మత్తు మాయ గంజాయి కథ

మత్తు మాయ గంజాయి కథ

ఎట్లుంటదో చూడాల్నని ఒక్కసారి ట్రై జేస్తె.. పూర్తిగా తన కంట్రోల్‌‌‌‌లోకి తీసుకుంటది గంజాయి. దానికి అలవాటు పడితె జిందగీ నాశనం అయినట్టె. సరదాగ మొదలువెట్టినా వ్యసనమైతది. ఇగ అది వ్యసనమైతె.. దానికి బానిసైనట్టె. ‘ఎప్పుడు కావాల్నంటె అప్పుడు మానేస్త. ఇప్పుడు జస్ట్‌‌‌‌ టైం పాస్‌‌‌‌ కోసం తీసుకుంటున్న’ లాంటి మాటలు మస్తు చెప్తరు గంజాయి వాడెటోళ్లు. కానీ.. ఆ మాటలన్ని నీటి మూటలె. ఒక్కసారి అలవాటైతె గంజాయిల కొట్కపోవాల్సిందె!

కొన్నాళ్ల నుంచి ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో గంజాయి దొరికిందనే వార్తలు వింటున్నాం. దేశంలో ఎప్పటినుంచో గంజాయి వాడుతున్నా ఈ మధ్యే ఎక్కువగా సీజ్‌‌‌‌ అవుతోంది. అయినప్పటికీ అమ్మకాలు మాత్రం ఆగడంలేదు. పోలీసులు పట్టుకున్న మరుసటి రోజే ఎక్కడో ఒక చోట ట్రాన్స్‌‌‌‌పోర్ట్ జరుగుతోంది. కాస్త ప్రయత్నిస్తే చాలు, సామాన్యుడికి కూడా దొరుకుతుందంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బయటి ప్రపంచానికి తెలియకుండా ఇప్పటికే ఎన్నో జీవితాలు గంజాయికి బలయ్యాయి. అయితే.. మన దగ్గర గంజాయి వాడకం కొత్తేమీ కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి వాడకంలో ఉంది. కాగా.. 35 ఏండ్ల కిందట గంజాయి వాడకాన్ని బ్యాన్‌‌‌‌ చేశారు. 

ఎప్పటి నుంచో.... 
నాలుగు వేల ఏండ్ల క్రితమే గంజాయిని సాగు చేసినట్టు ఆర్కియాలజిస్ట్‌‌‌‌లు చెబుతున్నారు. దీన్ని అప్పట్లో మత్తు పదార్థంగా కన్నా నార కోసం ఎక్కువగా పండించారు. గంజాయి మొక్క ఆకులను నాటు వైద్యంలో వాడేవాళ్లు. గంజాయితో పాటు ఇలాంటి డ్రగ్స్‌‌‌‌ వాడకం కొన్ని వేల ఏండ్ల క్రితమే మొదలైంది. మన దేశంతోపాటు ఈజిప్టు, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో గంజాయి వాడకం ఎక్కువగా ఉండేది. మన దగ్గర పొగ పీల్చడంతో పాటు, గంజాయి ఆకు నూరి తయారు చేసిన‘భంగు’ను ఎక్కువగా వాడేవాళ్లు. దీంతోపాటు కొన్ని రకాల చెట్ల వేర్లను, గింజలను కూడా మత్తు కోసం వాడేవాళ్లు. కానీ కొన్ని దేశాల్లో వీటి వాడకం మీద చాలా ఏండ్ల క్రితమే బ్యాన్​ పెట్టారు. 14వ శతాబ్దం నాటికి ఇస్లామిక్ రాజ్యాల్లో గంజాయిపై రిస్ట్రిక్షన్స్‌‌‌‌ పెట్టారు. గంజాయి తీసుకుంటుందన్న కారణంగా ‘షానన్ లినీ’ అనే మహిళను వందల ఏండ్ల క్రితమే ఉరితీశారు. అంటే గంజాయి తీసుకోవడం అప్పటినుంచే నేరం అన్నమాట!   20వ శతాబ్దం వచ్చేసరికి కొన్ని దేశాల్లో గంజాయిని బ్యాన్‌‌‌‌ చేయడం మొదలైంది. 21వ శతాబ్దంలోకి వచ్చే సరికి గంజాయి వాడడం నేరంగా పరిగణించారు.  అయితే.. ఈ మధ్యే కొన్ని దేశాలు కొన్ని లిమిటేషన్స్‌‌‌‌తో గంజాయిని లీగలైజ్‌‌‌‌ చేశాయి.  

