బీబీసీపై బ్యాన్​ కోసం పిల్​.. కొట్టేసిన సుప్రీం

బీబీసీపై బ్యాన్​ కోసం పిల్​.. కొట్టేసిన సుప్రీం

న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్లకు సంబంధించి వివాదాస్పద డాక్యుమెంటరీ నిర్మించిన బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)పై మన దేశంలో నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఆ పిటిషన్ కు విచారణ అర్హత లేదని, అందువల్ల పిల్ ను కొట్టివేస్తున్నామని జస్టిస్  సంజీవ్  ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ తో కూడిన బెంచ్  పేర్కొంది. హిందూ సేన ప్రెసిడెంట్  విష్ణు గుప్తా, బీరేంద్ర కుమార్ సింగ్ అనే రైతు ఈ పిటిషన్ వేశారు. బీబీసీ డాక్యుమెంటరీ బ్యాక్ గ్రౌండ్ ను చూడాలని పిటిషనర్ల తరపున సీనియర్  అడ్వొకేట్  పింకీ ఆనంద్.. బెంచ్ ను కోరారు. ‘‘ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోంది. ఇప్పటికే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఎకానమీగా ఆవిర్భవించింది. ఇది తట్టుకోలేక భారత్, భారత ప్రభుత్వంపై బీబీసీ వివక్ష చూపుతోంది. అంతేకాకుండా బ్రిటన్ కు ఇప్పుడు ఓ భారత సంతతి వ్యక్తి ప్రధానిగా ఉన్నారు. 2002లో గుజరాత్ అల్లర్లలో ప్రధాని నరేంద్ర మోడీ హస్తం ఉందంటూ మోడీ ఇమేజ్​ను దెబ్బతీసేందుకు బీబీసీ ఆయనపై దుష్ర్పచారం చేస్తోంది. భారత్ లో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు హిందూయిజంపై బీబీసీ చేస్తున్న దుష్ప్రచారం ఇది” అని పింకీ ఆనంద్  వాదించారు. ఆ డాక్యుమెంటరీతో దేశంపై ఏమన్నా ప్రభావం పడుతుందా అని బెంచ్  ప్రశ్నించింది. కోర్టు సమయాన్ని వృధా చేయొద్దంటూ పిల్ ను డిస్మిస్ చేసింది.