పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయండి.. ఓయూ విద్యార్థుల ఆందోళన

పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయండి.. ఓయూ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ : పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళన చేశారు. సిలబస్ పూర్తి కానందున 15 రోజుల పాటు పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలంటూ యూనివర్శిటీ ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవీందర్ యాదవ్, రిజిస్ట్రార్ ఆచార్య పి. లక్ష్మీనారాయణను కలిసి విజ్ఞప్తి చేశారు విద్యార్థులు. ఈ సందర్భంగా తమ సమస్యలను వివరించారు. ఇప్పటి వరకు సబ్జెక్టుల వారీగా సిలబస్ ఎంత వరకు పూర్తి కాలేదో వివరించారు. 

విద్యార్థుల శ్రేయస్సు కోసమే తాము పని చేస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉపకులపతి ప్రొఫెసర్ రవీందర్ భరోసా ఇచ్చారు. పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయడం వల్ల ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని 200 పీజీ కళాశాలల్లో చదువుతున్న దాదాపు 10 వేల మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. విదేశీ విద్యార్థులు ఇప్పటికే తమ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని, చివరి నిమిషంలో పరీక్షలు వాయిదా వేయమని అడగటం సరైన పద్ధతి కాదని సూచించారు. 

ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పరీక్షల వాయిదా విషయంపై జులై 22న యూనివర్శిటీ, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్ తో సమావేశమై.. స్పష్టత ఇస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సమావేశంలో చర్చిస్తామని రిజిస్ట్రార్ ఆచార్య పీ. లక్ష్మీనారాయణ వివరించారు. వీసీ, రిజిస్ట్రార్ లతో సమావేశమైన వారిలో ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్, నిజాం కళాశాల, సైఫాబాద్ తో సహా వివిధ కళాశాల విద్యార్థులు ఉన్నారు.