
సంచార జాతులకు ప్రత్యేక బడ్జెట్ కావాలి
రాష్ట్ర సంచార జాతుల సంఘం డిమాండ్
ముషీరాబాద్, వెలుగు : విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో వెనకబడిన సంచార జాతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని తెలంగాణ సంచార జాతుల సంఘం డిమాండ్ చేసింది. సంచార జాతుల స్థితిగతులను వెంటనే స్టడీ చేసి ప్రత్యేక పథకాలను రూపొందించాలని కోరింది. బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం సంచార జాతుల జాతీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, నేషనల్ డీఎన్టీ కమిషన్ మాజీ చైర్మన్ బాలకృష్ణ రేణకే, ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్రా వీరన్న హాజరై, హైదరాబాద్ డిక్లరేషన్ 2023 ముసాయిదాను ఆవిష్కరించారు. అనంతరం కృష్ణ మోహన్ రావు మాట్లాడుతూ..జాతీయ సమ్మేళనం కార్యక్రమం 3 రోజులపాటు జరగుతుందని తెలిపారు. సంచార జాతి ప్రజలు విద్యా, ఉద్యోగ రంగాల్లో ఒక్క శాతం కూడా లేరని వెల్లడించారు.
ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. ఈ వర్గాల అభివృద్ధికి కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. బాలకృష్ణ రేణకే మాట్లాడుతూ.. దేశ జనాభాలో 12 శాతం ఉన్న సంచార జాతుల ప్రజలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. వాళ్లు రాజకీయంగా ఎదిగేందుకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయించాలని కోరారు. పెండ్రా వీరన్న మాట్లాడుతూ.. సంచార జాతుల ప్రజల విద్యావంతులు కానంత వరకు అభివృద్ధి చెందరని అన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచార జాతుల ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమ్మేళనంలో ప్రొఫెసర్ తిరుమలి, ప్రొఫెసర్ చెన్న బసవయ్య, రాష్ట్ర సంచారజాతుల సంఘం అధ్యక్షుడు ఒంటెద్దు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.