స్పేస్‌‌ యాత్రలో మహిళ తొలి అడుగు పడి నేటికి 58 ఏండ్లు

V6 Velugu Posted on Jun 16, 2021

మహిళలు ఏ రంగంలోనూ మగవాళ్ల కంటే తక్కువ కాదని ఏనాడో నిరూపించారు. విద్య, వైద్యం, పరిపాలన, సాహిత్యం, శాస్త్ర సాంకేతికత రంగాలే కాదు.. అంతరిక్షంలోనూ ఐదు దశాబ్దాల క్రితమే అడుగుపెట్టారు. 58 ఏండ్ల క్రితం 1963లో జూన్ 16న నారీ లోకమంతా గర్వించ దగ్గ గొప్ప ఘటనను ఈ రోజు ఒక సారి గుర్తు చేసుకోవడం వారికి మనమిచ్చే గౌరవానికి సూచిక. సోవియట్‌‌ యూనియన్‌‌ ప్రయోగంలో భాగంగా వాలెంటినా తెరెస్కోవా స్పేస్‌‌లోకి అడుగుపెట్టిన రోజు ఇదే. ఆమె సాధించిన ఆ విజయం నేటికీ ప్రపంచ మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

పూర్వపు రష్యా సోవియట్ యూనియన్‌‌లోని మాస్‌‌లెన్నికోవోలో 1937 మార్చి 6న పుట్టిన వాలెంటీనా తెరెస్కోవా అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మహిళగా ప్రపంచ చరిత్రకెక్కింది. ఆమె తన ఎనిమిదో ఏట 1945లో స్కూల్‌‌లో చేరింది. కానీ మరో ఎనిమిదేళ్లు గడిచేసరికే ఆమె చదువు మానేసింది. ఆ తర్వాత డిస్టెన్స్‌‌ ఎడ్యుకేషన్‌‌లో డిగ్రీ పూర్తి చేసింది. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కుటుంబపోషణలో తల్లికి సాయంగా తెరెస్కోవా ఒక టెక్స్‌‌టైల్‌‌ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరింది. ఆ జాబ్‌‌ చేస్తూనే స్కై డైవింగ్‌‌ పట్ల ఉన్న ఆమె ఆశను చంపుకోలేక.. 22వ ఏట లోకల్‌‌ ఏరో క్లబ్‌‌లో ట్రైనింగ్​కు జాయిన్‌‌ అయింది. ఇంట్లో తెలియకుండా ఆ శిక్షణ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత 1962లో సోవియట్‌‌ ఎయిర్‌‌‌‌ ఫోర్స్‌‌లో కమిషన్డ్‌‌ ర్యాంక్‌‌లో చేరింది. 1963లో వోస్టోక్-- 6 స్పేస్ క్రాఫ్ట్‌‌ లాంచ్‌‌ కోసం 400 అప్లికేషన్లు వస్తే ఆమె ఒక్కతే ఎంపిక కావడం విశేషం.

మూడు రోజులు స్పేస్‌‌లోనే..
స్పేస్‌‌ ట్రావెల్‌‌కు సెలెక్ట్‌‌ అయిన తెరెస్కోవాకు మొదట సోవియట్ స్పేస్‌‌ రీసెర్చ్‌‌ సైంటిస్టులు ట్రైనింగ్‌‌ ఇచ్చారు. ఆ తర్వాత 1963 జూన్ 16న వోస్టోక్–-6 స్పేస్‌‌ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. భూమి కక్ష్యలో 48 సార్లు తిరిగిన స్పేస్‌‌ క్రాఫ్ట్‌‌లో ఆమె మొత్తం మూడు రోజులు అంతరిక్షంలోనే గడిపింది. దీంతో ఆమె అప్పటికే ఉన్న అమెరికన్‌‌ ఆస్ట్రొనాట్స్‌‌ రికార్డును బ్రేక్‌‌ చేసి, అత్యధిక సమయం స్పేస్‌‌లో ఉన్న ఆస్ట్రొనాట్‌‌గా నిలిచింది. స్పేస్‌‌లో ఉండగా తెరెస్కోవా తీసిన ఫోటోలు ఆ తర్వాతి కాలంలో వాతావరణంలోని పొరల అధ్యయనంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి. అలాగే స్పేస్‌‌లో ఉండగా ఆమె తన బ్లడ్‌‌ శాంపిల్స్‌‌ కలెక్ట్‌‌ చేసుకుని, అంతరిక్షంలో మహిళల శరీరంలో జరిగే మార్పులపై పరిశోధనలకు ఎంతగానో సాయం చేసింది.