మన దేశంలో కంటే ముందు నుంచే అనేక దేశాల్లో గంజాయి సాగు జరిగింది. జపాన్‌‌‌‌లో నియోలిథిక్ కాలంలోనే గంజాయి సాగు చేసినట్టు ఆధారాలున్నాయి. జపాన్‌‌‌‌ దగ్గర్లోని ‘ఓకీ’ దీవుల్లోని ఒక చారిత్రక స్థలంలో క్రీస్తుపూర్వం 8000 సంవత్సరాల కిందటే  గంజాయి సాగు చేసినట్టు ఆధారాలు దొరికాయి. ఒకప్పుడు కొరియాలో గంజాయి మామూలు పంట. దీని నారను ఫ్యాబ్రిక్‌‌‌‌లో వాడేవాళ్లు. అస్సిరియన్లకు కూడా గంజాయి తెలుసు. వాళ్లు దీన్ని సుగంధ ద్రవ్యంగా వాడేవాళ్లు. దీన్ని వాళ్లు ‘క్యునుబూ’ అని పిలిచేవాళ్లు. 

మన దగ్గర గంజాయి
మన దేశంలో గంజాయి వాడకం దాదాపు నాలుగు వేల ఏండ్ల నుంచి ఉంది. ఎక్కువ రోజుల నుంచి వాడడం వల్లే ఇక్కడి ఆచారాల్లో కూడా గంజాయి భాగమైంది. మన దేశంలో గంజాయి చట్ట విరుద్ధం అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భక్తి పరంగా   యాక్సెప్టెన్సీ ఉంది. కాకపోతే కొన్ని లిమిటేషన్స్‌‌‌‌తో ప్రత్యేక రోజుల్లో మాత్రమే తీసుకుంటారు. మన దేశంలో కొందరు సన్యాసులు ఎక్కువగా తీసుకుంటారు. కొన్ని రకాల ఉత్సవాల్లో గంజాయితో తయారు చేసిన ‘భంగ్’ అనే డ్రింక్‌‌‌‌ని తాగుతారు. దీన్ని దేవతలు తాగేవాళ్లని కూడా చెబుతుంటారు.  మన పురాణ కథల్లో కూడా గంజాయి గురించి ఉన్నట్టు చెబుతుంటారు. కానీ.. ఇది అసలు మన దేశపు మొక్కే కాదని కొందరు అంటున్నారు.  వాస్తవానికి గంజాయి మధ్య ఆసియాలోని ‘స్టెప్పీస్‌‌‌‌’ ప్రాంతంలో పుట్టింది. క్రీస్తు పూర్వం దాదాపు 2000 కాలంలో వలసల ద్వారా మన దేశానికి వచ్చింది. జియోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌ బర్నీ వార్ఫ్‌‌‌‌ గంజాయి హిస్టారికల్ జాగ్రఫి మీద రీసెర్చ్‌‌‌‌ చేసి... ఆర్యుల వరుస దాడులు జరిగినప్పుడే గంజాయి ఇండియాకి వచ్చిందని చెప్పాడు. ఆ టైంలో  మన దేశంతోపాటు అనేక దేశాలకు ఇది పరిచయం అయింది. కానీ.. మన వాళ్లు మాత్రం మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువగా అడాప్ట్‌‌‌‌ చేసుకున్నారని వార్ఫ్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌లో తేలింది. మొదట్లో దీన్ని ఔషధంగా మాత్రమే వాడేవాళ్లు. ఆ తర్వాత ఆచారాల్లో చేర్చారు. ఔషధ, ఆచార అవసరాల కోసం గంజాయి సాగును బాగా డెవలప్‌‌‌‌ చేశారు. ఒక స్టేజీలో మన దేశంలో గంజాయి సాగు, వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రత్యేకంగా ‘గంజా వైద్యులు’ కూడా పుట్టుకొచ్చారు. వాళ్లు గంజాయితో రోగాలు నయం చేయడంలో స్పెషలిస్ట్‌‌‌‌లు. వాళ్లను ‘పోద్దార్‌‌‌‌‌‌‌‌, పరక్దార్‌‌‌‌’‌‌‌‌ అని పిలిచేవాళ్లు. ఈ స్పెషలిస్టులకు అవసరమైనంత గంజాయిని పండించి ఇచ్చేవాళ్లు రైతులు. 

