ఈ దెయ్యం బొమ్మ కథ వింటే ఉలిక్కిపడాల్సిందే.!

ఈ దెయ్యం బొమ్మ కథ వింటే ఉలిక్కిపడాల్సిందే.!

బొమ్మల్లో దెయ్యాలు ఉంటాయి.. అనే కాన్సెప్ట్‌‌తో హాలీవుడ్‌‌ నుంచి టాలీవుడ్‌‌ వరకు అనేక సినిమాలొచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలు ఫిక్షన్‌‌ అయితే.. మరికొన్ని ఫిక్షన్‌‌తోపాటు జరిగిన కథల ఆధారంగా తెరకెక్కించినవి. అలాంటి కోవలోకే ఎనబెల్​ లాంటి సినిమాలు వస్తాయి. జరిగిన కథను తీసుకుని దానికి కొంత ఫిక్షన్‌‌ జోడించి ఇలాంటి సినిమా తీస్తారు. కానీ.. ఫిక్షన్‌‌ కూడా అవసరం లేని ఓ దెయ్యం బొమ్మ కథనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఈ బొమ్మ చూసినవాళ్లు ఎవరైనా సరే ‘అమ్మో బొమ్మ’ అని ఉలిక్కిపడాల్సిందే!

బొమ్మలకు పారానార్మాల్‌‌ శక్తులు ఉంటాయని సినిమాల ద్వారానో, ఇంట్లో బామ్మలు, తాతలు చెప్పే కథల్లోనే వింటుంటాం. అలాంటి కథలకు ఈ బొమ్మ నిలువెత్తు సాక్ష్యం. హాంటెడ్‌‌ బొమ్మల గురించి వినగానే ముందుగా గుర్తొచ్చేది ఎనబెల్​. కానీ.. అలాంటి పారానార్మల్‌‌ యాక్టివిటీస్‌‌ ఉన్న బొమ్మలు ప్రపంచంలో కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. అందులో ఒకటి ‘రాబర్ట్‌‌’. అవును ఈ బొమ్మ పేరు రాబర్ట్‌‌. చూడ్డానికి ఇన్నొసెంట్‌‌ ఫేస్‌‌తో ఉన్న ఈ బొమ్మ చేసే పనులు తెలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది.  ప్రస్తుతం ఈ బొమ్మ ఫ్లోరిడాలోని కీ వెస్ట్‌‌లో ఉన్న ఫోర్ట్ ఈస్ట్ మార్టెల్లో మ్యూజియంలో ఉంది. దీన్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అయితే.. దీన్ని చూసేందుకు వెళ్లేవాళ్లకు కొన్ని నియమాలు పాటించాలి. లేదంటే రాబర్ట్‌‌కు కోపం వస్తుంది. రాబర్ట్‌‌కు కోపం వస్తే ఎంత ప్రమాదమంటే ? ఒక్కోసారి ప్రాణాలే పోవచ్చు! 

