
- ముగ్గురు నిందితుల అరెస్ట్..
- వీరిలో ఒకరు 11 ఏండ్ల బాలుడు
- ఇద్దరు మేజర్లకు 12 రోజుల రిమాండ్
ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: తమ పశువులపై దాడి చేసి చంపుతున్నాయనే కోపంతోనే పులులకు పశువుల కాపరులు విష ప్రయోగం చేసినట్లు కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ నీరజ్ కుమార్ టీబ్రేవాల్ తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఏ1గా ఉన్న కోవా గంగు , ఏ2గా ఉన్న ఆత్రం జలపతికి కోర్టు 12 రోజులు రిమాండ్ విధించిందన్నారు. మరో నిందితుడైన 11 ఏండ్ల బాలుడిని జువైనల్ పేరెంటల్ బాండ్‌పై విడుదల చేశామన్నారు.
కాగజ్ నగర్ ఎఫ్‌డీవో వేణు బాబుతో కలిసి డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ శుక్రవారం డివిజన్ ఆఫీస్‌లో వివరాలు వెల్లడించారు. ఈ నెల 8న కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ లోని దరిగాం సమీపంలోని అడవిలో ఓ పెద్దపులి మృతి చెందినట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి చూసి దానిని ఎస్9 పులిగా గుర్తించామన్నారు. దర్యాప్తులో వాంకిడి మండలం రెంగరేట్ కు చెందిన పశువుల కాపర్లు కోవ గంగు(24), ఆత్రం జలపతి (22) తో పాటు మరో 11 ఏండ్ల బాలుడు విషం పెట్టి చంపినట్లు తేలిందని చెప్పారు. ఈ మేరకు గురువారం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని ఆధారాలు సేకరించినట్లు డీఎఫ్‌వో తెలిపారు. అలాగే దర్యాప్తు పూర్తయ్యాక విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు ఉంటాయని వెల్లడించారు.
వచ్చే వారంలో మహారాష్ట్ర ఆఫీసర్లతో మీటింగ్
పులుల మరణాలను అరికట్టి, వాటిని సంరక్షించేందుకు వచ్చే వారంలో తెలంగాణ, మహారాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారుల సంయుక్త సమావేశం ఉంటుందని నీరజ్ కుమార్ తెలిపారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సూచనతో పులుల రక్షణ, ఇతర అంశాలపై ఈ మీటింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్, పులుల సంచారం ఉన్న మహారాష్ట్ర ప్రాంతాలలో తీసుకునే చర్యలు, ప్రణాళికపై ఇందులో చర్చిస్తామన్నారు.
గాయపడ్డ పులి పిల్ల ఎక్కడ?
ఈ నెల 6న దరిగాం అడవుల్లో కనిపించిన పులి కళేబరం రెండేండ్ల పులి పిల్లదని, అది కొట్లాటలో చనిపోయిందని ఫారెస్ట్ ఆఫీసర్లు ప్రకటించారు. ఈ నెల 8న మొదటి పులి చనిపోయిన ప్రాంతానికి దగ్గర్లోనే మగపులి(ఎస్9) డెడ్‌బాడీ గుర్తించారు. పశువు కళేబరాన్ని మగ పులితోపాటు మరో రెండు పులి పిల్లలు తిన్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిందని, ఇందులో రెండు చనిపోగా, మరో పులి పిల్ల జాడ కోసం వెతుకుతున్నామని చెప్పిన ఫారెస్ట్ ఆఫీసర్లు ఇప్పుడు మాటమార్చారు. తాజాగా ఎస్9 పులి మాత్రమే విషాహారం తిని మరణించిందని చెప్తున్నారు. అంటే తల్లి పులి(ఎస్ 8)తో పాటు మరో మూడు పులిపిల్లలు బతికే ఉండాలి. ఇందులో గాయపడ్డ పులి పిల్ల కూడా ఉండాలి. గాయాలతో ఉన్న పులి ఎంతో దూరం ప్రయాణించే అవకాశం లేదు. కానీ 120 మంది సిబ్బందితో ఫారెస్ట్ ఆఫీసర్లు అడవిని జల్లెడ పట్టినప్పటికీ జాడను కనిపెట్టలేకపోయారు.