మంత్రి మల్లారెడ్డిని అడ్డుకున్న కేశవరం గ్రామస్థులు

మంత్రి మల్లారెడ్డిని అడ్డుకున్న కేశవరం గ్రామస్థులు

మేడ్చల్ జిల్లా: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి మరోసారి నిరసనల సెగ తాకింది. ముడుచింతలపల్లి మండలంలోని సీఎం దత్తత గ్రామం కేశవరంలో మంత్రి మల్లారెడ్డి ఆదివారం పర్యటించారు.  బోనాల పండుగలో పాల్గొనేందుకు గ్రామానికి వచ్చిన మంత్రిని టీఆర్ఎస్ కు చెందిన వార్డ్ మెంబర్లు అడ్డుకున్నారు. తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్థులు, వార్డు సభ్యులు ఎంత వ్యతిరేకించినా గ్రామంలో సెల్ టవర్ నిర్మాణానికి సర్పంచ్, అధికారులు అనుమతి ఇచ్చారని మంత్రికి తెలియజేశారు.

వార్డు మెంబర్ల నిర్ణయాలకు ఏమాత్రం విలువ లేదా ? అంటూ మంత్రిని ప్రశ్నించారు. తమ సమస్యల గురించి మంత్రి స్పందించాలని గ్రామస్థులు కోరగా... ‘‘రేపు మాట్లాడుకుందాం’’ అంటూ మంత్రి మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రి సమాధానం ఇచ్చిన తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు చెప్పడానికి ప్రయత్నిస్తే... కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోవడమేంటని వారంతా ప్రశ్నిస్తున్నారు. సమస్యలను పరిష్కరించకపోతే సీఎం కేసీఆర్ ను కూడా అడ్డుకుంటామని గ్రామస్థులు హెచ్చరించారు.