వేదాల్లో... 
గంజాయి గురించి దాని ఔషధ లక్షణాల గురించి అధర్వణ వేదంలో ప్రస్తావన ఉంది. గంజాయి జబ్బులను నయం చేస్తుందని, రాక్షసులతో పోరాడటానికి ఉపయోగపడుతుందని ఇందులో ఉంది. ప్రొఫెసర్ మార్క్ ఎస్‌‌‌‌. ఫెరారా రాసిన ‘సేక్రెడ్‌‌‌‌ బ్లిస్‌‌‌‌’ పుస్తకంలో కూడా పురాతన కాలంలో గంజాయిని ఔషధంగా వాడారని  రాశాడు. దీన్ని అనారోగ్యం, నిరాశ, విపత్తులను ఎదిరించే శక్తి కోసం తీసుకునే ‘పవిత్రమైన గడ్డి’గా చూసేవాళ్లు. ఆయుర్వేద గ్రంథం ‘శుశ్రుత సంహిత’లో కూడా దీని గురించి ఉంది. ఈ గ్రంథాన్ని క్రీస్తుపూర్వం మూడు నుంచి ఎనిమిది శతాబ్దాల మధ్య రాశారు. ఇందులో కఫం, పిల్లికూతలు(క్యాటర్‌‌‌‌‌‌‌‌), విరేచనాలు తగ్గటానికి గంజాయిని వాడొచ్చని చెప్పారు. 

పురాణాల్లో దానికున్న ఇంపార్టెన్స్‌‌‌‌ వల్ల కొందరు సాధువులు గంజాయి తీసుకోవడాన్ని ఆచారంగా భావిస్తారు. వాళ్లు  గంజాయి మొక్క ఆకుల్ని ‘చిల్లమ్‌‌‌‌’ అని పిలిచే చిన్న మట్టి పైపులో పెట్టి కాలుస్తారు. సాధువులు చిల్లమ్‌‌‌‌తో సర్కిల్‌‌‌‌ స్మోకింగ్‌‌‌‌ ఎక్కువగా చేస్తుంటారు. ‘బం శంకర్!’ అంటూ గంజాయి తాగుతారు. ఇది సన్యాసులకు మాత్రమే పరిమితం కాదు. ‘శివరాత్రి’, ‘కుంభమేళా’లప్పుడు భంగ్‌‌‌‌ను చాలామంది భక్తులు తాగుతారు. 

నేరం చేసినట్టే 
మన దేశంలో అడుగుపెట్టిన కొత్తలోనే గంజాయిపై యూరోపియన్ల దృష్టిలో పడింది. యూరోపియన్ నావికులు, ఎక్స్‌‌‌‌ప్లోరర్స్‌‌‌‌ తరచుగా ‘భంగ్’ గురించి బ్రిటిష్‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌కి రిపోర్ట్స్‌‌‌‌ పంపేవాళ్లు. 16వ శతాబ్దపు పోర్చుగీస్ చరిత్రకారుడు గార్సియా డా ఓర్టా ఇండియాలో భంగ్‌‌‌‌ను చాలా సాధారణంగా వాడుతున్నారని చెప్పాడు. మన దగ్గర గంజాయికి ఉన్న ఆదరణ చూసి బ్రిటిష్ వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. అందుకే 1798లో బ్రిటిష్ పార్లమెంట్‌‌‌‌లో గంజాయిపై పన్ను వేసే చట్టాన్ని చేశారు. గంజాయి వాడకాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే పన్ను విధించినట్టు వాళ్లు చెప్పుకున్నారు. 19వ శతాబ్దంలో కూడా ఇండియాలో గంజాయి తీసుకోవడాన్ని క్రైమ్‌‌‌‌గా గుర్తించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. 1894లో ప్రభుత్వం గంజాయి వినియోగం, దాని సాగు, వ్యాపారం, ఆరోగ్యం మీద ప్రభావంపై స్టడీ చేయడం మొదలుపెట్టింది. అందుకోసం నియమించిన ‘ఇండియన్ హెంప్ డ్రగ్స్ కమీషన్’ ఒక నివేదిక కూడా ఇచ్చింది. దాని ప్రకారం.. “గంజాయిని ఆయుర్వేద మందుల్లో వాడడం వల్ల పెద్దగా సమస్యలు ఉండవు. మితిమీరి వాడితే చాలా పెద్ద నష్టం కలుగుతుంది. కానీ.. ఆ నష్టం వాడేవాళ్లకే తప్ప.. సొసైటీ మీద పెద్దగా ఎఫెక్ట్‌‌‌‌ ఉండదు’. ఈ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. 1961లో నార్కోటిక్ డ్రగ్స్‌‌‌‌పై జరిగిన సమావేశంలో ఇండియన్ గవర్నమెంట్‌‌‌‌ దీన్ని క్రైమ్‌‌‌‌గా చూడాలని గుర్తించింది. ఆ గుర్తింపే 1985లో తీసుకొచ్చిన ఎన్‌‌‌‌డీపీఎస్‌‌‌‌ చట్టం అమలుకు ఉపయోగపడింది. అయితే.. కొన్ని కారణాల వల్ల భంగ్‌‌‌‌ను మాత్రం ఇందులో నుంచి మినహాయించారు. గంజాయిని మరే రూపంలో తీసుకున్నా నేరమే.

