బిల్కిస్ బానో కేసులో రెండు వారాల్లో వివరణ ఇవ్వాలె

బిల్కిస్ బానో కేసులో రెండు వారాల్లో వివరణ ఇవ్వాలె

న్యూఢిల్లీ: బిల్కిస్ బానో కేసుకు సంబంధించి గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ కేసులో జీవిత ఖైదు పడ్డ 11 మంది దోషుల విడుదలకు సంబంధించి వివరణ ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని  ఆదేశాలు జారీ చేసింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన పేరుతో బిల్కిస్ బానో కేసులో జీవిత ఖైదు పడ్డ 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగింది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి. .. ఏడుగురిని దారుణంగా హత్య చేసినవాళ్లను ఎలా వదిలిపెడుతారంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలోనే దోషుల విడుదలను సవాలు చేస్తూ సీపీఎం ఎంపీ సుభాషిణి అలీ, జర్నలిస్ట్ రేవతి లాల్, ప్రొఫెసర్ రూపా రేఖా వర్మ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. గురువారం ఈ కేసు విచారణ చేపట్టిన సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ విక్రమ్ నాథ్ లతో కూడిన బెంచ్...11మంది విడుదలకు సంబంధించి 2 వారాల్లో వివరణ ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.