
అర్నబ్ ను అరెస్టు చేయొద్దన్న ఆదేశాలను పొడిగించిన సుప్రీంకోర్టు
ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలన్న పిటిషన్ పై తీర్పు వాయిదా
న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామిని అరెస్టు చేయొద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సోమవారం పొడిగించింది. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ అర్నబ్ వేసిన పిటిషన్ పై తీర్పును వాయిదా వేసింది. పాల్గార్ ఘటనకు సంబంధించి న్యూస్ షోలో మతపరమైన మనోభావాలు దెబ్బ తీసేలా కామెంట్స్ చేశారంటూ అర్నబ్ పై ముంబై పోలీసులు ఈ నెల 2న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అదే సమయంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీపై అనుచిత కామెంట్స్ చేశారంటూ వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. అర్నబ్ ను ముంబై పోలీసులు 12 గంటలపాటు ప్రశ్నించారని, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉందని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్. షాలతో కూడిన బెంచ్ ఎదుట ఆయన తరపున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే వాదించారు.
ఓ రాజకీయ పార్టీ జర్నలిస్టును టార్గె్ట్ చేసిందని, కంప్లెయింట్స్ ఇచ్చినవారంతా ఆ పార్టీకి చెందినవారేనని అన్నారు. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. పిటిషనర్ పోలీసులపై ఆరోపణలు చేసినందున ఈ కేసును ఇండిపెండెంట్ ఏజెన్సీతో విచారణ జరిపించాలని కోరారు. మహారాష్ట్ర గవర్నమెంట్ తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ వాదిస్తూ అర్నబ్ ఆర్టికల్ 19ని ఉల్లంఘించారని బెంచ్ కు చెప్పారు.