రాబర్ట్‌‌ అంటే చాలా ఇష్టం 

ఈ బొమ్మ కథ.. 20వ శతాబ్దం మొదట్లో మొదలైంది. అప్పట్లో ఫ్లోరిడాలోని కీ వెస్ట్‌‌లో ఒట్టో ఫ్యామిలీ ఉండేది. ఆ ఇంట్లో రాబర్ట్ యూజీన్‌‌‌‌  1900 అక్టోబర్ 25న పుట్టాడు. అతనికి చిన్నప్పటి నుంచి బొమ్మలంటే ఇష్టం. అతని నాలుగో పుట్టిన రోజున ఒక బొమ్మ గిఫ్ట్‌‌గా వచ్చింది. ఆ బొమ్మ రాబర్ట్‌‌ యూజీన్‌‌‌‌కి బాగా నచ్చింది. దానికి ‘రాబర్ట్’ అని పేరు పెట్టాడు. తన పేరులోని రాబర్ట్​ని బొమ్మకు పెట్టడం వల్ల అప్పటినుంచి తనని ఎవరూ రాబర్ట్ అని పిలవకూడదని కేవలం యూజీన్‌‌‌‌ అని మాత్రమే పిలవాలని పట్టుబట్టేవాడు. ఎవరైనా తన పూర్తి పేరుతో పిలిచినా లేదా ‘రాబర్ట్’ అని పిలిచినా చాలా కోపం వచ్చేది. దాంతో అందరూ అతన్ని యూజీన్‌‌‌‌ అనే పిలిచేవాళ్లు. తర్వాత కొన్నాళ్లకు  యూజీన్‌‌ తండ్రి థామస్, తల్లి మిన్నీ అర్థరాత్రి టైంలో యూజీన్‌‌ గదిలో ఎవరో మాట్లాడుకోవడం విన్నారు. యూజీన్‌‌‌‌ ఎవరితోనే మాట్లాడుతున్నాడు. మరో వ్యక్తి వాయిస్‌‌ను కూడా వాళ్లు క్లియర్​గా విన్నారు. వెంటనే తలుపు తెరిచారు. కానీ.. అప్పుడు గదిలో యూజీన్‌‌ ఒంటరిగానే తనతో ఉన్నాడు. ఆ బొమ్మ రాబర్ట్‌‌తో మాట్లాడుతున్నాడు. వీళ్లు వెళ్లగానే బొమ్మ మాట్లాడడం ఆపేసింది. మరో రోజు గదిలో ఒంటరిగా ఉన్న యూజీన్‌‌‌‌ పెద్దగా అరిచాడు. థామస్‌‌, మిన్నీ వెంటనే యూజీన్‌‌‌‌ గదికి పరిగెత్తుకెళ్లి చూశారు. ఆ బొమ్మ  యూజీన్‌‌‌‌ని గట్టిగా పట్టుకుని ఉండడం చూశారు. గదిలోని వస్తువులు చిందరవందరగా ఉన్నాయి. రాబర్ట్‌‌ తప్ప యూజీన్‌‌‌‌కు ఉన్న మిగతా బొమ్మలన్నీ డ్యామేజ్‌‌ అయ్యాయి. తల్లిదండ్రులు యూజీన్‌‌‌‌ ‘‘ఎందుకిలా చేశావ్‌‌?” అనడిగారు. దాంతో యూజీన్‌‌‌‌ ‘‘అదంతా చేసింది నేను కాదు. రాబర్టే ఇలా చేశాడు” అని అమాయకంగా సమాధానం చెప్పాడు. దాంతో థామస్‌‌ ఈ బొమ్మలో ఏదో తెలియని పారానార్మల్‌‌ పవర్‌‌‌‌ ఉందని గ్రహించాడు. ఎందుకంటే యూజీన్‌‌‌‌ బొమ్మల్లో  కొన్ని చాలా స్ట్రాంగ్‌‌గా ఉన్నాయి. వాటిని పగులగొట్టేంత బలం అతనికి లేదు. కానీ.. అవన్నీ పగిలిపోయి ఉన్నాయి. ఇదంతా చూసిన థామస్‌‌ రాబర్ట్‌‌ని వదిలించుకోవాలి అనుకున్నాడు. దాంతో దాన్ని తీసుకెళ్లి అటక మీద పడేశాడు. ఇక అప్పటినుంచి రాబర్ట్‌‌ వల్ల ఏ ఇబ్బందులూ రాలేదు. కానీ.. రాబర్ట్‌‌ కథ అక్కడితే అయిపోలేదు.

