మద్యం దుకాణాల టెండర్స్ నోటిఫికేషన్‌లపై హైకోర్టులో విచారణ

మద్యం దుకాణాల టెండర్స్ నోటిఫికేషన్‌లపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : మద్యం దుకాణాల టెండర్స్ నోటిఫికేషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. మద్యం దుకాణాల టెండర్స్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. కొన్ని కులాలకు మాత్రమే మద్యం దుకాణాల నోటిఫికేషన్‌లో రిజర్వేషన్ ఇవ్వడం సరైన పద్ధతి కాదని పిటిషనర్స్ తరపు న్యాయవాది ఎల్ రవిచంద్ న్యాయస్థానంలో వాదించారు.

బీసీ గౌడ్‌లకు, ఎస్టీ, ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించడం సరైంది కాదని వాదనలు వినిపించారు. మద్యం షాప్ కుల వృత్తి కాదని.. అందరికీ సమాన అవకాశం ఇవ్వాలని పిటిషనర్లు వాదించారు. పిటిషనర్స్ అప్లికేషన్లను పరిగణలోకి తీసుకోవాలని.. తదుపరి తీర్పుకు అనుగుణంగా నడుచుకోవాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి విచారణ హైకోర్టు 10 రోజులకు వాయిదా వేసింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం రికార్డు స్థాయిలో అప్లికేషన్లు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 620 వైన్స్ షాపులు ఉండగా.. శుక్రవారం (ఆగస్టు 18వ తేదీ) చివరి రోజు కావడంతో అర్ధరాత్రి వరకు లక్షా 20 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఆగస్టు 18వ తేదీ ఒక్కరోజే 50వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు అప్లికేషన్ల ద్వారానే రూ. 2 వేల 400 కోట్ల ఆదాయం సమకూరింది.