ఆఫ్రికా దేశం గాంబియాలో దగ్గు, సర్ది సిరప్‌‌‌‌ల కలకలం

ఆఫ్రికా దేశం గాంబియాలో దగ్గు, సర్ది సిరప్‌‌‌‌ల కలకలం

ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది పిల్లలు చనిపోవడానికి ఇండియాలోని ఓ ఫార్మా కంపెనీకి చెందిన 4 సిరప్‌లే కారణం కావచ్చని డబ్ల్యూహెచ్​వో చేసిన ప్రకటన సంచలనమైంది.

యునైటెడ్ నేషన్స్/బంజుల్/న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశం గాంబియాలో దగ్గు, సర్ది సిరప్‌‌‌‌ల కలకలం రేగింది. 66 మంది చిన్న పిల్లలు చనిపోవడానికి ఇండియాలోని ఓ ఫార్మా కంపెనీకి చెందిన నాలుగు సిరప్‌‌‌‌లే కారణం కావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటన సంచలనమైంది. కలుషిత సిరప్‌‌‌‌ల వల్ల పిల్లల్లో కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని డబ్ల్యూహెచ్‌‌‌‌వో చెప్పింది. ఆయా మందులపై ఇతర దేశాలకూ అలర్ట్ జారీ చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టింది. తయారీ కంపెనీ నుంచి నాలుగు మందుల శాంపిల్స్‌‌‌‌ సేకరించి టెస్టులకు పంపింది.

దర్యాప్తు ప్రారంభం

డబ్ల్యూహెచ్‌‌‌‌వో అలర్ట్ నేపథ్యంలో మైడెన్ ఫార్మాస్యుటికల్ లిమిటెడ్ సంస్థపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) దర్యాప్తు ప్రారంభించింది. తమకు డబ్ల్యూహెచ్‌‌‌‌వో నుంచి సమాచారం అందిన వెంటనే రాష్ట్ర రెగ్యులేటరీ అథారిటీకి తెలియజేశామని సీడీఎస్‌‌‌‌సీవో  చెప్పింది. హర్యానాలోని రెగ్యులేటరీ అధికారులతో ఈ విషయంపై అత్యవసర విచారణను చేపట్టినట్లు తెలుస్తున్నది. అయితే పిల్లల మరణాలకు సంబంధించిన కచ్చితమైన కారణాలను యునైటెడ్ నేషన్స్ హెల్త్ ఏజెన్సీ వెల్లడించలేదని తెలుస్తున్నది. మరోవైపు 66 మంది పిల్లలు ఎప్పుడు చనిపోయారనే దానిపైనా క్లారిటీ ఇవ్వలేదు. గాంబియాకు సాంకేతిక సాయం చేస్తున్నామని, సలహాలను అందిస్తున్నామని డీసీజీఐకి సెప్టెంబర్ 29న డబ్ల్యూహెచ్‌‌‌‌వో తెలిపినట్లు సమాచారం. ఆ 4 మందులను మైడెన్ సంస్థ గాంబియాకు మాత్రమే సరఫరా చేసినట్లు తెలుస్తున్నది.

హర్యానా నుంచి కోల్‌‌‌‌కతాకు శాంపిల్స్‌‌‌‌

మైడెన్ సంస్థ తయారు చేసిన 4 సిరప్‌‌‌‌ల శాంపిల్స్‌‌‌‌ను కోల్‌‌‌‌కతాలోని సెంట్రల్‌‌‌‌ డ్రగ్స్ లాబోరేటరీ (సీడీఎల్)కి పంపినట్లు హర్యానా ఆరోగ్య మంత్రి అనీల్ విజ్ చెప్పారు. మైడెన్ సంస్థ తయారు చేసిన దగ్గు సిరప్‌‌‌‌లను ఎగుమతి చేసేందుకు అనుమతులు ఉన్నాయని వివరించారు. మన దేశంలో అమ్మడానికి లేదా మార్కెటింగ్‌‌‌‌ చేసేందుకు ఇవి అందుబాటులో లేవని పేర్కొన్నారు. సీడీఎల్ రిపోర్టు వచ్చాక వాస్తవాలు తెలుస్తాయన్నారు.

