
మందమర్రి, వెలుగు: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పోరాటం ఫలించిందని, 18 రోజులుగా చేస్తున్న సమ్మెతో మేనేజ్మెంట్ దిగొచ్చి సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చిందని ఏఐటీయూసీ లీడర్లు అన్నారు. మంగళవారం మందమర్రిలోని యూనియన్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ సుదర్శనం మాట్లాడారు. ఆర్ఎల్సీ సమక్షంలో సింగరేణి యాజమాన్యం, జేఏసీ సంఘాల కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె డిమాండ్లపై మూడోసారి సోమవారం చర్చలు జరిగాయన్నారు. ఇందులో కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లకు సింగరేణి ఓకే చెప్పిందన్నారు. ఈ మేరకు ఒప్పందం కుదిరిందని చెప్పారు. కార్మికులకు ప్రయోజనం కలిగే ఒప్పందంపై ఐఎఫ్టీయూ, హెచ్ఎంఎస్ కార్మిక సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తూ కాంట్రాక్ట్ కార్మికవర్గాన్ని తప్పుదోవపట్టిస్తున్నాయని మండిపడ్డారు. అనంతరం మేనేజ్మెంట్గతేడాది సాధించిన వాస్తవ లాభాల్లో కార్మికులకు 35శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ ఏరియా అసిస్టెంట్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు కంది శ్రీనివాస్, జెట్టి మల్లయ్య, పిట్సెక్రటరీ వెల్ది ప్రభాకర్, సీహెచ్‌పీ
బ్రహ్మాచారిణి అవతారంలో అమ్మవారు
బాసర, వెలుగు: బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారు క్షేత్రంలో రెండో రోజు మంగళవారం బ్రహ్మాచారిణి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం వేళలో ఆలయ వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు బాసరకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో సోమయ్య తెలిపారు.
అమ్మవారి సన్నిధిలో స్పెయిన్ డాక్టర్లు...
సరస్వతీ అమ్మవారిని స్పెయిన్ దేశానికి చెందిన ఐదుగురు ఆయుర్వేద డాక్లర్ల బృందం దర్శించుకుంది. గర్భగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్ఠతను అడిగి తెలుసుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.
ఉద్యమానికి ఊపిరిపోసింది బాపూజీ
నిర్మల్, వెలుగు: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది కొండా లక్ష్మణ్ బాపూజీయేనని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్‌లో లక్ష్మణ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. బాపూజీ కాంస్య విగ్రహానికి మంత్రి ఐకే రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మీ, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ పూలమాలలు వేసి నివాళులఅర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం అప్పట్లో మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న గొప్ప పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియడారు. అనంతరం నిట్, జేఈఈ ర్యాంకులు సాధించిన పద్మశాలీ విద్యార్థులను మంత్రి, కలెక్టర్లు సన్మానించారు. కౌన్సిలర్ నవీన్, కోఆప్షన్ సభ్యులు రమణ, సత్యనారాయణ, రాము, వేణు, రాజేశ్వర్, రామలింగం, నారాయణ, రాజేశ్వర్, నర్సయ్య, అశోక్, రవి పాల్గొన్నారు.
బీసీ సంఘం నాయకులతో వాగ్వాదం
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: బీసీ సంఘం నాయకులకు కొండా లక్ష్మణ్ విగ్రహానికి నివాళులర్పించే అర్హత లేదని పద్మశాలీ సంఘం నాయకురాలు ఆశమ్మ అడ్డుకున్నారు. బాపూజీ జయంతి సందర్భంగా బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఇర్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కోరెడ్డి పార్థసారథితోపాటు బీసీ సంఘం నాయకులు బాపూజీ విగ్రహానికి నివాళులర్పించేందుకు రాగా ఆశమ్మ వారితో వాగ్వాదానికి దిగారు. పద్మశాలి సంఘం భవనానికి తాళం వేసినపుడు మీరు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.
ముగిసిన బాస్కెట్‌బాల్ పోటీలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జడ్పీ బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్లో 3 రోజులుగా నిర్వహించిన రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు మంగళవారం ముగిశాయి. బాలుర విభాగంలో హైదరాబాద్ జట్టు విజేతగా నిలవగా, ములుగు, రంగారెడ్డి జట్లు సెకండ్, థర్డ్ ప్లేస్ల్లో నిలిచాయి. బాలికల విభాగంలో మల్కాజ్గిరి జట్టు చాంపియన్‌గా నిలిచింది. హైదరాబాద్, ములుగు జట్లు తరువాతి స్థానాల్లో నిలిచాయి. కార్యక్రమంలో బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదారి చంద్రమోహన్‌గౌడ్, చైర్మన్ ముకేశ్‌గౌడ్, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు పాల్గొన్నారు.
