- ఓటుకు నోటు కేసులో పిటిషనర్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, వెలుగు: ‘‘దేశంలో ఉన్నత స్థానాల్లోని వ్యక్తులపై కేసులు నమోదైతే విచారణను పాకిస్తాన్, శ్రీలంకకు మార్చాల్నా’’ అని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఓటుకు నోటు కేసు విచారణను ఎందుకు వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయాలని పిటిషనర్లయిన బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించింది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని ఈ ఏడాది జనవరి 31న బీఆర్ఎస్ నేతలు మహమూద్ అలీ, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, కల్వకుంట్ల సంజయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
తొలుత పిటిషనర్ల తరఫున అడ్వకేట్లు వాదిస్తూ... చివరి రాత్రే కౌంటర్ దాఖలు చేశారని, రీజాయిండర్ దాఖలు చేయడానికి రెండువారాల సమయం కావాలన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం చీఫ్ మినిస్టర్‌గా ఉన్నారని, అందువల్ల ఆధారాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ వాదనలపై స్పందించిన జస్టిస్ బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశంలో ఉన్నత స్థానాల్లోని వ్యక్తులపై కేసులు నమోదైతే విచారణను పాకిస్తాన్, శ్రీలంకకు విచారణ మార్చాల్నా” అని ప్రశ్నించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ కేవీ విశ్వనాథ్ స్పందిస్తూ... ‘‘నిందితుడు సీఎం అయినంత మాత్రాన కోర్టులు ప్రభావితం అవుతాయా? కేసును మరో రాష్ట్రానికి మార్చాల్నా?” అని నిలదీశారు.
ఇందుకు పిటిషనర్ల తరఫు అడ్వకేట్లు వాదనలు కొనసాగిస్తూ.. ప్రభుత్వం, ప్రాసిక్యూషన్ ఏజెన్సీలు తమ వాదనలు మార్చుకునే అవకాశం ఉందన్నారు. రెండు వారాల్లో రీజాయిండర్ దాఖలు చేయాలని పిటిషనర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోసారి పిటినర్ల తరఫు అడ్వకేట్లు వాదనలు వినిపించేందుకు యత్నించగా... ఆర్డర్ పాస్ చేశాక కూడా వాదనలు ఎందుకని, రెండు వారాల్లో రిజాయిండర్ ఫైల్ చేయాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
