ఆర్మీని చుట్టుముట్టి మిలిటెంట్లను విడిపించుకున్నరు

ఆర్మీని చుట్టుముట్టి మిలిటెంట్లను విడిపించుకున్నరు

ఇంఫాల్: మిలిటెంట్లను పట్టుకున్న సైనికులను మణిపూర్ మహిళలు అడ్డుకున్నరు.. అడుగు ముందుకు వేయకుండా చుట్టుముట్టారు. ఏకంగా పదిహేను వందల మంది మహిళలు ఒకరోజంతా గోడలా నిల్చుండడంతో సైనికులు చివరకు వెనక్కి తగ్గారు. 12 మంది మిలిటెంట్లను వదిలేసి, వారి దగ్గరి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను మాత్రం తీసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటన మణిపూర్ లోని తూర్పు ఇంఫాల్​సమీపంలోని ఇథం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై సైనిక ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మైతీ మిలిటెంట్​ గ్రూపు కాంగ్లెయ్ యవోల్ కన్నా లుప్ (కేవైకేఎల్) సభ్యుల కదలికలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం అందడంతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టి ఇథం గ్రామంలో సోదాలు జరిపామని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు.

ఈ గ్రూపుకు చెందిన 12 మంది మిలిటెంట్లను పట్టుకుని, వారి నుంచి పలు ఆయుధాలనూ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ సమాచారం తెలిసి గ్రామంలోని మహిళలంతా అక్కడికి చేరుకున్నారని, సైనికులను చుట్టుముట్టారు. మిలిటెంట్లను వదిలిపెట్టాలని లేదంటే దారి వదలబోమని స్పష్టం చేశారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు సహకరించాలని, మిలిటెంట్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. పదే పదే విజ్ఞప్తి చేసినా మైతీ తెగకు చెందిన ఆ మహిళలు వినిపించుకోలేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మిలిటెంట్లను బలవంతంగా తరలించే ప్రయత్నం చేయలేదని, మహిళలు ఎంతకూ కదలకపోవడంతో తామే వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చెప్పారు. ఆదివారం మిలిటెంట్లను వదిలేసి, వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలతో సైనికులు అక్కడి నుంచి వచ్చేశారని తెలిపారు.