పతనావస్థలో క్రిమినల్ ​జస్టిస్​ సిస్టమ్ : మంగారి రాజేందర్

పతనావస్థలో క్రిమినల్ ​జస్టిస్​ సిస్టమ్ : మంగారి రాజేందర్

శిక్షలు విధించే క్రమంలో కోర్టులు ఉదాసీనంగా ఉండకూడదని సుప్రీంకోర్టు కాశీనాథ్​ సింగ్​వర్సెస్​ స్టేట్​ఆఫ్​ జార్ఖండ్​ కేసులో వ్యాఖ్యానించింది. అలా వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ఈ కేసులో జార్ఖండ్​హైకోర్టు విధించిన శిక్షను తగ్గించింది. కాశీనాథ్​సింగ్​అనే వ్యక్తి 14 ఏండ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ నేరాన్ని విచారించిన సెషన్స్​కోర్టు ఈ కేసును అరుదైన వాటిలో అరుదైనదిగా పరిగణించి ముద్దాయికి మరణ శిక్షను ప్రతిపాదించింది. హైకోర్టు ఈ శిక్షను జీవిత ఖైదుగా మార్చి, అతనికి శిక్షలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని తీర్పు ప్రకటించింది. ముద్దాయి సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. అతని అప్పీలును పరిష్కరిస్తూ శిక్షలు విధించే క్రమంలో కోర్టులు ఉదాసీనంగా ఉండవద్దని సుప్రీం వ్యాఖ్యానించింది. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ కేసులో ముద్దాయికి విధించిన శిక్షను ధ్రువీకరిస్తూ అప్పీలుదారుకు ఎలాంటి మినహాయింపులు లేకుండా జీవితాంతం జైలులో ఉండాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరించి ఎలాంటి మినహాయింపులు లేకుండా శిక్షను 30 ఏండ్ల నిర్ణీత కాలానికి తగ్గించింది. ఇలా తగ్గించడానికి సుప్రీంకోర్టు కొన్ని కారణాలనూ పేర్కొంది. ఈ కేసులోని తీవ్రతను బట్టి శిక్షలో మినహాయింపులు (రెమిషన్స్) పొందడానికి యోగ్యత ​లేదని కోర్టు అభిప్రాయపడింది. అయినప్పటికీ ముద్దాయి వయసు(26 సంవత్సరాలు) పరిగణనలోకి తీసుకొని అతను మారడానికి అవకాశం ఉందని భావించి 30 ఏండ్ల శిక్షను రెమిషన్స్ లేకుండా విధించింది. ఇలా తగ్గించిన సుప్రీంకోర్టు శిక్షలు విధించే క్రమంలో ఉదాసీన వైఖరి గురించి మాట్లాడటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కోర్టులు ఇలా ఉంటే ప్రభుత్వాలు మరో విధంగా ఉన్నాయి. 

గ్యాంగ్​స్టర్​ కాల్చివేత..

యూపీలో అతిక్​ అహ్మద్​ అనే రాజకీయ వేత్త, గ్యాంగ్​స్టర్​ హత్యకు గురయ్యాడు. అతని మీద 160 దాకా క్రిమినల్​ కేసులు ఉన్నాయి. అతన్ని, అతని సహచరుడిని పాయింట్ బ్లాంక్​ రేంజ్​లో కొందరు కాల్చి చంపారు. అప్పుడు అతను జ్యుడీషియల్​కస్టడీలో ఉన్నాడు. వైద్య పరీక్షలకు తీసుకు వెళ్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. పోలీసుల నిర్లక్ష్యమా? పోలీసులు హంతకులతో కుమ్మక్కై ఉన్నారా తేలాల్సి ఉంది. గ్యాంగ్​స్టర్లకు రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇస్తాయి. వాళ్లు గెలుస్తారు. ఒక ప్రభుత్వం వారిని నెత్తి మీద పెట్టుకుంటుంది. మరో ప్రభుత్వం ఎన్​కౌంటర్ల పేరుతో వాళ్లను పిట్టను కాల్చినట్టు కాల్చి చంపుతుంది. మరో ప్రభుత్వం లేదా ప్రభుత్వాలు జైళ్లలో ఉండి శిక్షలు అనుభవిస్తున్న వ్యక్తుల నిబంధనలు సవరించి విడుదల చేస్తాయి. ఇలాంటి బలశాలుల మీద  కేసు నమోదవడమే కష్టం. అది కోర్టు దాకా పోయి శిక్ష పడటం అరుదైన కేసుల్లో అరుదుగా జరుగుతుంది. అలాంటి వ్యక్తులను సులువుగా ప్రభుత్వాలు వదిలిపెడుతున్నాయి. నేర న్యాయ వ్యవస్థ మీద అసలే నామమాత్రంగా ఉన్న విశ్వాసం.. పూర్తిగా పోయే పరిస్థితి ఏర్పడుతున్నది.

