
- ట్రైనింగ్ పూర్తయి డ్యూటీలోకి వస్తున్న తెలంగాణ కేడర్ ఐపీఎస్‌లు
- ముగ్గురిలో ఒకరు ఇంజనీర్, ఇద్దరు డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి ముగ్గురు కొత్త ఐపీఎస్ అధికారులు వచ్చారు. నేషనల్ పోలీస్ అకాడమీలో 70వ ఐపీఎస్ బ్యాచ్ కు శనివారంతో ట్రైనింగ్ పూర్తయింది. అందులోని 92 మంది ఐపీఎస్‌లలో ముగ్గురు తెలంగాణ కేడర్ వారు ఉన్నారు. ఢిల్లీకి చెందిన గౌస్ ఆలమ్, కర్నాటకకు చెందిన జి.వినీత్, పి.శబరీశ్ త్వరలో రాష్ట్రంలో డ్యూటీలో చేరనున్నారు.
ఆల్ రౌండ్ టాపర్ గౌస్ ఆలమ్
ఐపీఎస్ గౌస్ ఆలమ్ స్వస్థలం ఢిల్లీ. మొదటి నుంచీ చదువులో చురుగ్గా ఉండేవారు. తండ్రి ఆర్మీలో సుబేదార్‌గా పనిచేసేవారు. ఆయన చిన్నతనంలోనే మరణించడంతో అలమ్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా కష్టపడి చదివారు. ముంబై ఐఐటీలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఓ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తూ.. సివిల్ సర్వీసెస్ కు ప్రిపేరయ్యారు. 2016లో ఐపీఎస్ కు సెలక్టయ్యారు. 70వ రెగ్యులర్ బ్యాచ్ లో హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. ఇండోర్, ఔట్ డోర్ ట్రైనింగ్ లో మెరిట్‌గా నిలిచి ఆరు ట్రోఫీలను గెలుచుకున్నారు.
డాక్టర్ నుంచి ఐపీఎస్గా వినీత్
బెంగళూర్ కు చెందినవారు జి.వినీత్. తండ్రిది చిరు వ్యాపారం. మెడిసిన్ పూర్తి చేసి, ఆర్థోపెడిక్స్ స్పెషాలిటీగా ఎంఎస్ పూర్తి చేశారు. తర్వాత వివిధ హాస్పిటళ్లలో ఆర్థోపెడిక్స్ డాక్టర్‌గా పనిచేశారు. పేద ప్రజల బాధలు, యాక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోవడం, కాళ్లు, చేతులు విరిగి జీవచ్ఛవాలుగా మారడం తనను కదిలించాయని.. అందుకే ప్రజలకు సేవ చేసేందుకు సివిల్ సర్వీస్ రాయాలని నిర్ణయించుకున్నానని వినీత్చెప్తుండేవారు. ఆ క్రమంలో డాక్టర్‌గా పనిచేస్తూనే సివిల్స్రాసి.. 2016 బ్యాచ్ ఐపీఎస్ గా సెలెక్టయ్యారు. ట్రైనింగ్‌లో తెలుగులో ఎస్సే రైటింగ్ లో హోంమినిస్టర్ ట్రోఫీని గెలుచుకున్నారు.
పోలీసు కుటుంబం నుంచి శబరీశ్
కర్నాటకలోని చిత్రదుర్గకు చెందిన పి.శబరీశ్ పోలీస్ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఆయన తాత ఎస్సైగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంబీబీఎస్ చదివిన శబరీశ్.. కొంతకాలం హౌస్ సర్జన్ గా పనిచేశారు. తాత గైడ్ లైన్స్ తో రెండు సార్లు సివిల్స్ రాశారు. మూడో ప్రయత్నంలో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఇండోర్, ఔట్‌డోర్ పోలీసింగ్‌లో ప్రతిభ చూపారు. తనది సమీప ప్రాంతమే కావడంతో తెలంగాణలో పోలీసింగ్, ఇతర పరిస్థితులపై అవగాహన ఉందని తెలిపారు.