మార్పు వచ్చినట్టేనా? 
గంజాయి వాడకం చట్ట ప్రకారం నేరమే అయినప్పటికీ దాని వాడకం వెంటనే తగ్గలేదు. ఆల్‌‌‌‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌ సైన్సెస్‌‌‌‌ (ఏఐఐఎమ్‌‌‌‌ఎస్‌‌‌‌) ఆధ్వర్యంలోని నేషనల్ డ్రగ్ డిపెండెంట్ ట్రీట్‌‌‌‌మెంట్ సెంటర్ 2019లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన దేశంలో దాదాపు 72 లక్షల మంది ప్రజలు గంజాయికి బానిసలయ్యారు. గంజాయిని అన్ని వర్గాల ప్రజలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కువగా బలయ్యేది మాత్రం పేదలే. ‘విధి సెంటర్‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ లీగల్‌‌‌‌ పాలసీ’ ఇచ్చిన నివేదిక ప్రకారం ‘‘ముంబైలో గంజాయి వాడి అరెస్టయిన,  జైలుకు వెళ్లిన వాళ్లలో ఎక్కువగా రోజువారీ కూలీలు, మురికివాడల్లో బతికేవాళ్లు ఉన్నారు. ఈ మధ్య కొన్ని ఎన్జీవోలు, యాక్టివిస్ట్‌‌‌‌ సంఘాలు గంజాయిని లీగలైజ్‌‌‌‌ చేయాలని ప్రచారం చేస్తున్నాయి. 

ఎక్కడ పండిస్తారు? 
తెలుగు రాష్ట్రాల్లో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా గంజాయి పట్టుబడుతూనే ఉంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో  గంజాయి సాగు, రవాణాను అరికట్టే పనిలో పడ్డారు ఆఫీసర్లు. విశాఖ ఏజెన్సీలోని ఆంధ్రా–-ఒడిస్సా బార్డర్‌‌‌‌‌‌‌‌లో గంజాయి ఎక్కువగా సాగు చేస్తున్నారు. సాగు చేసేది గిరిజనులే అయినా.. వాళ్ల చేత చేయించేది మాత్రం వ్యాపారులే. ఈ ప్రాంతం మీద ఆధారపడి వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఇక్కడ దాదాపు పదివేల ఎకరాలకు పైగానే గంజాయి సాగు చేస్తున్నారు. అందులోనూ బాగా మత్తునిచ్చే ‘శీలావతి’ రకం మొక్కలే ఎక్కువగా పెంచుతున్నారు. ఒక గంజాయి మొక్క నుంచి 300 గ్రాముల వరకు ఆకుపొడి వస్తుంది. క్వాలిటీని బట్టి కిలోకు రెండు వేల నుంచి మూడు వేల వరకు ధర పలుకుతోంది. అయితే... ఈ ధర రైతులకు చెల్లించేదే. అది కస్టమర్‌‌‌‌‌‌‌‌ దగ్గరకు వచ్చేసరికి ఒక్కోసారి15,000 రూపాయలు దాటుతుంది. మిగతా పంటలతో పోలిస్తే దీని మీద ఎక్కువ లాభం వస్తుండడంతో కొందరు రైతులు దీనిమీదే ఆధారపడి బతుకుతున్నారు. తమకు బతుకుదెరువు చూపిస్తే ఇలా గంజాయి సాగు చేసే అవసరం ఉండదని వాళ్లంటున్నారు. సాగుకు సాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు కూడా. 

