ఉక్రెయిన్​ ప్రాంతాలు రష్యాలో విలీనం

ఉక్రెయిన్​ ప్రాంతాలు రష్యాలో విలీనం

ఆ దిశగానే పుతిన్​ అడుగులు.. 
రిఫరెండం పెట్టి స్వతంత్ర రిపబ్లిక్​లుగా ప్రకటన
గుర్తించబోమన్న అమెరికా

జపోరిజియా: ఉక్రెయిన్​లోని తూర్పు ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను రష్యాలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అమెరికా అనుమానిస్తోంది. ఈ దిశగా రష్యా ప్రెసిడెంట్​ వ్లాదిమిర్​ పుతిన్​ అడుగులు వేస్తున్నారని ఆరోపిస్తోంది. అలాగే మరియుపోల్​లోని స్టీల్​ప్లాంట్​ నుంచి సామాన్య పౌరుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైన ఒకరోజు తర్వాత ప్లాంట్​పై కొత్తగా దాడులను మొదలుపెట్టింది రష్యా. మరియుపోల్​సిటీలో ఇంకా ఉక్రెయిన్​ బలగాల ఆధిపత్యం ఉన్నది మాత్రం స్టీల్​ప్లాంట్​ పరిసరాల్లోనే. అందువల్లే ప్లాంట్​ను ఎలాగైనా చేజిక్కించుకోవాలని 
ప్రయత్నాలు చేస్తోంది.

మేం గుర్తించబోం : అమెరికా
ఉక్రెయిన్​ తూర్పు ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న ఖేర్సన్​ సిటీని స్వతంత్ర రిపబ్లిక్​గా గుర్తించేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తోందని యూరోప్​లో సెక్యూరిటీ, కోఆపరేషన్ ఆర్గనైజేషన్​లో అమెరికా రాయబారి మైఖెల్​ కార్పెంటర్​ చెప్పారు. ఇలాంటి చర్యలను అమెరికా కానీ, దాని మిత్రపక్షాలు గానీ గుర్తించేది లేదని స్పష్టం చేశారు. తాను స్వాధీనం చేసుకున్న డొనెట్స్క్​, లుహాన్స్క్ ల్లో రెఫరెండం నిర్వహించి.. ప్రజాస్వామ్య పద్ధతిలో వాటిని గుర్తించినట్టుగా ప్రకటించి.. ఆ తర్వాత తమ దేశంలో విలీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఖేర్సన్​లో కూడా ఇలాంటిదే స్వతంత్ర ఓటింగ్​ నిర్వహించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ ప్రాంతాల్లోని మేయర్లు, స్థానిక ప్రజాప్రతినిధులను కిడ్నాప్​ చేస్తున్నారని, ఇంటర్నెట్, సెల్​ఫోన్​ సర్వీసులను కంట్రోల్​ చేస్తున్నారని చెప్పారు. అలాగే త్వరలోనే ఇక్కడ రష్యన్​ స్కూల్​ కరిక్యులమ్​ను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు.

పుతిన్​కు సర్జరీ?

రష్యా ప్రెసిడెంట్​ పుతిన్​ కేన్సర్​కు సర్జరీ చేయించుకోనున్నారని, తాత్కాలికంగా అధికార బాధ్యతలను సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ నికోలాయ్ పత్రుషెవ్​కు అప్పగిస్తారని న్యూయార్క్ పోస్ట్ ప్రత్యేక కథనం ప్రచురించింది. కొద్ది వారాలుగా పుతిన్ ఆరోగ్య పరిస్థితిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కిందటి నెలలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో మీటింగ్​ సందర్భంగా పుతిన్​ పూర్తిగా డెస్క్​కే పరిమితం కావడం వీటికి బలం చేకూర్చింది. కేన్సర్​తో బాధపడుతున్న పుతిన్​ తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారని న్యూయార్క్​ పోస్ట్​ పేర్కొంది. ఈ విషయాన్ని రష్యన్​ ఫారిన్​ ఇంటెలిజెన్స్​ సర్వీసెస్​ మాజీ లెఫ్టినెంట్​ జనరల్​ నడుపుతున్న టెలిగ్రామ్​ చానల్​లో వెల్లడించారని తెలిపింది. అయితే ఈ సర్జరీ ఎందుకు చేస్తున్నారు, రికవరీ కావడానికి ఎంత టైం పడుతుంది అనే వివరాలు వెల్లడించలేదు. కొద్దికాలం పుతిన్​ పదవికి దూరంగా ఉంటారని పేర్కొంది. అయితే, ఈ కథనాలను పూర్తిగా నమ్మలేమని పెంటగాన్​ వర్గాలు చెప్పాయి.