మరికొన్ని గంటల్లో భారత్‌కు అగ్రదేశాధినేతలు.. నిఘా నీడలో ఢిల్లీ

మరికొన్ని గంటల్లో భారత్‌కు అగ్రదేశాధినేతలు.. నిఘా నీడలో ఢిల్లీ

జీ20 సదస్సులో (G20 Summit) పాల్గొనేందుకు అగ్రదేశాధినేతలు మరికొన్ని గంటల్లోనే భారత్‌కు రానున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 8న) ఉదయం నుంచి ఒక్కొకరు భారత్ లో అడుగుపెట్టనున్నారు. అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, కెనడా వంటి అగ్ర దేశాధినేతలతో పాటు ఇతర ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీ20 కూటమిలోని 20 సభ్యదేశాలు, 11 ఆహ్వాన దేశాలు, ఐరాస, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు వంటి అనేక అంతర్జాతీయ సంస్థల అధినేతలు సదస్సుకు హాజరయ్యేందుకు శుక్రవారం భారత్‌లో దిగనున్నారు. వివిధ దేశాధినేతలు భారత్ కు రానున్న సందర్భంగా ఢిల్లీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు ఐదు వేల సీసీ కెమెరాలతో ఢిల్లీ నగరాన్ని పర్యవేక్షిస్తున్నారు. 

ముందుగా బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ భారత్‌ చేరుకోనున్నారు. భారత మూలాలున్న వ్యక్తి కావడంతో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం (సెప్టెంబర్ 7న) మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగనున్న సునాక్‌కు కేంద్ర సహాయమంత్రి అశ్విని కుమార్‌ చౌబే స్వాగతం పలకనున్నారు. అనంతరం ఆయన ఢిల్లీలోని షంగ్రి-లా హోటల్‌లో బస చేయనున్నారు. 

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఐటీసీ మౌర్యలో బస చేయనున్నారు. చైనా అధ్యక్షుడు ఈ సదస్సుకు డుమ్మా కొడుతున్నప్పటికీ.. ఆ దేశం తరఫున ప్రధానమంత్రి లీ చియాంగ్‌ బృందం పాల్గొననుంది. వీరు ఢిల్లీలోని తాజ్‌ హోటల్‌లో బసచేయనున్నారు. క్లారిడ్జెస్‌లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌, ఇంపీరియల్‌ హోటల్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ బస చేయనున్నారు. 

ఢిల్లీలో సెప్టెంబర్  9, 10 తేదీల్లో జీ-20 స‌ద‌స్సు జరగనుంది. 9వ తేదీన జీ20 సదస్సుకు హాజరయ్యే నేతలకు భారత ప్రభుత్వం విందు ఇవ్వనుంది. ఈ విందుకు భారత  బిలియనీర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ డిన్నర్ లో  ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొననున్నారు. 

500 మందికి ఆహ్వానం..

సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో ఢిల్లీలో జీ20 శికరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సదస్సులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలను చర్చించనున్నారు. అయితే తొలి రోజు ( సెప్టెంబర్ 9) చర్చల అనంతరం రాత్రి కేంద్ర ప్రభుత్వం  జీ 20  దేశాల అధినేతలతో పాటు..దేశంలోని ప్రముఖులకు విందు ఏర్పాటు చేసింది.  ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జీ20 సమ్మిట్‌ విందు ఇవ్వనుంది. ఈ విందుకు దేశంలోని 500 మంది వ్యాపారవేత్తలకు  కేంద్రం ఆహ్వానాలను పంపింది.  ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా, భారతీ ఎయిర్‌టెల్ వ్యవస్థాపకుడు -చైర్మన్ సునీల్ మిట్టల్  వంటి మొత్తం 500 మందికి ఆహ్వానాలు అందాయి. 

విందులో స్పెషల్ ఏంటీ..?

భారతదేశంలో వ్యాపార, పెట్టుబడి అవకాశాలను హైలైట్ చేయడానికి ప్రధాని మోదీకి ఈ  విందు మరో అవకాశాన్ని కల్పించనుంది. ఇక డిన్నర్ కు హాజరయ్యే అతిధుల కోసం మెనూలో భారతదేశం ప్రత్యేక వంటకాలు.. ఇతర మిల్లెట్‌ వంటకాలు ప్రత్యేకంగా ఉంచనున్నారు.

మరోవైపు జీ20 సమ్మిట్ లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటీష్ ప్రధాని రిషి సునక్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా పాల్గొననున్నారు.  అయితే ఈ  సమావేశానికి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రావడం లేదు. 

ఢిల్లీలోని భారత్‌ మహామండపం కన్వెన్షన్‌ సెంటర్‌లో  జీ20 సదస్సు జరగనుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలను పెంచడం, అంతర్జాతీయ రుణ నిర్వహణను సరళీకరించడం, క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ, భౌగోళిక రాజకీయ అనిశ్చితి ప్రభావం, గ్రీన్‌ డెవలప్‌మెంట్‌, వాతావరణ మార్పులు, వేగవంతమైన- సుస్థిరాభివృద్ధి, వ్యవసాయం- ఆహార వ్యవస్థ, సాంకేతిక మార్పులు, 21వ శతాబ్దపు బహుపాక్షిక సంస్థలు, మహిళా సాధికారతతో అభివృద్ధి వంటి అంశాలే ఎజెండాగా జీ20 సదస్సు సాగనుందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.