మావోయిస్టులకు అడ్డా
ఒకప్పుడు మావోయిస్టులకు ఆంధ్రా, ఒడిశా బార్డర్‌‌‌‌‌‌‌‌ సేఫ్‌‌‌‌ జోన్‌‌‌‌గా ఉండేది. దాంతో భద్రతా పరమైన సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో పోలీసులు ఎక్కువగా అటువైపు వెళ్లేవాళ్లు కాదు. తర్వాత మావోయిస్టుల ఎఫెక్ట్‌‌‌‌ కాస్త తగ్గినా ఏజెన్సీ ఏరియాను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో అక్కడివాళ్లు ప్రతి ఏడు సాగు విస్తీర్ణాన్ని పెంచుతూ వచ్చారు. 

బలయ్యేది గిరిజనులే 
గంజాయి పండించేది అడవి బిడ్డలే అయినా, లాభాలు దక్కేది వ్యాపారులకే. వాళ్లు మార్కెట్‌‌‌‌లో ఉన్నదానికంటే చాలా తక్కువ ధరకు గంజాయిని కొని కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటారు. కానీ.. దొరికితే జైళ్లకు పోయేది మాత్రం అడవి బిడ్డలే. పైగా వీటిని ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ చేసేది కూడా అమాయకులే. దొరికినవాళ్లలో చాలామంది ఎక్కడా పని దొరక్క ఈ రంగంలోకి వచ్చినవాళ్లే ఉన్నారు. 

ఎన్ని కుటుంబాలో.. 
గంజాయి ఇప్పటివరకు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎన్నో నేరాలకు కారణమైంది. చాలామందిని జైళ్లలో మగ్గేలా చేసింది. దీన్ని మెరువానా, వీడ్‌‌‌‌, పాట్‌‌‌‌, డోప్‌‌‌‌, గ్రాస్‌‌‌‌ అని వేర్వేరు రకరకాలుగా పిలుస్తారు. దీన్ని తీసుకోవడంలో కూడా తేడాలు ఉన్నాయి. పొగ పీల్చొచ్చు. వేప్ చేయవచ్చు. తాగొచ్చు, తినొచ్చు. ఏది చేసినా ఎఫెక్ట్‌‌‌‌ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుంది. ఇది సైకోయాక్టివ్ ఇంగ్రెడియెంట్‌‌‌‌గా పనిచేస్తుంది. దీన్ని తీసుకున్నప్పుడు ( టెట్రా హైడ్రో కనాబినల్) టీహెచ్‌‌‌‌సీ రక్తంలో కలిసి మెదడుకు చేరుతుంది. అప్పుడు మనిషి ఆనందానికి కారణమయ్యే డోపమైన్ అనే రసాయనాన్ని మెదడు విడుదల చేస్తుంది. దాంతో రిలాక్స్‌‌‌‌ అయిన ఫీలింగ్‌‌‌‌ వస్తుంది. టీహెచ్‌‌‌‌సీ కొంతమందిపై కొన్ని సెకన్లలో ఎఫెక్ట్‌‌‌‌ చూపిస్తుంది. కొంతమందికి కొన్ని నిమిషాల్లో నిషా వస్తుంది. కానీ.. 30 నిమిషాల్లో అది మ్యాగ్జిమమ్‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌ చూపిస్తుంది. దీన్ని తీసుకున్న తరువాత దాదాపు గంట నుంచి మూడు గంటల వరకు మత్తు ఉంటుంది. 

మానసిక ఆరోగ్యం
గంజాయితో ప్రతి ఒక్కరికి ఒకే ఫీలింగ్‌‌‌‌ రాదు. కొందరిలో ఆతృత, భయాల్ని కూడా పెంచుతుంది. దానివల్ల క్లినికల్ డిప్రెషన్‌‌‌‌ పెరిగే ప్రమాదం ఉంది. అప్పటికే సైకలాజికల్‌‌‌‌ సమస్యలు ఉంటే అవి మరింత పెరుగుతాయి. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కొన్నిసార్లు  మతిస్థిమితం లేకుండా చేస్తుంది. అలాంటప్పుడు లోకానికి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ లేని విషయాలను వింటారు. చూస్తారు.

ఇంద్రియాలు కంట్రోల్‌‌‌‌లో ఉండవు
గంజాయి కొన్నిసార్లు ఇంద్రియాల పనితీరును తగ్గిస్తుంది. అయితే.. ఈ సమస్య ఒక్కసారికే రాదు. గంజాయి ఎన్ని సార్లు తీసుకున్నాడు? ఎంత క్వాంటిటీ తీసుకున్నాడు? ఇది తీసుకున్న వ్యక్తి  కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. శబ్దాలు బిగ్గరగా వినిపిస్తాయి. అంటే సెన్సెస్‌‌‌‌ బాగా పనిచేస్తాయి. స్కిల్స్‌‌‌‌ గుర్తుండవు. ఉదాహరణకు ఇదివరకు బాగా బైక్‌‌‌‌ నడిపేవాళ్లు గంజాయి తీసుకున్నప్పుడు డేంజరస్‌‌‌‌గా డ్రైవ్‌‌‌‌ చేస్తుంటారు. 

