యూరప్​లో హీట్​వేవ్స్​ ఎఫెక్ట్​

యూరప్​లో హీట్​వేవ్స్​ ఎఫెక్ట్​

జర్మనీ, స్పెయిన్​పై తీవ్ర ప్రభావం: డబ్ల్యూహెచ్​వో

కోపెన్​హాగెన్​(డెన్మార్క్): హీట్ వేవ్స్​ కారణంగా 2022లో యూరప్​లో మొత్తం 15 వేల మంది వరకు చనిపోయినట్టు వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్​ (డబ్ల్యూహెచ్​వో) మంగళవారం ప్రకటించింది. స్పెయిన్, జర్మనీపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. జూన్ నుంచి ఆగస్టు మధ్య యూరప్​ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో టెంపరేచర్​ నమోదు కావడంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించింది. జర్మనీలో అత్యధికంగా 4,500 మంది, స్పెయిన్​లో 4వేల మంది చనిపోయినట్టు డబ్ల్యూహెచ్ వో యూరప్​ రీజినల్​ డైరెక్టర్​ హన్స్​ క్లూగే తెలిపారు. పోర్చుగల్​లో 1,000 మంది, బ్రిటన్​లో 3,200 మంది చనిపోయినట్టు వివరించారు. టెంపరేచర్​ కారణంగా వివిధ దేశాలు వేసుకున్న అంచనాల కంటే ఎక్కువ మరణాలు సంభవిస్తాయన్నారు.

ఈజిప్ట్​లో జరిగిన యూఎన్​ క్లైమెట్​ సమ్మిట్​లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని గుర్తు చేశారు. అడవుల్లో ఏర్పడిన కార్చిచ్చుల కారణంగా కరువుతో పాటు వాతావరణంలో వేడి పెరిగిందని తెలిపారు. పవర్​ గ్రిడ్​పై ఒత్తిడి పడటంతో.. పంటలన్నీ ఎండిపోయాయన్నారు. జూన్​– జులై మధ్య బ్రిటన్​లో రికార్డు స్థాయిలో 40డిగ్రీల టెంపరేచర్​ నమోదైనట్టు వివరించారు. బాడీలో టెంపరేచర్​ పెరగడంతోనే యూరప్​ రీజియన్​లో ఎక్కువ మరణాలు సంభవించాయన్నారు. గుండె జబ్బులు, బ్రీతింగ్​ ప్రాబ్లమ్స్, డయాబెటిస్​తో బాధపడే వారి శరీరంలో టెంపరేచర్​ పెరగడం ప్రమాదకరమని వివరించారు. ఇది కొందరిలో మరణానికి దారితీస్తుందన్నారు. హీట్​ వేవ్స్​ కట్టడికి కఠిన చర్యలు తీసుకోకపోతే మున్ముందు ప్రజలు మరిన్ని వ్యాధుల బారినపడుతారని తెలిపారు. దీంతో రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తాయని హెచ్చరించారు.