- నేటి నుంచే ‘నో హెల్మెట్ - నో పెట్రోల్’
- నల్గొండ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు
నల్గొండ, వెలుగు: నేటి నుంచి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ‘నో హెల్మెట్ - నో పెట్రోల్’ నిబంధనను అమలు చేయనున్నారు. జాతీయ రోడ్డు భద్రతతా మాసోత్సవాల్లో భాగంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లా పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చిన వారికి పెట్రోల్ సరఫరా చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంక్ నిర్వాహకులు, సిబ్బందికి ఈ నిబంధన అమలుపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు. బైక్ నడిపే వారికి హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బైక్ యాక్సిడెంట్లు ఎక్కువ
రోడ్డు ప్రమాదాల్లో బైక్ యాక్సిడెంట్లతోనే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నట్లు అధికారులు గుర్తించారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 3,62,602 టూవీలర్స్ ఉన్నాయి.హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్రగాయాలై ప్రాణాలు పోతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. నల్గొండ జిల్లాలో 2023 లో 211 బైక్ యాక్సిడెంట్లు కాగా 114 మంది మరణించారు.
146 మంది గాయపడ్డారు. 2024 సంవత్సరంలో 248 బైక్ యాక్సిడెంట్లు కాగా 107 మంది మరణించగా190 మంది గాయపడ్డారు. 2025 సంవత్సరంలో 261 బైక్ యాక్సిడెంట్లలో 120 మంది మరణించారు. 186 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలను కాపాడడం ప్రధాన లక్ష్యంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ‘నో హెల్మెట్ - నో పెట్రోల్ ’ నిర్ణయాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
