రాజద్రోహ చట్టం ఇంకా అవసరమా?

రాజద్రోహ చట్టం ఇంకా అవసరమా?
  • గాంధీలాంటి ఫ్రీడమ్ ఫైటర్ల గొంతు నొక్కేందుకు బ్రిటిషోళ్లు తెచ్చిన చట్టమది  
  • ఇండిపెండెన్స్ వచ్చి 75 ఏండ్లయినా ఎందుకు రద్దు చేయట్లే? 
  • కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు 
  • దీనిపై తమ వైఖరి చెప్పాలంటూ ఆదేశం   

న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహ చట్టాన్ని ఇప్పటికీ పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అప్పట్లో మహాత్మా గాంధీ, గోఖలే వంటి ఫ్రీడమ్ ఫైటర్ల గొంతు నొక్కేందుకు బ్రిటిష్​వలస పాలకులు తెచ్చిన ఈ చట్టాన్ని ఇంకా ఎందుకు రద్దు చేయడం లేదంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘దేశానికి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఏండ్లు గడిచాయి. ఇంకా ఆ చట్టం అవసరం ఉందా?” అని అడిగింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని సెక్షన్ 124ఏ (రాజద్రోహం)కు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్​ఇండియాతో పాటు రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్జీ వంబత్ కెరె దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు చీఫ్​జస్టిస్ ఎన్ వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్ తో కూడిన బెంచ్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. సుప్రీంకోర్టు గతంలోనే ఐటీ చట్టంలోని 66ఏను రద్దు చేసినా, ఇప్పటికీ దాని కింద పెద్ద ఎత్తున కేసులు పెడుతూ దుర్వినియోగం చేస్తున్న విషయాన్ని బెంచ్ ప్రస్తావించింది. రాజద్రోహ చట్టానికి రాజ్యాంగబద్ధతను తాము పరిశీలిస్తామని చెప్పింది. సెక్షన్ 124ఏ పేరిట భావప్రకటన, మాట్లాడే స్వేచ్ఛను హరిస్తున్నారన్న పిటిషనర్ వాదనలపై స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. 
పాత చట్టాలను రద్దు చేస్తున్నారుగా.. 
‘‘ఒక చెట్టును నరకమని ఓ కార్పెంటర్ కు రంపం ఇస్తే.. అతను అత్యుత్సాహంతో మొత్తం అడవినే నరికేసినట్లు’’గా ప్రస్తుత పరిస్థితి ఉందని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఓ పోలీస్ ఆఫీసర్ కు ఏదైనా ఒక కారణంతో ఓ వ్యక్తిపై కోపం వస్తే.. ఈ సెక్షన్ ను ప్రయోగించే అవకాశం ఉందని, తమకు పడని ఇతర గ్రూపుల వాళ్లను ఇరికించేందుకు ఈ చట్టంలోని నిబంధనలను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.  ‘‘మీ (కేంద్ర) ప్రభుత్వం ఇప్పటికే పాత చట్టాలను రద్దు చేస్తోంది. దీనిపై మాత్రం ఎందుకు నిర్ణయం తీసుకోవడంలేదో తెలియడంలేదు” అని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ను ఉద్దేశించి బెంచ్ ప్రశ్నించింది. తాము ప్రత్యేకంగా కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలను నిందించడం లేదని, అయితే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నది మాత్రం నిజమని స్పష్టం చేసింది. 
ఈ చట్టం కింద నేరం రుజువు అవుతున్న సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నప్పటికీ, దీనిపై ఎలాంటి జవాబుదారీతనం లేకుండా పోయిందని కామెంట్ చేసింది. 

సెక్షన్124ఏ లో ఏముంది? 
ఐపీసీలోని సెక్షన్124ఏ (రాజద్రోహం) నిబంధనల ప్రకారం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ద్వేషం పెంచడం, ధిక్కారం, శత్రుత్వం చూపడం లేదా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడాన్ని రాజద్రోహం (క్రిమినల్ నేరం)గా పరిగణిస్తారు. సర్కార్ కు వ్యతిరేకంగా ఉండే మాటలు, పాటలు, చేతలు, రాతలను కూడా దేశద్రోహంగా భావించొచ్చు. ఈ చట్టం కింద పోలీసులు వారెంట్ లేకుండానే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. కోర్టు నుంచి ముందస్తు అనుమతి లేకుండానే ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. నేరం రుజువైతే కనీసం మూడేండ్ల జైలు శిక్ష, గరిష్టంగా జీవితఖైదు విధించే అవకాశం ఉంది. 

రాజ్యాంగానికి విరుద్ధం: రిటైర్డ్ మేజర్ జనరల్ 
ఐపీసీలోని సెక్షన్ 124ఏను రద్దు చేయకుండా అలాగే ఉంచొచ్చని సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ తెలిపారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ జారీ చేయొచ్చని చెప్పారు. అయితే భావ ప్రకటన, మాట్లాడే స్వేచ్ఛకు ఇది విఘాతం కలిగిస్తోందని రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్జీ వంబత్ కెరె వాదించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిందేనన్నారు. మారిన కాలం, పరిస్థితులు, చట్టాల్లో మార్పులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ.. ‘‘ఆయన తన మొత్తం జీవితాన్ని దేశం కోసం ఇచ్చారు. ఈ కేసును ఫైల్ చేయడంలో ఆయన ఉద్దేశాన్ని ప్రశ్నించకూడదు” అని అభిప్రాయపడింది.