రష్యా యుద్ధనౌకను పేల్చేసిన ఉక్రెయిన్

రష్యా యుద్ధనౌకను పేల్చేసిన ఉక్రెయిన్
  • రష్యా యుద్ధనౌక ఇంకోటి మునిగింది
  • నల్లసముద్రంలో పేల్చేసిన ఉక్రెయిన్ 

కీవ్/మాస్కో :  ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే నల్లసముద్రంలో రష్యాకు అతి కీలకమైన మాస్క్వా యుద్ధనౌకను ముంచేసిన ఉక్రెయిన్.. తాజాగా అడ్మిరల్ మకరోవ్ యుద్ధనౌకను కూడా పేల్చేసినట్లు అంతర్జాతీయ నిఘా సంస్థలు వెల్లడించాయి. దక్షిణ ఉక్రెయిన్​లోని ఒడెస్సాకు సమీపంలో అడ్మిరల్ మకరోవ్​ను ఉక్రెయిన్ నెప్ట్యూన్ మిసైల్స్​తో ధ్వంసంచేసిందని, ఆ నౌకను, అందులోని సిబ్బందిని కాపాడుకునేందుకు రష్యా అక్కడికి రెస్క్యూ షిప్ లు, హెలికాప్టర్లను పంపిందని అమెరికా నిఘా డ్రోన్​ల సమాచారంతో వెల్లడైంది. రష్యన్ యుద్ధనౌక మకరోవ్ ధ్వంసం అయిందన్న వార్తలు నిజమేనని చెప్పేందుకు అనేక ఆధారాలు కన్పిస్తున్నాయని ‘ఓసింట్ డిఫెండర్’ అనే ఓపెన్ సోర్స్ నిఘా సంస్థ వెల్లడించింది. అక్కడ జరుగుతున్న రెస్క్యూ చర్యలను అమెరికా నిఘా డ్రోన్​లు గుర్తించాయని తెలిపింది. ఒడెస్సాకు సమీపంలోని నల్లసముద్రంలో ఆ నౌక మంటల్లో తగలబడుతోందని యూఓఐ అనే వార్ అనలిస్ట్ కూడా పేర్కొన్నారు. మకరోవ్ షిప్​ను రష్యా 2017 నుంచి ఉపయోగిస్తోంది. ఈ షిప్ లో 200 మంది సిబ్బంది ఉంటారు. అయితే, మకరోవ్ యుద్ధనౌక ధ్వంసంపై అటు రష్యా గానీ, ఇటు ఉక్రెయిన్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

రష్యాకు రూ. వేల కోట్ల నష్టం.. 
రష్యా నేవీకి అతికీలకమైన మాస్క్వా యుద్ధనౌకను ఉక్రెయిన్ పోయిన నెలలో ముంచేసింది. ఆ ఒక్క ఘటనతోనే రష్యాకు రూ.5 వేల కోట్ల నష్టం జరిగిందని అంచనా. మకరోవ్ కూడా మునిగిపోవడం కన్ఫమ్ అయితే.. రష్యాకు మరో రూ. 2 వేల కోట్ల నష్టం జరిగినట్లేనని నిపుణులు చెప్పారు. అయితే, తీరానికి వంద మైళ్ల దూరంలోనే ఈ షిప్​లను రష్యా మోహరించినా.. ఇలా దాడికి గురికావడం వెనక అమెరికా హస్తం ఉన్నట్లు చెప్తున్నారు.

అణుబాంబులు వేయం : రష్యా 
ఉక్రెయిన్​లో అణుబాంబులను ఉపయోగించబోమని శుక్రవారం రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అలెక్సీ జైత్సేవ్ ప్రకటించారు. ఉక్రెయిన్​లో జరుగుతున్నది ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ మాత్రమేనని దీనికి అణ్వాయుధాల ప్రయోగం వర్తించబోదని తెలిపారు. మరోవైపు, మరియుపోల్​లోని స్టీల్ ప్లాంటుపై రెండో రోజూ రష్యా దాడులు కొనసాగించింది. బాధితుల తరలింపును అడ్డుకునేలా రష్యా ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తోందని జెలెన్ స్కీ ఆరోపించారు.