నిరుద్యోగులను వంచిస్తున్న రాష్ట్ర సర్కార్

నిరుద్యోగులను వంచిస్తున్న రాష్ట్ర సర్కార్
  • ఏండ్లుగా నోటిఫికేషన్లు ఇయ్యకుండా జాప్యం
  • ఇప్పుడు పరీక్ష పేపర్ల లీకేజీలు, రద్దులు, వాయిదాలు
  • పత్తాలేని నిరుద్యోగ భృతి.. అతీగతి లేని ఆర్నెల్ల స్టైపెండ్
  • జాబ్ క్యాలెండర్ ఊసే లేదు.. మెటీరియల్‌ ఇస్తం,
  • బువ్వ పెడ్తమంటూ కేటీఆర్ కొత్తరాగం

హైదరాబాద్, వెలుగు:నీళ్లు, నిధులు, నియామకాలే ఎజెండాగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు మొదట్నుంచి మోసమే జరుగుతున్నది. ఉద్యోగాల భర్తీపై నాటి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ చెప్పిన ఒక్క మాటా అమలైతలేదు. రాష్ట్రం వస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని ఆశించి లక్షల మంది యువత ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చాక అప్పులు చేసి కోచింగులు తీసుకుని, తినీ తినక ప్రిపేరవుతూ హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. ఉద్యోగాల కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2014లో అధికారం చేపట్టిన కేసీఆర్‌.. 2018 నాటికి కనీసం 40 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు. దీంతో తల్లిదండ్రులకు ఇంకా భారం కాలేక చాలా మంది ప్రిపరేషన్‌ బంద్ పెట్టి.. చిన్నా చితకా ప్రైవేటు ఉద్యోగాల్లో చేరారు. నిరుద్యోగుల అసంతృప్తిని పసిగట్టిన కేసీఆర్.. నిరుద్యోగులకు నెలకు రూ.3,016 చొప్పున భృతి ఇస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్నీ భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ తర్వాత కూడా నిరుద్యోగులను నిరాశకే గురిచేశారు. నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు 2019 నాటి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో కేటాయింపులు చేసినా.. ఇప్పటిదాకా ఏ ఒక్కరికీ సాయం చేయలేదు.

స్టైఫండ్ ఎక్కడ?

రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇయ్యకుండా ప్రభుత్వం తాత్సారం చేసింది. ఖాళీల లెక్కల పేరిట, జోన్ల మార్పు పేరిట నాలుగేండ్లు సాగదీస్తూ వచ్చింది. ఎన్నికల ఏడాది రాగానే ఒకేసారి నోటిఫికేషన్లు ఇచ్చుడు స్టార్ట్ చేసింది. దీంతో లక్షల మంది యువత ఉద్యోగాల ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. నిరుద్యోగ భృతికి ఎగనామం పెట్టిన సర్కార్‌‌.. ప్రిపరేషన్‌లో ఉన్న నిరుద్యోగులకు స్టైఫండ్ ఇస్తామని గతేడాది కొత్త ప్రకటన చేసింది. గ్రూప్‌ 1 అభ్యర్థులకు నెలకు రూ.5 వేల చొప్పున ఆర్నెల్ల పాటు, గ్రూప్‌ 2, ఎస్‌ఐ అభ్యర్థులకు నెలకు రూ.2 వేల చొప్పున మూడు నెలల పాటు ఇస్తామని హడావుడి చేసింది. ఈ స్కాలర్‌‌షిప్ కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 1.25 లక్షల మందిని ఎంపిక చేయడానికి ఎగ్జామ్ కూడా పెట్టారు. కానీ ఇప్పటిదాకా ఎవరికీ స్టైఫండ్ ఇయ్యనేలేదు.

సగం పోస్టులకే నోటిఫికేషన్లు

రాష్ట్రంలో 80,039 పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా గతేడాది మార్చి 9న ప్రకటించారు. ఇప్పటికీ వాటిలో సగం పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. వీటిలో 969 పోస్టుల భర్తీ మాత్రమే పూర్తయింది. 80 వేల పోస్టులను టీఎస్​పీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు, గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తామని అప్పట్లో అధికారులు తెలిపారు. దీంట్లో టీఎస్​పీఎస్సీ ద్వారా 2022లో వివిధ డిపార్ట్​మెంట్లలోని 17 వేల పోస్టుల భర్తీకి 26 నోటిఫికేషన్లు జారీచేశారు. వీటిలో ఏడు నోటిఫికేషన్లకు సంబంధించి ఎగ్జామ్స్ నిర్వహించారు. క్వశ్చన్ పేపర్ లీక్ నేపథ్యంలో వాటిలో 4 పరీక్షలు రద్దు చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ ఏడాది కిందట ప్రకటించారు. అయితే ఇప్పటికీ ఆ ఊసే ఎత్తడం లేదు. 

టీచర్ పోస్టుల కోసం ఎదురుచూపులు

ఉద్యోగాల భర్తీ అంటే ముందుగా గుర్తొచ్చేది టీచర్ల పోస్టులే. అంతటి ప్రాధాన్యత ఉన్న పోస్టుల భర్తీపై సర్కారు దృష్టి పెట్టడం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 2017లో 8,792 పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కేసీఆర్ చెప్పిన 80 వేల పోస్టుల్లో సెకండరీ ఎడ్యుకేషన్​లో 13 వేలకు పైగా పోస్టులున్నాయి. కానీ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మాత్రం 10 వేల వరకే పోస్టులు భర్తీ చేసే అవకాశముందని చెప్తున్నారు. సుమారు 5 లక్షల మంది టీచర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. 

మెటీరియల్ ఇస్తామంటున్న కేటీఆర్‌‌

ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, స్టైఫండ్‌ విషయంలో మాట తప్పిన సర్కార్‌.. ఇప్పుడు పేపర్‌‌ లీకేజీ ఘటనతో కొత్త రాగం అందుకుంది. ఈ తప్పు ఇద్దరు వ్యక్తులు చేసిందే తప్ప, ప్రభుత్వానికి సంబంధం లేదంటూ మంత్రి కేటీఆర్‌‌ చెబుతున్నారు. నిరుద్యోగులు నిరుత్సాహ పడొద్దని ఆన్‌లైన్‌లో స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచుతామని, రీడింగ్ రూమ్స్‌ 24 గంటలు ఓపెన్‌ ఉంచుతామని అంటున్నారు. భోజనం కూడా పెడుతామని హామీలు ఇస్తున్నారు. కనీసం ఈ మాటలనైనా నిలబెట్టుకుంటారో లేదోనని నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.