వాచ్​మన్​ను బాత్​రూమ్​లో బంధించి రూ.3 లక్షలతో పరార్​

వాచ్​మన్​ను బాత్​రూమ్​లో  బంధించి రూ.3 లక్షలతో పరార్​
  •  ఆదిలాబాద్ ​జిల్లాలోని ఓ కార్​ షోరూంలో ఘటన

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు : ఆదిలాబాద్​ జిల్లాలోని ఓ ఓ కారు షోరూంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాచ్​మన్​కు గన్​చూపించి లాకర్​ ఎత్తుకుపోయారు. మావల మండల కేంద్రంలోని జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఆదర్శ మోటర్​మారుతి సుజుకీ కార్​ షోరూమ్​లో ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి వేళ ముసుగులు ధరించిన నలుగురు దుండగులు డమ్మీ తుపాకీ, రాడ్డుతో షోరూమ్​ నైట్​డ్యూటీ వాచ్​మెన్​ భూమన్నను బెదిరించి వర్క్​షాప్​ బాత్​రూమ్​లో బంధించారు. తర్వాత షోరూమ్​లోని లాకర్​ఎత్తుకెళ్లారు. అందులో రూ.3 లక్షల వరకు నగదు ఉందని సిబ్బంది తెలిపారు. సంఘటన స్థలానికి డీఎస్పీ ఉమేందర్, సీఐ రఘుపతి, ఎస్సై విష్ణువర్ధన్​వచ్చి విచారణ చేపట్టారు.

తెలిసిన వాళ్ల పనేనా? 

కారు షోరూమ్​లో రోజూ వచ్చే బుకింగ్స్​కు సంబంధించి డబ్బులను లాకర్​లో పెట్టేవారు కాదు. మంగళవారం ఆర్డర్లు ఎక్కువగా రావడంతో డబ్బులను బయటకు తీసుకువెళ్లడం సేఫ్​కాదని లాకర్​లో ఉంచారు.  రాత్రి 8:30 నుంచి 9 గంటల మధ్య షోరూమ్​బంద్​చేసి వెళ్లిపోయినట్టు సమాచారం. ఈ విషయం షోరూమ్​లో పని చేసే సిబ్బందికి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే షోరూమ్​కు వచ్చిన బయటి వ్యక్తులు ఎవరైనా డబ్బులు పెడుతున్నప్పుడు చూసి ఉండవచ్చనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి 12:50 మధ్య చోరీ జరిగినట్టు పోలీసులు గుర్తించారు.  సీసీ పుటేజీలో నలుగురు వ్యక్తులు కనిపించారని, దాని ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.