వ్యసనంగా... 
దీన్ని వాడే ప్రతి పదిమందిలో ఒకరు వ్యసనపరులుగా మారతారు. అలాంటివాళ్లు రిలేషన్స్‌‌‌‌,  జాబ్‌‌‌‌,  హెల్త్‌‌‌‌... ఇలా దేనిమీద ఎఫెక్ట్‌‌‌‌ పడినా వాడడం ఆపలేరు. ఎంత చిన్న వయసులో మొదలుపెడితే అంత ఎక్కువ ఎఫెక్ట్‌‌‌‌ ఉంటుంది. ఉదాహరణకు యంగేజ్‌‌‌‌లో వాడడం మొదలుపెట్టిన ప్రతి ఆరుగురిలో ఒకరు వ్యసనపరులుగా మారతారు. యంగ్‌‌‌‌ ఏజ్‌‌‌‌లో ప్రతిరోజూ తీసుకుంటే ఈ నిష్పత్తి 2:1గా కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్లకు ఒక్క రోజు గంజాయి లేకపోయినా నిద్ర పట్టదు. శరీరం సరిగ్గా పనిచేయదు. చిరాకుగా ఉంటుంది. తినాలనిపించదు. 

బ్రెయిన్‌‌‌‌ మీద.. 
గంజాయి తీసుకున్నప్పుడు బ్రెయిన్‌‌‌‌ బాగా పనిచేసినట్టు అనిపించినా తర్వాత నెమ్మదిస్తుంటుంది. నేర్చుకోవడం, విషయాలను గుర్తుంచుకోవడం కష్టమవుతుంది. మత్తు దిగినా దాదాపు 24 గంటల వరకు దాని ఎఫెక్ట్‌‌‌‌ ఉంటుంది. యంగేజ్‌‌‌‌లో వాడడం వల్ల కొంతమందిలో ఇమేజింగ్‌‌‌‌ కెపాసిటీ తగ్గుతుంది. అంతేకాదు మెదడులోని కొన్ని భాగాల్లో చురుకుదనం తగ్గుతుంది. జ్ఞాపకశక్తి కోసం పనిచేసే  కనెక్షన్లు తగ్గుతాయి. కొంతమందిలో ఐక్యూ కూడా తగ్గినట్టు స్టడీలు చెబుతున్నాయి. 

లంగ్స్‌‌‌‌
పొగ బాగా తాగితే ఊపిరితిత్తులు పాడయ్యే అవకాశం ఉంది. గంజాయి ఎక్కువగా తాగితే సిగరెట్ తాగే వాళ్లకు వచ్చే బ్రీతింగ్‌‌‌‌ ప్రాబ్లమ్స్‌‌‌‌ కూడా వస్తాయి. లంగ్స్‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ తగ్గుతుంది. ఈజీగా ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. టీహెచ్‌‌‌‌సీ వల్ల కొంతమందిలో ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. 

ఆకలి బాధ
గంజాయి రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా వాడేవాళ్లలో ఆకలి బాగా పెరుగుతుంది. ఈ సమస్యను ‘‘ది మంచీస్’’ అని పిలుస్తారు. ఎయిడ్స్‌‌‌‌, క్యాన్సర్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నవాళ్లు తీసుకుంటే బరువు పెరుగుతారు. 

హార్ట్‌‌‌‌ 
గంజాయి హార్ట్‌‌‌‌ కెపాసిటీని తగ్గిస్తుంది. మామూలుగా నిమిషానికి 50 నుంచి 70 సార్లు గుండె  కొట్టుకుంటుంది. కానీ గంజాయి తీసుకున్నప్పుడు దాదాపు మూడు  గంటల పాటు నిమిషానికి 70 నుంచి 120 కంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. ఇలాంటి టైంలో కొన్నిసార్లు గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. 