గాంబియాలో ఇంటింటికీ వెళ్లి..

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్​ హెచ్చరికల నేపథ్యంలో నాలుగు సిరప్‌‌‌‌లను గాంబియా రీకాల్ చేసింది. ఇందుకోసం అత్యవసరంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. సిరప్‌‌‌‌లను సేకరించేందుకు హెల్త్ మినిస్ట్రీ, రెడ్ క్రాస్ సొసైటీ కలిసి వందలాది మంది వలంటీర్లను రంగంలోకి దించాయి. ప్రతి ఇంటికీ వెళ్లి సిరప్‌‌‌‌లను సేకరించే పనిలో వారున్నారు.

సరఫరాను ఆపండి.. వాటిని ఉపయోగించొద్దు

దగ్గు, జలుబుకు సంబంధించిన 4  సిరప్‌‌‌‌లను హర్యానాలోని సోనిపట్‌‌‌‌కు చెందిన మైడెన్ ఫార్మాస్యుటికల్ లిమిటెడ్ తయారు చేస్తున్నది. వాటిని గాంబియాకు సరఫరా చేసింది. గాంబియాలో 66 మంది పిల్లలు చనిపోవడానికి ఈ 4 సిరప్‌‌‌‌లే కారణమై ఉండొచ్చని డబ్ల్యూహెచ్‌‌‌‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ గేబ్రియేసస్ బుధవారం చెప్పారు. అవి కలుషితమయ్యాయని, నాసిరకంగా ఉన్నాయంటూ రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా మందుల సేఫ్టీ, క్వాలిటీ గ్యారంటీ పత్రాలను డబ్ల్యూహెచ్‌‌‌‌వోకు సదరు కంపెనీ ఇవ్వలేదన్నారు. కలుషిత మందులు ప్రస్తుతం గాంబియాలో బయటపడ్డాయని, వాటిని ఇతర దేశాలకూ సరఫరా చేసి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని వాడొద్దన్నారు. ఆ 4 సిరప్‌‌‌‌ల సరఫరాను అడ్డుకోవాలని, ఒకవేళ సరఫరా జరిగి ఉంటే.. వాటిని గుర్తించి వాడకుండా నియంత్రించాలని సూచించారు. ఘటనపై సదరు కంపెనీతో, ఇండియాలోని రెగ్యులేటరీ అధికారులతో డబ్ల్యూహెచ్‌‌‌‌వో దర్యాప్తు చేస్తున్నదని చెప్పారు. 

మందుల్లో ఏముంది?

గాంబియాలో సరఫరా అయిన ప్రోమేథజిన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్‌‌‌‌మలిన్ బేబీ కాఫ్ సిరప్, మేకాఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్  నాసిరకం ఉత్పత్తులని ‘డబ్ల్యూహెచ్‌‌‌‌వో మెడికల్ ప్రొడక్ట్ అలర్ట్’ గుర్తించి, డబ్ల్యూహెచ్‌‌‌‌కు రిపోర్ట్ చేసింది. ఆ 7  ప్రొడక్టులకు సంబంధించిన శాంపిళ్లను టెస్ట్ చేయగా.. వాటిలో ఆమోదయోగ్యం కానంత మొత్తంలో డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్‌‌‌‌ ఉన్నాయని డబ్ల్యూహెచ్‌‌‌‌వో చెప్తోంది. డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్‌‌‌‌ మనుషులపై విషంలా పని చేస్తాయని, ప్రాణాలు తీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ‘‘వాటితో పొత్తికడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, మూత్ర విసర్జన చేయలేకపోవడం, తలనొప్పి, మానసిక స్థితి మారిపోవడం, కిడ్నీలు దెబ్బతినడం వంటివి జరగొచ్చు. ప్రాణాలు పోవచ్చు” అని అంటోంది.