ఖైదీల విడుదలపై క్లారిటీ ఇవ్వని సర్కార్

ఖైదీల విడుదలపై క్లారిటీ ఇవ్వని సర్కార్
  • ఖైదీల క్షమాభిక్షపై స్పష్టత కరవు
  • వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 15న విడుదలకు ఓకే చెప్పిన కేబినెట్ 
  • రెండేండ్లుగా అమలుకాని ఖైదీల క్షమాభిక్ష

హైదరాబాద్: జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల క్షమాభిక్షపై అనుమానాలు నెలకొన్నాయి. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. అది ఇంతవరకు ఆచరణకు నోచుకోకపోవటంతో.. ఖైదీల కుటుంబాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.ఒకవైపు దేశ వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు జరుపుకుంటుంటే..  ఖైదీల విడుదల ఉంటుందా..? ఉండదా..? అన్నదానిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. 

క్షణికావేశం, తెలిసీ తెలియక చేసిన తప్పులకు ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తుంటారు కొందరు. వారిలో సత్ప్రవర్తన కల్గిన ఖైదీలను.. ప్రభుత్వం ప్రతిఏటా క్షమాబిక్షతో విడుదల చేస్తుంటుంది. కానీ విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో ఖైదీలు, వారి కుటుంబ సభ్యులకు నిరాశ తప్పటంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లల్లో మగ్గుతున్న 75 మంది ఖైదీలను ఆగస్టు 15న విడుదల చేసేందుకు సీఎం అధ్యక్షతన జరిగిన క్యాబినెట్  ఓకే చెప్పింది. 75 ఏళ్ల స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల సందర్భంగా.. ఆగస్టు 15న క్షమాభిక్షకు అర్హులైన ఖైదీలను విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ మార్గదర్శకాలు అందకపోవటంతో వారి విడుదల వాయిదా పడింది. ఇప్పుడు గాంధీ జయంతి సందర్భంగా కూడా క్షమాభిక్షపై ఖైదీల విడుదలకు.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు జైళ్ల శాఖకు అందలేదు.

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు 130మందిగా గుర్తించిన జైళ్లశాఖ

రాష్ట్రంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారిలో 130 ఖైదీలను సత్ప్రవర్తన కలిగిన వాళ్లుగా జైళ్లశాఖ నిర్ధారించింది. అర్హులైన వారి పేర్లతో లిస్టును ఆగస్టు 15కు ముందు ప్రభుత్వానికి అందించింది. ఇందులో పదేళ్లు శిక్షాకాలం పూర్తి చేసుకున్న వారికి అవకాశం కల్పించారు. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా కూడా క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల జాబితాను ప్రభుత్వానికి పంపారు అధికారులు. వారి విషయంలోనూ ఇప్పటికీ స్పష్టత రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు  ఖైదీలను క్షమాభిక్షపై విడుదల చేశారు. గాంధీ జయంతి సందర్భంగా 2016, 2020లో 4వందల మంది ఖైదీలు విడుదలయ్యారు. గత రెండేండ్లుగా ఖైదీల క్షమాభిక్ష అమలు కాలేదు. ఆగస్టు 15న విడుదల చేస్తామన్న 75 మందిని గాంధీ జయంతి కైనా విడుదల చేస్తారా అన్నదానిపై క్లారిటీ లేదు. ప్రభుత్వం త్వరగా గైడ్ లైన్స్ విడుదల చేసి తమ వారిని విడుదల చేయాలని ఖైదీల కుటుంబాలు సర్కారును వేడుకుంటున్నాయి.