ఆల్కహాల్ వల్లే... 
పోయిన సంవత్సరంలో ప్రతి పది మంది తాగుబోతుల్లో ఒకరు గంజాయికి అలవాటు పడ్డట్టు రీసెర్చ్‌‌‌‌లో తేలింది. అంతేకాదు కొందరు మందుతాగి, గంజాయి తీసుకుంటున్నారు. రెండూ ఒకేసారి వాడటం వల్ల జాబ్‌‌‌‌, పర్సనల్‌‌‌‌ ప్రాబ్లమ్స్‌‌‌‌ వస్తున్నాయని రీసెర్చ్‌‌‌‌లో తేలింది. 

పిల్లలు బరువు తక్కువగా... 
ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు గంజాయి తాగితే పిల్లలు తక్కువ బరువుతో పుడతారు.  నెలలు నిండకుండానే బిడ్డను కంటారు కొందరు. దీనివల్ల పిల్లలు పుట్టిన తర్వాత ఏమైనా సమస్యలు వస్తాయనేదానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.  

ఇదే ఎందుకు? 
గంజాయి ధర క్వాలిటీ, ఏరియాను బట్టి ఉంటుంది. ఎండబెట్టిన మామూలు ఆకుల పొడి పది గ్రాముల రేటు 300– -700 రూపాయలు ఉంటుంది.  కాస్త క్వాలిటీది అయితే.. 1,500 రూపాయలకు అమ్ముతున్నారు. హై క్వాలిటీ రకం గంజాయి 3,000 రూపాయల పైగానే పలుకుతుంది. అదే కొకైన్‌‌‌‌ 2017లో ఒక గ్రాము రేటు  5,000 రూపాయలు ఉంది. ఎక్స్‌‌‌‌టసీ పిల్‌‌‌‌ రేటు 1,500 రూపాయలు, ఇక హెరాయిన్‌‌‌‌ రేటు కిలోకు 98 లక్షల వరకు ఉంటుంది. వీటిలో అన్నింటికన్నా గంజాయి ధర తక్కువగా ఉంది. పైగా విచ్చలవిడిగా దొరుకుతుంది. అందుకే ఎక్కువమంది గంజాయి తాగడానికి ప్రయారిటీ ఇస్తుంటారు.  హాష్‌‌‌‌, గంజాయి పొడి, భంగ్ రూపాల్లో దీన్ని తీసుకుంటారు. 

హాష్: గంజాయి మొక్క రెసిన్(మొక్క నుంచి వచ్చే గమ్ లాంటి పదార్థం)తో తయారు చేస్తారు. రెసిన్‌‌‌‌ను ఎండబెట్టి చిన్న బ్లాక్స్‌‌‌‌గా చేస్తారు. దాన్ని కాల్చి పొగ పీలుస్తారు. కొందరు ఫుడ్‌‌‌‌లో కలుపుకుని కూడా తింటారు. గంజాయిలో 10 -నుంచి 20 శాతం టీహెచ్‌‌‌‌సీ పవర్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. హాష్‌‌‌‌లో 20 శాతం నుంచి 60 శాతం వరకు ఉంటుంది.
గంజాయి పొడి: గంజాయి మొక్క ఆకులు, పూలను ఎండబెట్టి చేసిన పొడి. 
ఫుడ్‌‌‌‌లో: గంజాయి ఆకులు, కాండాన్ని పేస్ట్‌‌‌‌గా చేసి దాన్ని స్వీట్లు, నెయ్యి, మసాలాలు లాంటి వాటిలో కలిపి తింటారు. 

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో గంజాయి!
గంజాయి అనేక రకాలుగా సరఫరా చేస్తుంటారు. ఇదివరకు అరటి గెలలు, కూరగాయలను ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ చేసే వెహికల్స్‌‌‌‌, పిల్లోస్‌‌‌‌లో ట్రాన్స్‌‌‌‌పోర్ట్ చేసేవాళ్లను చూశాం. కానీ.. ఇప్పుడు స్మగ్లర్లు కూడా టెక్నాలజీ వాడుతున్నారు. అమెజాన్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ ద్వారా గంజాయి స్మగ్లింగ్‌‌‌‌ చేస్తున్నారు. దాంతో అమెజాన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌లపై పోలీసు కేసులు పెట్టారు. మధ్య ప్రదేశ్‌‌‌‌లోని ఇద్దరు వ్యక్తులు అమెజాన్ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ ద్వారా వైజాగ్‌‌‌‌ నుంచి 20 కేజీల గంజాయిని తెప్పించుకున్నట్టు పోలీసులు గుర్తించారు. స్వీట్‌‌‌‌నర్ అయిన స్టీవియా ఆకుల పేరుతో గంజాయిని తీసుకొచ్చారు. చట్టవిరుద్ధమైన ప్రొడక్ట్స్‌‌‌‌ని అమెజాన్‌‌‌‌లో అమ్మడానికి పర్మిషన్‌‌‌‌ ఇచ్చేది లేదని ఆ సంస్థ చెప్పింది. అమెజాన్ ద్వారా ఇప్పటివరకు  1.1 కోట్ల రూపాయలకు పైగా విలువైన 1000 కేజీల గంజాయిని అమ్మినట్టు తెలిసింది. 

