అదానీ కేసు విచారణ వాయిదా

అదానీ కేసు విచారణ వాయిదా

న్యూఢిల్లీ : అదానీ–హిండెన్​బర్గ్​ కేసు విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు సెబీ ఇటీవలే తన రిపోర్టును సమర్పించిన విషయం తెలిసిందే. ఆర్టికల్​ 370 కేసు విచారణ జరుపుతున్న  కాన్​స్టిట్యూషన్ ​బెంచ్​లో చీఫ్​ జస్టిస్​ఉన్నారని, ఆ కేసు హియరింగ్​ కొనసాగుతుండటం వల్లే అదానీ–హిండెన్​బర్గ్​ కేసు విచారణ వాయిదా పడిందని సమాచారం. ఆగస్టు 14 నాటికే తన రిపోర్టును సెబీ ఇవ్వాల్సి ఉన్నా, మరో 15 రోజుల గడువును కోరింది. ఆ తర్వాత ఆగస్టు 25 నాడు తన రిపోర్టును సుప్రీం కోర్టుకు అందచేసింది. 

ఈ రిపోర్టులో ఏముందనేది బయటకు ఇంకా వెల్లడించలేదు. అదానీ కేసులో మొత్తం 24 అంశాలలో దర్యాప్తు జరుపుతుండగా, వాటిలో 22 అంశాలలో దర్యాప్తు ముగిసినట్లు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. టాక్స్​హెవెన్స్​గా పేరొందిన అయిదు దేశాల నుంచి ఇంకా రిపోర్టులు అందలేదని సెబీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ డేటా అందుబాటులోకి వస్తే తుది రిపోర్టును ఖరారు చేస్తామని సెబీ పేర్కొంటోంది. అకౌంటింగ్​ మోసాలతోపాటు, షేర్ల మానిప్యులేషన్​కు అదానీ గ్రూప్​ పాల్పడుతోందని యూఎస్​ షార్ట్​సెల్లర్​ హిండెన్​బర్గ్​ ఒక రిపోర్టును ఈ ఏడాది మొదట్లో తెచ్చింది.