బ్యాంక్ అప్పు ఉన్నోళ్లకు గుడ్ న్యూస్ : తగ్గిన హోమ్ లోన్- పర్సనల్ లోన్ EMI

బ్యాంక్ అప్పు ఉన్నోళ్లకు గుడ్ న్యూస్ : తగ్గిన హోమ్ లోన్- పర్సనల్ లోన్ EMI

నేడు రిజర్వు బ్యాంక్ తన ఎంపీసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అనూహ్యంగా ఆర్బీఐ గవర్నర్ అతిపెద్ద 50 పాయింట్ల వడ్డీ రేట్లను తగ్గించటంతో పాటు న్యూట్రల్ రేటింగ్ ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే క్రమంలో బ్యాంకుల వద్ద ఉండాల్సిన క్యాష్ రిజర్వు రేషియోను 100 బేసిస్ పాయింట్లు తగ్గించటంతో బ్యాంకింగ్ వ్యవస్థలోకి అదనంగా రూ.2లక్షల 50వేల కోట్ల నిధులు అందుబాటులోకి రానున్నాయి. ఇది ప్రజలకు తేలికగా రుణాలు పొందటానికి దోహదపడనుంది. 

ప్రస్తుతం రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం కారణంగా హోమ్ లోన్, ఆటో లోన్, పర్సనల్ లోన్స్ ఈఎంఐ చెల్లింపుదారులపై భారం తగ్గటంతో పాటు కొత్తగా రుణాలను తీసుకోవాలని అనుకుంటున్న వ్యక్తులకు సైతం తక్కువ వడ్డీ రేట్లకే రుణం పొందొచ్చు. కరోనా మహమ్మారి తర్వాత వరుసగా మూడోసారి వడ్డీ రేట్ల కోతకు రిజర్వు బ్యాంక్ వెళ్లటంతో రెపో రేటు ప్రస్తుతం 5.5 శాతానికి దిగొచ్చింది. 

హోమ్ లోన్ ఈఎంఐ చెల్లింపుదారులకు రెపో రేటు తగ్గింపు ప్రయోజం ఎంతంటే..
ఉదాహరణకు మీరు ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి 30 ఏళ్ల కానికి 8.70 శాతం వడ్డీ రేటుకు రూ.50 లక్షలు హోమ్ లోన్ తీసుకున్నట్లయితే దానికి ప్రస్తుతం రూ.39వేల 136 ఈఎంఐగా చెల్లిస్తుంటారు. కానీ ప్రస్తుతం తగ్గిన వడ్డీ రేటు కారణంగా చెల్లించాల్సిన ఈఎంఐ నెలకు రూ.37వేల 346కి తగ్గుతుంది. ఇక్కడ కాలపరిమితిలో ఎలాంటి మార్పు చేయలేదని గుర్తించాలి. అందువల్ల నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ భారం రూ.1790 తగ్గుతుంది. అంటే ఏడాదికి రూ.21వేల 480 పొదుపు చేయబడుతుంది. 

పర్సనల్ లోన్ ఈఎంఐ చెల్లింపుదారులకు ఎంత మిగులు ఉంటుంది..
ఒక వ్యక్తి ఏదైనా బ్యాంక్ నుంచి 12 శాతం వార్షిక వడ్డీ రేటుకు రూ.5 లక్షలు రుణంగా పొంది.. 5 ఏళ్ల కాలానికి ఈఎంఐ ఎంపిక చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు గమనిద్దాం. సదరు వ్యక్తి నెలకు రూ.11వేల 122 ఈఎంఐగా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం తగ్గిన వడ్డీ రేటుతో వారి కొత్త ఈఎంఐ రూ.10వేల 963 అవుతుంది. అంటే ఏదాది రూ.19 వందల వరకు సేవ్ చేసుకోవచ్చు. 

ఇక్కడ ఈఎంఐ తగ్గింపు కంటే చాలా మంది రుణ కాలాన్ని తగ్గించుకోవటానికి పాత ఈఎంఐ మెుత్తాలను చెల్లించేందుకు ఇష్టపడుతుంటారు. ఈఎంఐ తగ్గించుకోవాలా లేక కాలాన్ని తగ్గించుకోవాలా అనే ఆప్షన్ రుణగ్రహీతల చేతిలో ఉంటుంది.