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు పురుషోత్తం, రమణ, సదానందంగౌడ్, జంగయ్య, చావ రవి, రాజేంద్రప్రసాద్, రఘుశంకర్​రెడ్డి, మహిపాల్ రెడ్డి, పోచయ్య, హరికృష్ణనాయక్, కొమ్ము రమేష్, లింగారెడ్డి, శాగ కైలాసం తదితరులు పాల్గొన్నారు.