బండ్లకు డిమాండ్​ తగ్గితే గండమే

బండ్లకు డిమాండ్​ తగ్గితే గండమే

న్యూఢిల్లీ: డిమాండ్‌‌ పుంజుకోకపోతే వెహికల్‌‌ విడిభాగాల ఇండస్ట్రీ మరింత ప్రమాదంలో పడుతుందని తాజాగా వెల్లడయింది. గిరాకీ పెరగకపోతే చాలా మంది జాబ్స్‌‌ కోల్పోతారని ఆటోమోటివ్‌‌ కాంపోనెంట్‌‌ మాన్యుఫ్యాక్చరర్స్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఏసీఎంఏ) హెచ్చరించింది. ఆటో కాంపోనెంట్‌‌ మార్కెట్‌‌లో ఇన్వెంటరీ పేరుకుపోగా, డిమాండ్‌‌ మాత్రం ఇంకా పుంజుకోలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కంపెనీలు ఉద్యోగులను విపరీతంగా తొలగిస్తాయని అసోసియేషన్‌‌ ఆందోళన ప్రకటించింది. ‘‘గిరాకీ పెరిగే వరకు కంపెనీలకు డబ్బు సమస్యలు ఉంటాయి. ఉద్యోగులను తీసేయడమూ తప్పదు. పరిస్థితి మామూలు స్థితికి వస్తేనే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి’’ అని ఏసీఎంఏ ప్రెసిడెంట్‌‌ దీపక్‌‌ జైన్‌‌ అన్నారు. కంపెనీలు పూర్తిస్థాయిలో పనిచేసినా, ఉద్యోగులందరూ అవసరం లేదని, డిమాండ్ తక్కువ ఉండటమే ఇందుకు కారణమని వివరించారు. లాక్‌‌డౌన్‌‌ వల్ల గిరాకీ 40 శాతం వరకు తగ్గుతుందని ఆటో ఇండస్ట్రీ బాడీ సియామ్‌‌ ఇది వరకే చెప్పిన విషయాన్ని దీపక్ గుర్తుచేశారు. దీనినిబట్టి చూస్తే జాబ్‌‌కట్స్‌‌ తప్పకపోవచ్చని అభిప్రాయపడ్డారు.ఆటో కాంపోనెంట్‌‌ ఇండస్ట్రీలో దాదాపు 50 లక్షల మంది పనిచేస్తున్నారని అంచనా. గత ఏడాది దీని మార్కెట్‌‌ 18 శాతం తగ్గింది. మనదేశంలో టూరిజం, ఏవియేషన్‌‌ వంటి ఐదు సెక్టార్ల తరువాత అత్యంత ఒత్తిడిలో ఉన్న వాటిలో ఆటో కాంపోనెంట్‌‌ సెక్టార్‌‌ ఒకటని దీపక్‌‌ వివరించారు. డిమాండ్‌‌ పెరగాలంటే ఆటోలోన్స్‌‌ పెరగాలని, సర్వీసు స్టేషన్లను ఎంఎస్‌‌ఎంఈలుగా పరిగణించాలని అన్నారు.