ఆమె తర్వాత స్పేస్‌‌లోకి లేడీస్‌‌..
వాలెంటీనా తెరెస్కోవా ఆస్ట్రొనాట్‌‌గా తనదైన ముద్ర వేసి.. ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఒకప్పుడు అంతరిక్ష యానం, పరిశోధనల విభాగంలో మహిళలను ఎంపిక చేసుకోవడం చాలా అరుదుగా ఉండేది. 1980ల నుంచి మహిళా ఆస్ట్రొనాట్స్‌‌ సంఖ్య పెరిగింది. అమెరికా నుంచి భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ లాంటి వారు కూడా స్పేస్‌‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. రష్యా,  అమెరికా, యూరోపియన్‌‌ దేశాలు మహిళలకు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నాయి. అంతరిక్ష యాత్ర చేసిన తొలి మహిళా వ్యోమగామి వాలెంటీనా తెరెస్కోవా  చూపిన అసమాన ప్రతిభా పాటవాలే స్ఫూర్తిగా ఇప్పటికీ ఎందరో ఆమె బాటలో నడుస్తున్నారు.

జీవితాన్ని మార్చేసిన స్పేస్‌‌ ట్రావెల్‌‌
ఈ స్పేస్‌‌ ట్రావెల్‌‌ తర్వాత తెరెస్కోవా జీవితం మారిపోయింది. తొలి మహిళా ఆస్ట్రొనాట్‌‌గా చరిత్రకెక్కిన ఆమె ఎన్నో అవార్డులు, పతకాలను అందుకుంది. హీరో ఆఫ్ ద సోవియట్ యూనియన్, ఆర్డర్ ఆఫ్ లెనిన్, ఆర్డర్ ఆఫ్ ది అక్టోబర్ రెవల్యూషన్, ఆర్డర్ ఆఫ్ ది రెడ్ బ్యానర్ ఆఫ్ లేబర్, ఆర్డర్ ఆఫ్ ది ఫ్రెండ్ షిప్ ఆఫ్ పీపుల్, పైలెట్ - కాస్మోనాట్ ఆఫ్ సోవియట్ యూనియన్ లాంటి ఎన్నో పురస్కారాలు వచ్చాయి. ఆస్ట్రోనాట్‌‌గా వచ్చిన కీర్తితో పొలిటికల్‌‌గా, గవర్నమెంట్‌‌లోనూ పదవులు ఎదురొచ్చాయి. 1966 నుంచి 1974 వరకు ఆమె "సుప్రీం సోవియట్ ఆఫ్ ద సోవియట్ యూనియన్"లో సభ్యురాలిగా ఉంది. 1974 నుంచి 1989 వరకు "ప్రెసీడియం ఆఫ్ ద సుప్రీం సోవియట్" మెంబర్‌‌‌‌గానూ, 1969 నుంచి 1991 వరకు సోవియట్ కమ్యూనిస్ట్‌‌ పార్టీ సెంట్రల్‌‌ కమిటీలోనూ బాధ్యతలను నిర్వర్తించింది. రష్యా ఎయిర్‌‌‌‌ ఫోర్స్‌‌ మేజర్‌‌‌‌ జనరల్ హోదాలో 1997లో రిటైర్‌‌‌‌ అయింది.

Tagged Space, valentina tereshkova, soviet space research, space travel

Latest Videos

Subscribe Now

More News