
-
విభజన సమస్యల పరిష్కారంపై చర్చలు
-
ఏపీ ప్రభుత్వానికి సమాచారం
-
తెలంగాణకు నో ఇన్ఫర్మేషన్
-
ఈ-సమీక్ష పోర్టల్‌లో ఎప్పటికప్పుడు వివరాలు పెట్టకపోవడమే కారణం?
హైదరాబాద్, వెలుగు: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలపై ఈ నెల 23న కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కేంద్ర హోంశాఖ నుంచి ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందింది. అయితే తెలంగాణకు మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని తెలిసింది. కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న ఈసమీక్ష వెబ్ పోర్టల్‌లో అప్‌డేట్ చేసిన అంశాల ఆధారంగా ఈ సమావేశాన్ని హోంశాఖ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ పోర్టల్‌లో తెలంగాణ ఎలాంటి అంశాలను అప్‌డేట్ చేయక పోవడంతోనే రాష్ట్రానికి సమాచారం ఇవ్వలేదనే చర్చ సచివాలయ వర్గాల్లో జరుగుతోంది.
దీంతో తెలంగాణ అధికారులు విభజన భేటీకి హాజరయ్యేది సందేహంగా మారింది. పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాలతో సెప్టెంబరు చివర్లో కేంద్ర హోం శాఖ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేకంగా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్, అమరావతి రాజధాని నిర్మాణానికి అదనంగా నిధుల, ఏడు వెనకబడిన జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున కేంద్ర గ్రాంట్ల రూపంలో ఆర్థిక సాయం, రెవెన్యూ లోటు భర్తీకి ఇచ్చే సాయం, అమరావతి నగరానికి అనుసంధానం చేసే రైల్వే ప్రాజెక్టులు తదితర అంశాలు ఎజెండాలో ఉన్నట్లుగా తెలిసింది.