మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి సివిల్ హాస్పిటల్ లో నవజాత శిశువు మృతి

మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి సివిల్ హాస్పిటల్ లో నవజాత శిశువు మృతి
  • మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి సివిల్ హాస్పిటల్ లో నవజాత శిశువు మృతి
  • డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యుల ఆందోళన

మెట్ పల్లి, వెలుగు : డెలివరీ కోసం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్తే నార్మల్ డెలివరీ పేరిట డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతో నవజాత శిశువు చనిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం దొంచంద గ్రామానికి చెందిన సౌతీ హారతి (22) కి నెలలు నిండడంతో కాన్పు కోసం శనివారం ఉదయం జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు సాయంత్రం వరకు నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పారు. మధ్యాహ్నం హారతికి నొప్పులు ఎక్కువ కావడంతో సిబ్బంది నార్మల్ డెలివరీకి ప్రయత్నించారు. పరిస్థితి విషమించడంతో సిజేరియన్​ చేశారు. మగశిశువు జన్మించగా.. శిశువుకు సీరియస్ గా ఉందని వెంటనే జగిత్యాలకు పంపించారు.

జగిత్యాల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శిశువును పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయిందని చెప్పారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయిందని, వారి తప్పును కప్పిపుచ్చుకునేందుకు సీరియస్ గా ఉందని జగిత్యాలకు పంపించారని కుటుంబ సభ్యులు మెట్ పల్లి ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. ఎస్సై చిరంజీవి అక్కడికి చేరుకొని  బాధితులను సముదాయించారు. ఆందోళన విరమించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్  సాజిద్ అహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వివరణ కోరగా పేషెంట్ డెలివరీ కోసం శనివారం ఉదయం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాగా స్కానింగ్  చేసి అడ్మిట్ చేశామన్నారు. మధ్యాహ్నం నొప్పులు ఎక్కువ కావడంతో సిజేరియన్​ చేసి బిడ్డను బయటకు తీశామన్నారు. శిశువు పరిస్థితి విషమించడంతో జగిత్యాల తరలించామని చెప్పారు. దురదృష్టవశాత్తు శిశువు చనిపోయాడని, దీనిలో డాక్టర్ల నిర్లక్ష్యమేమీ లేదన్నారు.