అక్రమ పట్టా చేసుకున్నరు..సచ్చిపోతా అంటూ ​​​​​​​మహిళ ఆత్మహత్యాయత్నం

అక్రమ పట్టా చేసుకున్నరు..సచ్చిపోతా అంటూ ​​​​​​​మహిళ ఆత్మహత్యాయత్నం

 

  • అడ్డుకున్న చుట్టుపక్కల వారు 
  • నల్లబెల్లి మండలంలో ఘటన

నల్లబెల్లి, వెలుగు: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో ఓ బీఆర్ఎస్​ లీడర్​ తన కూతురుకు పసుపు కుంకుమల కింద ఇచ్చిన భూమికి అక్రమంగా పట్టా చేసుకున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ పంట చేను వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో పక్కనున్న వారు అడ్డుకున్నారు. బాధితురాలి కథనం ప్రకారం..నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన పాక రాజయ్యకు ఇటుకాలపల్లి శివారులోని పిల్లిగుండ్ల వద్ద ఉన్న సర్వే నెంబర్​21/01లో ఎకరం 14 గంటల భూమి ఉంది.  దీన్ని తన కూతురు పెండ్లి సందర్భంగా పసుపు కంకుమ కింద ఇచ్చాడు. రాజయ్యకు వరుసకు పెద్దన్నయ్యే బీఆర్ఎస్​ లీడర్​ పాక సాంబయ్య 2014లో​ అక్రమంగా పట్టా చేసుకున్నాడు.

దీనిపై గతంలోనే నర్సంపేట ఆర్డీఓ ఆఫీసులో రాజయ్య ఫిర్యాదు చేశాడు. ఆఫీసర్ల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. దీంతో మనస్తాపం చెందిన రాజయ్య రెండు సంవత్సరాల క్రితమే చనిపోయాడు. అప్పటి నుంచి రాజయ్య భార్య ఆగమ్మ కూడా భూమి కోసం ఆఫీసర్ల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇది తెలుసుకున్న ఊరి పెద్దమనుషులు జోక్యం చేసుకుని సాంబయ్య చేసింది తప్పని, రూ.20 వేలు తీసుకుని రాజయ్య కూతురు పేరుపై పట్టా చేయాలని కోరారు. డబ్బులు తీసుకున్న సాంబయ్య ఇప్పటివరకు పని చేయలేదు. దీంతో కలత చెందిన ఆగమ్మ  శుక్రవారం చేను దగ్గరకు వెళ్లి పురుగుల మందు తాగబోయింది. చుట్టుపక్కల ఉన్న కొంతమంది చూసి అడ్డుకోవడంతో ప్రాణాపాయం  తప్పింది.