నిమజ్జనంపై ఈ ఒక్క సారికి చాన్సివ్వండి

నిమజ్జనంపై  ఈ ఒక్క సారికి చాన్సివ్వండి
  • నిమజ్జనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సర్కారు
  • ట్యాంక్​ బండ్​ మీదుగా పీఓపీ విగ్రహాలకు అనుమతివ్వాలని స్పెషల్​ లీవ్​ పిటిషన్
  • పర్మిషన్​ ఇస్తే విగ్రహాలు వేసిన 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తమన్న జీహెచ్​ఎంసీ
  •  వచ్చే ఏడాదికి పూర్తి స్థాయి చర్యలు చేపడతామని వెల్లడి


న్యూఢిల్లీ, వెలుగు: ట్యాంక్​బండ్​ మీది నుంచి హుస్సేన్​ సాగర్​లో పీఓపీ విగ్రహాల నిమజ్జనానికి ఈ ఒక్కసారి అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పర్మిషన్​ఇస్తే విగ్రహాలు వేసిన 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని, వచ్చే ఏడాదికి పూర్తి స్థాయి చర్యలు చేపడుతామని కోరింది. పీఓపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్, ఇతర చెరువుల్లో నిమజ్జనం చేయకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్ పీ) దాఖలు చేశారు. 


వినాయక చవితి ముందు రోజు హైకోర్టు తీర్పు వెల్లడించిందని, అప్పటికే హైదరాబాద్ లో 3 నుంచి 4 లక్షల విగ్రహాలను పెట్టేందుకు భక్తులు ఏర్పాట్లు చేసుకున్నారని, వాటిల్లో అన్ని సైజుల ప్రతిమలు ఉన్నాయని ప్రభుత్వం పిటిషన్​లో తెలిపింది. ట్యాంక్ బండ్ వైపు సాగర్ లోతుగా ఉంటుందని,  భారీ విగ్రహాలను క్రెయిన్ ద్వారా ఎత్తి నిమజ్జనం చేయడానికి వీలువుతుందని పేర్కొంది. అందువల్ల ట్యాంక్ బండ్ నుంచి నిమజ్జనం చేసేందుకు అనుమతించాలని కోరింది. సచివాలయం, సంజీవయ్య పార్కు మీదుగా పెద్ద సైజు విగ్రహాలను నిమజ్జనం చేయడం సాధ్యం కాదని, లోతు కూడా తక్కువగా ఉంటుందని తెలిపింది. ఇప్పటికిప్పుడు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్ లో లక్షల విగ్రహాలను నిమజ్జనం చేయాలంటే సాధ్యం కాదని వివరించింది. ఈ సంవత్సరానికి మినహాయింపు ఇవ్వాలని ఎస్​ఎల్​పీలో పేర్కొంది. సుప్రీం కోర్టు నిమజ్జనానికి అనుమతి ఇస్తే, 24 గంటల్లో విగ్రహాలు, ఇతర వ్యర్థాలను తొలగిస్తామని స్పష్టం చేసింది. కరోనా నిబంధనలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని తెలిపింది. హైకోర్టు తీర్పును ఉల్లఘించలేమని, అలా అని తీర్పును అమలు చేయడం కష్ట సాధ్యమని తెలిపింది. వినాయక నిమజ్జనం భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం అయినందున ఈ ఏడాదికి మినహాయింపు ఇవ్వాలని కోరింది. వచ్చే ఏడాదికి పూర్తి స్థాయి చర్యలు చేపడుతామని తెలిపింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం వేసిన ఎస్ఎల్​పీపై డైరీ నంబర్ రాగా, ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.