గంజాయి లీగల్‌‌‌‌!
గంజాయి వాడకాన్ని చాలా దేశాల్లో లీగలైజ్‌‌‌‌ చేశారు.  ఉరుగ్వే 2013లో, దక్షిణాఫ్రికా 2018లో, కెనడా 2020లో గంజాయి వాడకాన్ని లీగలైజ్‌‌‌‌ చేశాయి. మొరాకోలో మెడిసిన్‌‌‌‌ అవసరాల కోసం వాడుకోవచ్చు. ఇప్పటికే అమెరికాలో దాదాపు 17 రాష్ట్రాల్లో గంజాయి వాడేందుకు అనుమతి  ఉంది. 36  రాష్ట్రాల్లో మెడిసిన్‌‌‌‌గా వాడేందుకు పర్మిషన్‌‌‌‌ ఇచ్చారు. ఉరుగ్వేలో 1974లోనే గంజాయిని ఒక పరిమిత మోతాదులో వాడేందుకు పర్మిషన్ ఇచ్చారు. అయినా.. ఇంట్లో పెంచడానికి వీల్లేదు. కొనుక్కునే వీల్లేదు. 2013లో దీన్ని చట్టబద్ధం చేశారు. అంటే దీన్ని కొనొచ్చు, అమ్మొచ్చు, వాడొచ్చు. కానీ.. కొన్ని రిస్ట్రిక్షన్స్‌‌‌‌ ఉంటాయి. కెనడా కూడా దీన్ని సరదాగా వాడేందుకు పర్మిషన్‌‌‌‌ ఇచ్చింది. 

పెట్స్‌‌‌‌కు కూడా.. 
జర్నల్ ఆఫ్ అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్‌‌‌‌ 2013లో ప్రచురించిన కథనం ప్రకారం.. అమెరికాలో పెట్స్‌‌‌‌కు కూడా వాటి యజమానులు గంజాయి ఇస్తున్నారు. పెట్స్‌‌‌‌  అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆ బాధ నుంచి విముక్తి కల్పించేందుకు గంజాయి ఇస్తారట. గంజాయి తీసుకున్న కుక్కలు, పిల్లుల్లో కొన్ని గంటల్లో ఎఫెక్ట్ కనిపిస్తుందని వెటర్నరీ డాక్టర్లు చెప్పారు. కానీ పెట్స్‌‌‌‌కు ఎక్కువ మోతాదులో గంజాయి ఇస్తే ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. 

ఆయుర్వేదంలో... 
ఆయుర్వేదంలో ప్రాచీన కాలం నుంచి ఇప్పటివరకు గంజాయిని వాడుతున్నారు. అందుకోసం స్పెషల్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ తీసుకోవాల్సి ఉంటుంది. గంజాయిని కాంపౌండ్‌‌‌‌ డ్రగ్‌‌‌‌గా మాత్రమే వాడుతున్నారు. నిద్ర లేమి, బాడీ పెయిన్స్‌‌‌‌ లాంటి సమస్యలు వచ్చినప్పుడు దీన్ని ఇస్తారు. ఇలాంటి మందులను ‘మదకారి’ అంటారు. ఈ మందులను ఆయుర్వేద  డాక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రిస్క్రైబ్‌‌‌‌ చేస్తేనే వాడాలి. పేషెంట్ పరిస్థితి, వ్యాధి తీవ్రతను బట్టి ఎంత డోసెజ్‌‌‌‌ అనేది చెబుతారు. వీటితోపాటు బ్రెయిన్‌‌‌‌కి రిలాక్స్‌‌‌‌నిచ్చే మేధ్య రసాయనాలు కూడా ఉన్నాయి. 
- డాక్టర్‌‌‌‌‌‌‌‌ రవీందర్ చిలువేరు, రిటైర్డ్‌‌‌‌ ప్రిన్సిపాల్‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌కేఆర్‌‌‌‌‌‌‌‌ గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజ్ 
::: కరుణాకర్​ మానెగాళ్ల