
- నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్, ఇద్దరు సూపరింటెండెంట్లకు మెమోలు
- రెండు కమిటీల నివేదికల ఆధారంగా ఉత్తర్వులు ఇచ్చిన ఆలయ ఈవో
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో 'చింతపండు' చోరీ ఘటనలో ఆలయ ఉద్యోగులపై దేవస్థానం కొరడా ఝుళిపించింది. ఘటనపై విచారించిన 'ఫైవ్ మెన్', 'హైలెవల్' కమిటీల నివేదికల ఆధారంగా ఈవో వెంకటరావు చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా చింతపండు ఘటనకు కారణమైన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయడమే కాకుండా మరో ఇద్దరు సూపరింటెండెంట్లకు చార్జిమెమోలు జారీ చేశారు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా చింతపండు చోరీ ఘటనకు కారకులైన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటూ ఆలయ ఈవో వెంకటరావు సోమవారం ఆర్డర్స్ జారీ చేశారు. ప్రసాద తయారీ కేంద్రం ఇన్ చార్జ్ సీనియర్ అసిస్టెంట్ పి.నవీన్, ముగ్గురు అసిసెంట్లు టి.వాసు, ఎస్ బీ సంతోష్, ఎస్. కృష్ణమాచార్యులుపై సస్పెన్షన్ వేటు పడింది. అదేవిధంగా రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలించకుండా నిర్లక్ష్యం వహించి చోరీ ఘటన జరగడానికి పరోక్షంగా సహకరించిన ఆలయ సూపరింటెండెంట్లు ఎ. సత్యనారాయణ శర్మ, వాసం వెంకటేశ్‌కు చార్జిమెమోలు జారీ చేశారు.
గత మే 28న గుట్టపైన ప్రసాద కౌంటర్ లో చింతపండు చోరీకి పాల్పడుతూ ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పట్టుబడ్డారు. అసలు దోషులను పట్టుకునేందుకు ఆలయ ఈవో వెంకటరావు 'ఫైవ్ మెన్' కమిటీ వేయగా.. రిపోర్టు ఇచ్చింది. అందులో ఏమీ తేలకపోవడంతో.. గత జూన్12న నలుగురు ఎండోమెంట్అసిస్టెంట్ కమిషనర్లు, ఒక రీజినల్ జాయింట్ కమిషనర్ తో పాటు ఈవో వెంకటరావు 'హైలెవల్' కమిటీని నియమించి ఎంక్వైరీ చేశారు. హైలెవల్ కమిటీ రిపోర్టు ఆధారంగా ఉద్యోగులపై చర్యలు చేపట్టారు.
కాగా.. ప్రసాద తయారీ కేంద్రం చూసే ఉన్నతాధికారుల అండదండలు లేకుండా కిందిస్థాయి ఉద్యోగులు చింతపండు చోరీకి పాల్పడే సాహసం చేయబోరని, వారిని కాపాడడం కోసమే కిందిస్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. రెండు కమిటీల నివేదికలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.