తెలంగాణలో  బీజేపీ జెండా ఎగరాలె

తెలంగాణలో  బీజేపీ జెండా ఎగరాలె

రాష్ట్ర నేతలతో భేటీలో అమిత్ షా దిశానిర్దేశం
హుజూరాబాద్ ప్రచారానికి వస్తానని భరోసా
ఉప ఎన్నికల్లో పార్టీ పరిస్థితి, సంజయ్ పాదయాత్రపై 
షా కు వివరించిన నేతలు భేటీలో పాల్గొన్న కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్,
సంజయ్, ఈటల, వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి వస్తానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలకు భరోసా ఇచ్చారు. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపును బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఇక నుంచి తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీ జెండా ఎగరాల్సిందేనని రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. బుధవారం ఢిల్లీలో అమిత్  షాతో  తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జీ తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు, పార్టీ కోర్ కమిటీ మెంబర్లు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. సుమారు 15 నిమిషాల పాటు అమిత్ షాతో సమావేశమైన నేతలు తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ అవినీతి, ప్రజా వ్యతిరేక పాలనను వివరించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల గెలుపు అవకాశాలను షా అడిగి తెలుసుకున్నారు. ఏ సర్వే చేసినా ఈటల గెలుస్తున్నట్లు స్పష్టమవుతుందని రాష్ట్ర నేతలు వివరించారు. వచ్చే నెల 9వ తేదీ నుంచి కేసీఆర్ అవినీతి, గడీల, నియంత పాలనకు వ్యతిరేకంగా చేపట్టనున్న పాదయాత్ర గురించి సంజయ్.. షా దృష్టికి తీసుకువచ్చారు. దీన్ని ప్రారంభించేందుకు హైదరాబాద్​కు రావాలని అమిత్ షాను కోరారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భూపేంద్ర యాదవ్​ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత నేతలు మీడియాతో మాట్లాడుతూ అమిత్ షాతో భేటీ చాలా సంతృప్తికరంగా సాగిందని చెప్పారు.
భయపడుతున్న టీఆర్ఎస్: బండి సంజయ్
హుజూరాబాద్ ఉప ఎన్నిక అంటేనే టీఆర్ఎస్ భయపడిపోతుందని బండి సంజయ్ అన్నారు. అక్కడ వారికి కనీసం అభ్యర్థి దొరికే పరిస్థితి లేదన్నారు. గెలుపు కోసం టీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తోందని, సొంత పార్టీ ప్రజాప్రతినిధులనే కొనే దుస్థితిలో టీఆర్ఎస్ ఉందని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పారు. అక్కడ వార్ వన్ సైడేనని అమిత్ షాకు వివరించామన్నారు. టీఆర్ఎస్ వాళ్లు ఎన్ని డబ్బులు పంచినా అది ప్రజల సొమ్మే అని, ఆ డబ్బులు తీసుకోవాలని అక్కడి ప్రజలను సంజయ్ కోరారు. ఓటు మాత్రం బీజేపీకి వేసి ఈటల రాజేందర్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అవినీతి, అక్రమ, నియంత, గడీల పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనను ప్రజలకు వివరించేందుకే పాదయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. తాను చేపట్టే పాదయాత్రతో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పాలన నుంచి విముక్తి కలుగనుందన్నారు. పదవుల కోసం పార్టీ మారే వారిని పట్టించుకోమన్నారు. 
టీఆర్ఎస్ ఎంత ఖర్చుపెట్టినా 
గెలుపు బీజేపీదే: ఈటల
హుజూరాబాద్ కు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే అక్కడకు ఒకసారి ప్రచారానికి రావాలని అమిత్ షాను కోరినట్లు ఈటల రాజేందర్ చెప్పారు. అమిత్ షా ముఖ్య అతిథిగా అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. రాష్ట్రానికి ఎన్నిసార్లు అయినా సరే వస్తానని అమిత్ షా చెప్పినట్లు ఈటల వివరించారు. హజూరాబాద్ లోనే కాదు.. తెలంగాణలో ఏ ఎన్నిక ఎప్పుడు జరిగినా గెలుపు బీజేపీదేనని రాజేందర్ స్పష్టం చేశారు. తనకు సంపూర్ణ మద్దతు అందించే బాధ్యత మాది అని అమిత్ షా చెప్పినట్లు ఈటల తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన తీరును షాకు వివరించామన్నారు. 
కేసీఆర్ దోపిడీ అమిత్ షా కు వివరించా: వివేక్ వెంకటస్వామి
ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ విచ్చలవిడిగా దోచుకుంటున్నారని అమిత్ షాకు వివరించినట్లు వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఆ సొమ్ము హుజూరాబాద్ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నాడని ఆరోపించారు. అయినా  హుజూరాబాద్ లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని అమిత్ షాకు చెప్పామన్నారు. ఈ ఎన్నికల్లో అండగా ఉంటామని అమిత్ షా, భూపేంద్ర యాదవ్ తమకు భరోసా ఇచ్చారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భూపేంద్ర యాదవ్ ఆధ్వర్యంలోనే బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను అమిత్ షా, భూపేంద్ర యాదవ్ కు వివరించినట్లు చెప్పారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్న లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను సందర్శించినట్లు వివేక్ చెప్పారు. తనను ఆహ్వానించిన ఉత్సవ కమిటీకి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఆయన నాన్న వెంకటస్వామి కూడా లాల్ దర్వాజ ప్రాంతానికి చెందిన వ్యక్తేనని గుర్తు చేశారు. ఢిల్లీలోని తెలంగాణ ప్రజలకు ఉత్సవాలను అందుబాటులో ఉంచడం సంతోషకరమన్నారు.