పైసలు మోడీవి.. ప్రచారం కేసీఆర్‌ది
మంచిర్యాల, వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పైసలతో సీఎం కేసీఆర్ సొంత ప్రచారం చేసుకుంటున్నాడని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్ విమర్శించారు. మంగళవారం మంచిర్యాలలో నిర్వహించిన ప్రజా గోస – బీజేపీ భరోసా బైక్ ర్యాలీకి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల గోస సీఎం కేసీఆర్ వినడం లేదన్నారు. అందుకే తాము ప్రజల సమస్యలు విని భరోసా కల్పించడానికి రాష్ట్రవ్యాప్తంగా యాత్రలు చేపడుతున్నామని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు అవుతున్నా కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ఎన్నికల్లో లబ్ది కోసమే దళితబంధు, గిరిజనబంధు అంటున్నాడని విమర్శించారు. సింగరేణి ఎన్నికల్లో కార్మికులకు అనేక హామీలిచ్చి మోసం చేశాడని, సింగరేణి నిధులను సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటకు మళ్లించి కార్మికుల పొట్ట కొడుతున్నాడని అన్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాకపోగా, బ్యాక్ వాటర్‌తో ఊళ్లు, పంటలు మునుగుతున్నాయని ధ్వజమెత్తారు. మంచిర్యాలలో కాలనీలు మునిగిపోతే కేసీఆర్ రాలేదని, బాధితులకు పైసా సాయం చేయలేని మండిపడ్డారు. ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు, రాష్ర్ట కార్యదర్శులు మల్లారెడ్డి, రంగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆకెనపల్లి అడవుల్లో పెద్దపులి సంచారం
పులి పాదముద్రలు గుర్తించిన ఎఫ్ఆర్వో
బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి శివారు అటవీ ప్రాంతంలోని ఆదిల్ పేట బీట్ పరిధిలో మంగళవారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. మంగళవారం ఉదయం 9గంటలకు అడవిలో తమకు పెద్దపులి కనిపించిందని గ్రామస్తులు చెప్పారు. బెల్లంపల్లి ఫారెస్ట్ఆఫీసర్లకు సమాచారమందించడంతో ఎఫ్ఆర్వో ఎ. సుభాష్ , సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని పులి పాదముద్రలు గుర్తించారు. పులి సంచారం నిజమేనని ఎఫ్ఆర్వో సుభాష్ తెలిపారు. పశువుల కాపరులు ఈ ప్రాంతంలో తిరగ వద్దని
ఆయన హెచ్చరించారు.
బెల్లంపల్లిలో సీసీఎఫ్ ఆఫీస్
బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) ఆఫీస్ఏర్పాటు చేసేందుకు ఫారెస్ట్ఆఫీసర్లు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న ఆఫీస్‌ను పాలనా సౌలభ్యం కోసం బెల్లంపల్లిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని బెల్లంపల్లి, మంచిర్యాల, ఉట్నూర్, జన్నారం, చెన్నూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, కాగజ్ నగర్ తదితర అటవీ డివిజన్ లు దీని పరిధిలోకి వస్తాయి. కాగా ఈ ఆఫీస్‌ను బెల్లంపల్లి పట్టణంలోని ఫారెస్ట్ కాంప్లెక్స్ లోని నాటి ఫారెస్ట్ గెస్ట్ హౌజ్, నేటి ఎఫ్ డీఓ రెసిడెన్సి నివాస గృహంలోనే సీసీఎఫ్ ఆఫీసును ఏర్పాటు చేసేందుకు పనులు చురుగ్గా సాగుతున్నాయి. త్వరలో ఆఫీసును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రేమ ఫెయిలైందని యువతి సూసైడ్
తిర్యాణి, వెలుగు : ప్రేమ ఫెయిలైందని ఓ యువతి సూసైడ్ చేసుకుంది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్రం భీం ఆసిఫాబాద్ తిర్యాణి మండలం రొంపల్లి కి చెందిన రాయిసిడం శ్రావణి( నందిని)(17), అదే గ్రామానికి చెందిన మేనబావ శ్రావణ్ తో ప్రేమలోపడింది. పెద్దలకు తెలిసి పెళ్లికి వయసు రాలేదని, తర్వాత చేస్తామని నచ్చజెప్పారు. అప్పుడప్పుడు వారిద్దరి మధ్య గొడవలు జరిగేవని ఈక్రమంలో శ్రావణ్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై మంగళవారం పురుగులమందు తాగి చనిపోయిందని తండ్రి లింబరావు చెప్పారు. పోలీసులు కేసు ఫైల్ చేశారు.
టీఆర్ఎస్ వాళ్లకే దళిత బంధు ఇస్తరా.?