రాబర్ట్‌‌ రిటర్న్స్‌‌

ఇంతలోనే యూజీన్‌‌‌‌ పెరిగి పెద్దవాడయ్యాడు. వర్జీనియా యూనివర్సిటీలో చదువుకోవడానికి ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. తర్వాత చికాగోలోని అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌‌లో పెయింటింగ్ నేర్చుకున్నాడు. రాబర్ట్ బొమ్మ మాత్రం ఇంట్లోని అటక మీదనే ఉంది. యూజీన్‌‌‌‌ తర్వాత పారిస్‌‌కు వెళ్లి, ఒక స్టూడియోలో సెటిల్‌‌ అయ్యాడు. పెళ్లి చేసుకున్నాడు. చివరికి 1930 లో న్యూయార్క్ సిటీకి  వెళ్లి స్థిరపడ్డాడు. 1940లో యూజీన్‌‌ తన తల్లి అనారోగ్యంతో ఉన్నట్లు తెలిసి, సొంతింటికి వచ్చేశాడు. వాళ్ల అమ్మ చనిపోయిన తర్వాత.. ఆ ఇంటికి ‘ఆర్టిస్ట్ హౌస్’ అని పేరు పెట్టి అందులో ఉన్నాడు యూజీన్‌‌‌‌. అప్పుడే రాబర్ట్‌‌ని మళ్లీ బయటికి తీశాడు. రాబర్ట్​కు కొత్త జీవం పోసినట్టయింది. అప్పటినుంచి చిన్న పిల్లాడిలా దాంతో ఆడుకోవడం మొదలుపెట్టాడు యూజీన్‌‌‌‌. ఆయన  ఏ పనిచేసినా పక్కన రాబర్ట్‌‌ని పెట్టుకునేవాడు. పడుకునేటప్పుడు కూడా ఆయన పక్కనే ఉండేది. భోజనం చేసేటప్పుడు కూడా రాబర్ట్ పక్కన ఉండాల్సిందే. భర్త ఇలా మారడాన్ని.. ఆయన భార్య యాన్​ ఇష్టపడేది కాదు. అయినా యూజీన్‌‌‌‌ పట్టించుకునేవాడు కాదు. అటక మీద రాబర్ట్ కోసం ప్రత్యేకంగా ఒక చిన్న గది కూడా ఏర్పాటు చేయించాడు. ఆ గదిలో ఫర్నీచర్, బొమ్మలు.. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. రాబర్ట్ మళ్లీ బలం పెంచుకుని యూజీన్‌‌ భార్యని ఇబ్బంది పెట్టేది. ఆమె అదంతా యూజీన్‌‌‌‌ చేస్తున్నాడనుకునేది. కానీ.. ఒక రోజు యూజీన్‌‌‌‌ ‘‘ఇదంతా నేను చేయడం లేదు. రాబర్ట్ చేస్తున్నాడు” అని అమాయకంగా చెప్పాడు. ఆ టైంలో రాబర్ట్ గురించి ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసింది.  

పారానార్మల్ యాక్టివిటీస్‌‌

యూజీన్‌‌‌‌ ఉంటున్న ఇంటి పక్కనే ఒక బాట ఉంటుంది. ఆ బాటలో కొంతమంది స్టూడెంట్స్‌‌ రోజూ స్కూలుకు వెళ్లేవాళ్లు. అప్పుడు ఆ ఆర్టిస్ట్ హౌస్ దాటేటప్పుడు రాబర్ట్ అటక గదిలోని ఒక కిటికీ నుంచి మరో కిటికీకి కదులుతున్నట్లు, వాళ్ల వైపు చూస్తున్నట్టు కనిపించేది. తర్వాత యూజీన్‌‌‌‌ ఒట్టో జూన్ 24, 1974 న మయామి ఆసుపత్రిలో పార్కిన్సన్స్ వ్యాధి వల్ల కన్నుమూశాడు. అయితే.. అతను చనిపోయిన పది సంవత్సరాల తరువాత రాసిన ‘‘సన్ సెంటినెల్‌‌’’లోని ఒక కథనంలో యూజీన్‌‌‌‌ చనిపోవడానికి ముందు కొన్ని నెలలపాటు.. రోజులో ఎక్కువ సమయాన్ని రాబర్ట్‌‌తో మాట్లాడేందుకు, ఆడుకునేందుకే కేటాయించాడు. రాబర్ట్‌‌తో కలిసి అటక మీదున్న ఆ చిన్న గదిలోనే ఉన్నాడు. ఈ విషయాలన్నీ యూజీన్‌‌ చనిపోయిన తర్వాత ఆయన భార్య యాన్​ చెప్పింది.  తర్వాత ఆ ఇంటిని విలియం గైజర్‌‌ అనే వ్యక్తి అమ్మేసింది. ఆ బొమ్మను కూడా అతనికే ఇచ్చింది. ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు 1979లో ఆమె పాంక్రియాటిక్ క్యాన్సర్‌‌తో చనిపోయింది. యూజీన్‌‌‌‌ తల్లిదండ్రులు కూడా రాబర్ట్‌‌ వల్లే చనిపోయారని కొందరు నమ్ముతున్నారు. 