రాజకీయ సంకల్పం కావాలి

ఓ రాజకీయ నాయకుడికి కోర్టులు శిక్ష వేయగానే ప్రజలకు కోర్టుల మీద విశ్వాసం కలుగుతుంది. ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాల్సి ఉంది. నేర– రాజకీయ వేత్తల అనుబంధం న్యాయమూర్తులను కూడా భయపెడుతుంది. అతీక్ ​అహ్మద్​పై కేసుల విచారణ నుంచి 10 మంది హైకోర్టు న్యాయమూర్తులు తప్పుకున్నారు. వాళ్లు కారణాలు ఏమీ చెప్పనప్పటికీ, అతను తమపై ప్రతీకారం తీర్చుకుంటాడనే భయంతోనే తప్పుకున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఇది మన సమాజానికి ఎలాంటి సంకేతం ఇస్తుంది? కోర్టులు ఉదాసీనంగా శిక్షలు విధించకూడదు. శిక్ష పడిన వ్యక్తులు చేసిన నేరాల తీవ్రతని, వారి నేర చరిత్రను గమనించి ప్రభుత్వాలు రెమిషన్ని ఇవ్వాలి. అంతేగానీ ఓట్ల కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటే నేర న్యాయ వ్యవస్థ పూర్తిగా ఒకనాడు కుప్పకూలుతుంది. ఈ స్థితిని మార్చడానికి రాజకీయ సంకల్పం కావాలి. కోర్టులు శిక్షలను మాత్రమే వేస్తాయి. అలా కొంతమేరకు ఈ పతనాన్ని ఆపగలవు. కానీ పూర్తిగా సాధ్యపడదు. ఆ శిక్షలను సరిగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంది. అనవసర వ్యక్తులకు ప్రభుత్వాలు రెమిషన్ ఇవ్వడాన్ని గమనించి కోర్టులు జీవిత ఖైదు విధిస్తూ 30 సంవత్సరాలు ఎలాంటి రెమిషన్ లేకుండా జైలులో ఉండాలని, చనిపోయే వరకు జైలులో ఉండాలని ఆదేశిస్తున్నాయి. శిక్షలు విధించే క్రమంలో ఉదాసీనంగా ఉండకూడదని సుప్రీం కోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. నేర న్యాయ వ్యవస్థ కుప్పకూలకుండా చూడాల్సిన బాధ్యత కోర్టుల మీద కన్నా ప్రభుత్వాల మీదే ఎక్కువగా ఉన్నది. ఇది జరగనప్పుడు సినిమాల్లో చూస్తున్నదే నిజ జీవితంలో కన్పిస్తుంది. అదే నిజం అవుతుంది.

చట్టసభల్లో క్రిమినల్​ రికార్డు

2019 తర్వాత ఏర్పడిన17వ లోక్​సభను పరిశీలిస్తే.. లోక్​సభలో సగం మంది ఎంపీలు తమ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించారు. 542 మంది సభ్యుల్లో 233 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2009 నుంచి గమనిస్తే ఇలా ప్రకటించుకున్న సభ్యుల సంఖ్య 44 శాతం పెరిగింది. 2019లో ఏర్పాటైన లోక్​సభను పరిశీలిస్తే క్రిమినల్​కేసులు ఎక్కువ ఉన్న అభ్యర్థులే ఎక్కువ మంది గెలిచారు. వారికి ఓటర్లు భయపడి ఓట్లు వేశారా లేక తమ బలం వల్ల గెలిచారా? అది ఆలోచించాల్సిన విషయం. మన నేర న్యాయవ్యవస్థ పూర్తిగా రాజకీయ నాయకుల చేతిలో ఉంది. రాజకీయ నాయకులు నేర చరితుల చేతుల్లో, గ్యాంగ్​స్టర్ల చేతుల్లో ఉన్నారు. గెలిచే సత్తా ఉన్న వారికే అన్ని రాజకీయ పక్షాలు టిక్కెట్లు ఇస్తున్నాయి. ఇలా వారి అనుబంధం కొనసాగుతుంది. నేరాలకు, రాజకీయాలకు ఉన్న సంబంధం విడదీయరానిదిగా కనిపిస్తుంది. ఇది సాధారణమైన విషయంగా ప్రజలు పరిగణించే స్థితి మన దేశంలో ఏర్పడింది. చాలా పెద్ద సంఖ్యలో నేరస్తులు, గ్యాంగ్​స్టర్లు శాసన సభలకు, పార్లమెంట్​కు ఎన్నిక కావడం ప్రజలకు ఆశ్చర్యం కలిగించడం లేదు. వాళ్లు మంత్రులుగా పనిచేయడం లాంటి సంఘటనలు, జైళ్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం లాంటి ఘటనలు మన దేశంలో తప్ప మరెక్కడా కనిపించవు.

ప్రభుత్వాల తీరు ఇలా..

మనదేశంలో గ్యాంగ్​స్టర్లు, నేరస్తులు రాజకీయాలను శాసిస్తున్నట్టు అన్పిస్తుంది. పోలీసులు, రాజకీయ నాయకులు, జైలు అధికారులు ఈ గ్యాంగ్​స్టర్లు చెప్పిన విధంగా నడుచుకుంటారని సినిమాల్లో చూస్తుంటాం. ఇప్పుడది నిజ జీవితంలో కూడా కన్పించి సినిమాలను మరిచిపోయేలా చేస్తున్నాయి. బీహార్​ రాష్ట్రంలోని గ్యాంగ్​స్టర్​ - రాజకీయ వేత్త మాజీ ఎంపీ ఆనంద్ ​మోహన్​ సింగ్​ గోపాల్​గంజ్​జిల్లా మేజిస్ట్రేట్​ను హత్య చేయడానికి ప్రేరేపించినందుకు కోర్టు అతనికి జీవితఖైదు విధించింది. ఈ హత్య 1994లో జరిగింది. అతన్ని ముందుగా విడుదల చేయడం కోసం బీహార్ ​ప్రభుత్వం జైలు నిబంధనలను సవరించింది. అతను ఏప్రిల్​ 2023లో విడుదల అయ్యాడు. గర్భవతి అయిన బిల్కిస్​ బానోని 11  మంది అత్యాచారం చేశారు. ఈ సంఘటనలో ముద్దాయిలకు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. కాగా గత 15 ఆగస్టు 2022లో గుజరాత్​ప్రభుత్వం వారందరినీ విడుదల చేసింది. 

- మంగారి రాజేందర్, జిల్లా, సెషన్స్​ జడ్జి(రిటైర్డ్​)