ఎండలు మండుతున్నయ్.. నార్మల్ కంటే 3 డిగ్రీలు ఎక్కువ

ఎండలు మండుతున్నయ్.. నార్మల్ కంటే 3 డిగ్రీలు ఎక్కువ
  • నస్పూర్ లో అత్యధికంగా 42.1 డిగ్రీలు నమోదు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నయి. మార్చి నెల ముగియకముందే సూర్యుడు సుర్రుమంటున్నడు. టెంపరేచర్లు సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నయి. పొద్దున 8 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నయి. మధ్యాహ్నం తర్వాత భగ్గుమంటున్నయి. అధిక ఉష్ణోగ్రతలతో వేడి తీవ్రత పెరుగుతోంది. జనాలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. టీఎస్‌‌‌‌డీపీఎస్‌‌‌‌ డేటా ప్రకారం.. ఆదివారం మంచిర్యాల జిల్లా నస్పూర్‌‌‌‌లో అత్యధికంగా 42.1 డిగ్రీలు, ఆదిలాబాద్‌‌‌‌ అర్బన్‌‌‌‌, భోరజ్‌‌‌‌, జునైద్‌‌‌‌లలో 42 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఈ సీజన్ లో ఇప్పటిదాకా ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలు. జిల్లాలవారీగా యావరేజ్ టెంపరేచర్లు చూస్తే.. మంచిర్యాలలో 40.2, కుమ్రంభీంలో 40, ఆదిలాబాద్‌‌‌‌లో 39.8, జగిత్యాల, జయశంకర్‌‌‌‌ భూపాలపల్లిలో 39.5, పెద్దపల్లి, నిర్మల్‌‌‌‌లో 39.1, నిజామాబాద్‌‌‌‌లో 39, వరంగల్‌‌‌‌ అర్బన్‌‌‌‌, వనపర్తిలో 38.9, కరీంనగర్‌‌‌‌, రాజన్న సిరిసిల్లలో 38.8, హైదరాబాద్‌‌‌‌లో 37.6 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. సోమవారం కొన్నిచోట్ల సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్‌‌‌‌ ఉందని హైదరాబాద్‌‌‌‌ వాతావరణ శాఖ తెలిపింది.