రాబర్ట్‌‌లో ఎవరున్నారు? 

రాబర్ట్ బొమ్మలో ఎవరి ఆత్మ ఉందనేది అప్పట్లో చర్చనీయాంశమైంది. అందుకే దానిపై చాలా మంది స్టడీ చేశారు. కానీ.. కనుక్కోలేకపోయారు. ఒట్టో కుటుంబం వెస్టిండీస్ నుంచి వచ్చిన విలియమ్, ఎమెలిన్ అబాట్ భార్యాభర్తలను పనిలో పెట్టుకుంది. యూజీన్‌‌‌‌ తాత జోసెఫ్‌‌ కాలం చాలా సంవత్సరాలు ఒట్టో ఫ్యామిలీ కోసం పనిచేశారు. ఎమెలిన్ అబాట్‌‌కు 1910లో ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే.. అప్పటికే విలియమ్‌‌ చనిపోయాడు. ఆమెకు యూజీన్‌‌ తండ్రి థామస్‌‌తో అక్రమ సంబంధం ఉందని అందరూ నమ్మేవాళ్లు. అయితే.. ఆమెకు పిల్లలు పుట్టగానే అనుమానస్పదంగా చనిపోయింది. ఆ పసిబిడ్డల ఆత్మలే ఈ బొమ్మలో ఎమెలిన్ అబోట్ బంధించిందని చెబుతుంటారు. ఈ వాదనకు బలం చేకూర్చేలా.. మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఐదు సంవత్సరాల వయసున్న పాప... పాత తరహా నైట్‌‌గౌన్ వేసుకుని ఆర్టిస్ట్‌‌ హౌస్‌‌లో తిరిగినట్టు కనిపించిందని యూజీన్‌‌‌‌ చనిపోయాక చాలామంది చెప్పారు. పూచి మైయర్స్ 1980లలో ఆర్టిస్ట్ హౌస్‌‌కు కేర్‌‌‌‌టేకర్‌‌‌‌గా పనిచేసింది. అప్పుడు మెట్ల మీద కూర్చున్న ఇద్దరు చిన్నారుల ఆత్మలను చూసినట్లు ఆమె చెప్పింది.  రాబర్ట్ గురించి మరో కథ చెబుతుంటారు... థామస్‌‌ ఇంట్లో ఒక పని మనిషి ఉండేది. ఆమె ఒకరోజు పెరట్లో క్షుద్ర పూజలు చేస్తూ కనిపించింది. దాంతో ఆమెను పనిలో నుంచి తీసేశాడు థామస్‌‌. దాంతో పగబట్టిన ఆ పనిమనిషి... ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోతూ యూజీన్‌‌‌‌కు ఈ బొమ్మ ఇచ్చినట్టు చెబుతారు. 

మ్యూజియంలో... 

యూజీన్‌‌‌‌ చనిపోయాక ఆ ఇల్లు చేతులు మారింది. ఆ ఇంటిని కొన్న వాళ్లు కూడా ఈ బొమ్మతో సమస్యలు ఎదుర్కొన్నారు. విలియం గైజర్ తర్వాత ఆ ఇంటిని రౌటర్ కొన్నాడు. మొదట రౌటర్‌‌‌‌ని‌‌ రాబర్ట్ పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. కానీ..తర్వాత ఒకసారి రాబర్ట్‌‌ని ఆయన వేరే ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటినుంచి ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. గదిలో మనుషులు ఉన్నప్పుడు బయటినుంచి గడియ పెడుతుండేది. తర్వాత కొన్నాళ్లకే ఆ ఇంట్లో ఒకరు చనిపోయారు. దాంతో రాబర్ట్‌‌ను 1994లో ఫోర్ట్ ఈస్ట్ మార్టెల్లో మ్యూజియంలో పెట్టారు. తర్వాత ఆర్టిస్ట్ హౌస్‌‌లో పారానార్మల్ యాక్టివిటీ తగ్గింది. మ్యూజియంలో పెరిగింది.

