2030 నాటికి ఇండియా.. గ్రీన్ హైడ్రోజన్​కు హబ్ కావాలె

2030 నాటికి ఇండియా.. గ్రీన్ హైడ్రోజన్​కు హబ్ కావాలె
  •     రూ. 19,744 కోట్ల మిషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం 
  •     ఏటా 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి
  •     అదనంగా125 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీకి టార్గెట్   

న్యూఢిల్లీ:  దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని భారీగా పెంచేందుకు గాను నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే 2030 నాటికి ఏటా 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయడం, దీనికి అదనంగా ఏటా 125 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీని కూడా పెంచడమే లక్ష్యంగా ఈ మిషన్ ను కేంద్ర ప్రభుత్వం చేపట్టినట్లు కేంద్ర సమాచారా ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.  బుధవారం ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మీటింగ్ అనంతరం మీడియాకు కేంద్ర మంత్రి వివరించారు. 

ఈ మిషన్ కు మొదటి దశలో రూ. 19,744 కోట్లను కేంద్రం కేటాయించినట్లు తెలిపారు. ఇందులో ‘సైట్’ ప్రోగ్రాంకు రూ. 17,490 కోట్లు, పైలట్ ప్రాజెక్టులకు రూ. 1,466 కోట్లు, ఆర్ అండ్ డీకి రూ. 400 కోట్లు, మిషన్ కు సంబంధించిన ఇతర అంశాలకు రూ. 388 కోట్లు అలకేట్ చేసినట్లు అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ‘‘ఇంధన రంగంలో ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, ప్రధాన ఆర్థిక రంగాల్లో కార్బన్ ఉద్గారాలను నియంత్రించేందుకు ఈ మిషన్ తోడ్పడనుంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వాడకం, ఎక్స్ పోర్ట్స్ లో ఇండియాను గ్లోబల్ హబ్ గా మార్చడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం” అని ఆయన వెల్లడించారు

గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి? 

నీటిని ఎలక్ట్రోలైసిస్ ప్రక్రియ ద్వారా విడగొట్టి ఉత్పత్తి చేసే హైడ్రోజన్​నే గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ఈ ప్రాసెస్​లో హైడ్రోజన్, ఆక్సిజన్ మాత్రమే వస్తాయి. వీటిలో హైడ్రోజన్ ను ఇంధనంగా వాడుకుని, ఆక్సిజన్ ను వాతావరణంలోకి విడిచిపెట్టొచ్చు. ఇందులో ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ కోసం విండ్ లేదా సోలార్ పవర్ నే వాడతారు. ఈ పద్ధతిలో ఎక్కడా కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి కాదు కాబట్టి హైడ్రోజన్ ఉత్పత్తిలో అన్నింటికన్నా ఇదే బెస్ట్ ఎకో ఫ్రెండ్లీ విధానమని చెప్తున్నారు. ఇక హైడ్రోజన్ ప్రొడక్షన్​కు ఉపయోగించే ఇతర విధానాలను బట్టి బ్లూ, గ్రే, పింక్, యెల్లో హైడ్రోజన్ అని కూడా పిలుస్తుంటారు.   

 గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యాలు ఇవే..  

 దేశంలో 2030 నాటికి ఏటా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి చేరుకోవడం. అదనంగా ఏటా 125 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి కెపాసిటీని సాధించడం.     రూ. 8 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు తేవడం.     6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించడం.     ఏటా 50 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించడం. 

దూరదర్శన్ రేడియోకు 2,500 కోట్లు 

ప్రసార భారతి ఆధ్వర్యంలోని దూరదర్శన్ టీవీ చానెల్, ఆలిండియా రేడియో సంస్థల కు నెట్ వర్క్, ఇన్​ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం రూ. 2,539.61 కోట్లతో ‘బ్రాడ్ కాస్టింగ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్ వర్క్ డెవలప్​మెంట్ (బైండ్)’ పథకానికి కూడా ఓకే చెప్పినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్​లో సన్ని డ్యామ్​పై జల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు రూ.2,614.51 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు కూడా ప్రధాని అధ్యక్షతన సమావేశమైన ‘ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ’ ఆమోదం తెలిపిందన్నారు.

ఎయిర్​ పోర్టుకు పారికర్​ పేరు..

మోపా వద్ద ఉన్న ఎయిర్ పోర్టుకు ఆ రాష్ట్ర మాజీ సీఎం మనోహర్ పారికర్ పేరును పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. దానిని ‘మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్–మోపా’ అని పిలవాలని పేర్కొంది. దీనిని ప్రధాని గత డిసెంబర్ లోనే ప్రారంభించారు.  పారికర్ గౌరవార్థం ఇప్పుడు ఎయిర్ పోర్టుకు ఆయన పేరును పెట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.