భైంసా, వెలుగు: రెండ్రోజుల క్రితం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నర్సాపూర్(జీ)లో దళిత మహిళపై ప్రవర్తించిన తీరు సరిగా లేదని, దళితులపై ఎందుకింత కక్ష అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్‌రావు పటేల్ ఫైర్అయ్యారు. మంగళవారం దారాబ్జీ ఫ్యాక్టరీలో మీడియాతో మాట్లాడుతూ దళితబంధు తనకు ఇవ్వాలని ఓ మహిళ మంత్రిని కోరగా టీఆర్ఎస్లో ఉన్న దళితులకే ఇస్తామని వ్యాఖ్యానించడం, ఆమెను బయటకు పంపించాలంటూ పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. టీఆర్ఎస్లో ఉన్న దళితులే ఆ స్కీమ్‌కు అర్హులా.? అని.. మోహన్‌రావు ప్రశ్నించారు. ఇది ముమ్మటికీ ఓటు రాజకీయమేనన్నారు. సోమవారం బాసర ట్రిపుల్ఐటీకి వచ్చిన మంత్రి కేటీఆర్ సరస్వతీ అమ్మవారును దర్శించుకోకపోవడం విడ్డూరమన్నారు. బాసర క్షేత్రానికి కేటాయించిన రూ. 50కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు గాలి రవి కుమార్, రామకృష్ణ, నాగభూషణ్, మాణిక్ దగ్డే పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన రజాకార్ల పాలనను తలపిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఫైర్అయ్యారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా వీఆర్ఏలు, టీచర్లు, ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం నిరంకుశ పాలనకు నిదర్శమన్నారు. సమావేశంలో లీడర్లు లాలా మున్న, రమేశ్, దినేష్ మటోలియ, జోగు రవి, ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.
నిర్మల్: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారని బీజేపీ పెద్దపల్లి ఇన్చార్జి రావుల రాంనాథ్ పేర్కొన్నారు. మామడ మండలం కోరటికల్ లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమ్మేళనం నిర్వహించారు.
వృత్తి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఇచ్చోడ, వెలుగు: మహిళలు వృత్తి శిక్షణను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. మంగళవారం ఇచ్చోడలో జన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్, బ్యూటిషన్, టైలరింగ్, మగ్గం శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా శిక్షణ కార్యక్రమాలు నేర్చుకోవడం ప్రయోజనకరమన్నారు. సంస్థ డైరెక్టర్ శ్యామల మాట్లాడుతూ జన శిక్షణ సంస్థ ద్వారా ఏడాదికి 1800 మందికి ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సౌత్‌సెంట్రల్‌రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, ఎంపీపీ ప్రీతం రెడ్డి, ఐటీఐ ట్రైనింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, సర్పంచ్ చౌహన్ సునీత, జన శిక్షణ సంస్థ చైర్మన్ ఆర్.సురేందర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజన్న పాల్గొన్నారు.
రామన్నను పరామర్శించిన మంత్రి కమలాకర్, ఎంపీ సంతోష్ రావు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తల్లి భోజమ్మ ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. మంగళవారం ఆదిలాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ సంతోష్‌రావు ఎమ్మెల్యేను పరామర్శించారు. భోజమ్మ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.
వరదల్లో చిక్కుకున్న రైతు కాపాడిన అధికారులు
దహెగాం,వెలుగు: దహెగాంకు చెందిన కొంతమంది రైతులు మంగళవారం వాగు అవతల పత్తి చేన్లకు వెళ్లారు. అడ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పెద్దవాగు ఉధృతి పెరిగింది. గమనించిన కొందరు రైతులు వాగుదాటారు. ఈక్రమంలో తుమ్మిడి హన్మంతు అనే రైతు పెద్దవాగు, పెద్దవాగు పాయ మధ్యలో చిక్కుకున్నాడు. తోటి రైతులు అధికారులకు సమాచారం అందించగా తహసీల్దార్ రామ్మోహన్‌రావ్, పోలీసులు గజ ఈతగాళ్లను పిలిపించి రైతును వరద దాటించారు.
పాముకాటుతో మహిళ మృతి
దహెగాం,వెలుగు: పత్తి చేనులో కలుపు తీస్తుండగా ఓ మహిళ పాముకాటుకు గురై చనిపోయింది. ఎస్సై సనత్‌కుమార్ వివరాల ప్రకారం.. దహెగాం మండలంలోని ఇట్యాల గ్రామానికి చెందిన రాటె శంకరిబాయి(28) సోమవారం పత్తి చేనులో కలుపు తీస్తుండగా పాము కాటేసింది. గిట్యాలలో ఫస్ట్‌ఎయిడ్ చేసి మంచిర్యాల హాస్పిటల్‌కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తుండగా మంగళవారం పరిస్థితి విషమించి చనిపోయింది. భర్త శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.