మ్యూజియంలో మాయలు

మ్యూజియంలో రాబర్ట్‌‌ని ఒక కుర్చీపై కూర్చోబెట్టారు. మ్యూజియం డైరక్టర్‌‌‌‌ పైప్‌‌ రాబర్ట్ వైపు చూసినప్పుడు..  రాబర్ట్‌‌ కూడా డైరక్టర్‌‌‌‌ వైపు తల తిప్పి చూసేదట. అంతేకాదు అప్పుడప్పుడు కుర్చీ కూడా కదిలేదట. దాంతో చివరికి మ్యూజియంలోని ఒక స్టోర్‌‌‌‌ రూంలో పెట్టారు. రెండు సంవత్సరాలు అక్కడే ఉంచారు. రాబర్ట్​ను చూసి, అక్కడి ఉద్యోగులు అందరూ భయపడేవాళ్లు.  1996  నుంచి విజిటర్స్‌‌కి రాబర్ట్‌‌ను చూసే అవకాశం ఇస్తున్నారు. అప్పటినుంచి దాన్ని ప్రదర్శనకు ఉంచారు. అప్పటి నుంచి ఆ బొమ్మను చూసినవాళ్లలో కొందరికి వింత అనుభవాలు ఎదురయ్యాయి. ఒకసారి ఒక రచయిత రాబర్ట్‌‌ని రిక్వెస్ట్‌‌ చేసి ఒక ఫొటో తీసుకున్నాడు. తర్వాత రాబర్ట్‌‌కు థ్యాంక్స్‌‌ కూడా చెప్పాడు. కానీ.. అదే రోజు రాత్రి ఆయన కింది పెదవి రెండు రెట్లు పెరిగింది. చేతులపై దద్దుర్లు వచ్చాయి. రెండు రోజులపాటు అలాగే ఉన్నాడు. అప్పుడు ఇంటర్‌‌‌‌నెట్‌‌లో రాబర్ట్ గురించి సెర్చ్‌‌ చేశాడు. బ్రౌజర్‌‌‌‌లో మరో ట్యాబ్‌‌ ఓపెన్‌‌ చేయగానే ఆ పేజీలో ‘‘మీరు ఎక్కడి నుండి వచ్చారో చెప్పలేదు” అని కనిపించింది. దాంతో ఇది రాబర్ట్ పనే అని కన్ఫర్మ్‌‌ చేసుకున్నాడు. మరొక ఆమెకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది అప్పటినుంచి రాబర్ట్‌‌తో ఫొటో దిగాలనుకునేవాళ్లు మర్యాదగా మాట్లాడి, రిక్వెస్ట్‌‌గా అడిగి ఫొటో దిగుతున్నారు. తర్వాత వాళ్ల వివరాలు చెప్పి, థ్యాంక్స్‌‌ చెప్పి వెళ్లిపోతారు. అందుకే ఆ బొమ్మను కొందరు ‘మర్యాద రాక్షసుడి’గా పిలుస్తుంటారు. అలా చేయని వాళ్లలో చాలామందిని దురదృష్టం వెంటాడిందట.  ముఖ్యంగా రాబర్ట్‌‌ని అగౌరవపరిచిన వాళ్లు జాబ్‌‌ కోల్పోవడం, డైవర్స్ తీసుకోవడం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం వల్ల బాధపడుతుంటారు. ఇలాంటి అనుభవాలను చాలామంది మ్యూజియంకు లెటర్లు రాశారు. రాబర్ట్ కథ ఆధారంగా కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. 2016లో ‘రాబర్ట్ ది డాల్’, 2017లో ‘రాబర్ట్ అండ్‌‌ ది టాయ్‌‌మేకర్’, 2019లో ‘రాబర్ట్ రీబోర్న్’ సినిమాలు వచ్చాయి. ‘రాబర్ట్ ది డాల్.. ది ట్రూ బయోగ్రఫీ ఆఫ్ కీ వెస్ట్ హాంటెడ్ డాల్’ అనే పుస్తకం కూడా రాశారు. ఈ బొమ్మ బయట ఉంటే పారానార్మల్‌‌ యాక్టివిటీస్‌‌ పెరిగే అవకాశం ఉందని, ప్రస్తుతం దీన్ని మ్యూజియంలోని ఒక అద్దాల పెట్టెలో ఉంచారు. 

::: కరుణాకర్​ మానెగాళ్ల